ఆ నాలుగు జిల్లాల్లో భారీ ‘మిషన్’

ఆ నాలుగు జిల్లాల్లో భారీ ‘మిషన్’ - Sakshi


రెండో విడతలో మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్,

రంగారెడ్డి జిల్లా చెరువులకు ప్రాధాన్యం

వర్షాభావంతో ఈ జిల్లాల్లోని 8,139 చెరువుల్లో చుక్కనీరు చేరని వైనం

12 వేల చెరువుల్లో 25 శాతం వరకే చేరిన నీరు


 

సాక్షి, హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన ‘మిషన్ కాకతీయ’ రెండో విడతలో.. తీవ్ర నీటి కరువును ఎదుర్కొంటున్న జిల్లాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని నీటి పారుదల శాఖ భావిస్తోంది. మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో చెరువులను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఈ దిశగా ఆయా జిల్లాల్లో ఇప్పటివరకు పునరుద్ధరించిన చెరువులు, ఇంకా చేయాల్సిన జాబితాలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించినట్టు సమాచారం.

 

నీరు చేరకపోవడంతో దుర్భిక్ష పరిస్థితులు

 రాష్ట్రంలో మొత్తం  46,531 చెరువులకుగానూ తొలి విడతగా 9,573 చెరువులను పునరుద్ధరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది 8,215 చెరువుల అభివృద్ధికి రూ.2,586 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చారు. 7,015 చెరువుల పనులు ఆరంభించగా, రూ.522.16 కోట్ల పనులు పూర్తయ్యాయి. రూ.345 కోట్ల మేర చెల్లింపులు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. తొలి దశలో మహబూబ్‌నగర్‌లో 6,985 చెరువులకుగానూ 995, మెదక్‌లో 7,661 చెరువులకు 1,338, నల్లగొండలో 4,650 చెరువులకు 788, రంగారెడ్డిలో 2,856 చెరువులకు 534 చెరువుల పునరుద్ధరణ చేపట్టారు. పూడిక పనులు పూర్తయినా ఇతర పనులు కొనసాగుతున్నాయి. అయితే వర్షాభావ పరిస్థితులతో ఈ నాలుగు జిల్లాల్లో మొత్తం 23,034 చెరువుల్లో 8,139 చెరువుల్లో చుక్కనీరు చేరలేదు. చెరువు పూర్తి నీటి సామర్థ్యంలో కేవలం 25 శాతం మాత్రమే నీరు చేరిన చెరువుల జాబితాలో మరో 12 వేల పైచిలుకు చెరువులున్నాయి.

 

మహబూబ్‌నగర్ జిల్లాలో 90 శాతం చెరువులు చుక్కనీటికి నోచుకోలేకపోయాయి. పునరుద్ధరించిన చెరువుల్లోనే కొద్దిపాటి నీరు చేరి ఊరటనిచ్చింది. నీటి కరువుతో ఆయా జిల్లాల పరిధిలోని చాలా మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రభావం సాగుపై పడటంతో విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. జిల్లాల నుంచి వలసలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రెండో విడత పునరుద్ధరణలో ఈ నాలుగు జిల్లాలపై దృష్టి పెట్టాలని భావిస్తోంది. ఇప్పటికే పరిపాలనా అనుమతులు ఇచ్చిన చెరువులకు నవంబర్ నాటికే సాంకేతిక అనుమతులు, టెండర్లు, ఒప్పందాల ప్రక్రియ పూర్తి చేసి డిసెంబర్‌లో పనులు మొదలుపెట్టాలని భావిస్తున్నారు. కొత్తగా పునరుద్ధరించాల్సిన చెరువుల్లో ఈ నాలుగు జిల్లాల నుంచి ఎక్కువ చెరువులను ఎంపిక చేసి జనవరి తొలి వారానికి పనులు చేపట్టాలని యోచిస్తున్నారు.

 

సమీక్షించిన మంత్రి..


 మిషన్ కాకతీయ పనులపై బుధవారం అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనున్న నేపథ్యంలో.. పనుల పురోగతి, రెండో విడత పనులు, మినీ ట్యాంక్‌బండ్‌ల నిర్మాణం తదితరాలపై నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు మంగళవారం సాయంత్రం జలసౌధలో అధికారులతో సమీక్ష జరిపారు. ఇప్పటివరకు చేపట్టిన పనులు, తీసిన పూడిక, చెరువుల్లో చేరిన నీరు, ప్రాధాన్యం ఇవ్వాల్సిన జిల్లాలు తదితరాలపై సమాచారం సేకరించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top