సంచలనం రేపిన వివాహేతర సంబంధం

సంచలనం రేపిన వివాహేతర సంబంధం


ప్రేయసి, ప్రియుడు ఆత్మహత్యా యత్నం

ప్రియుడు మృతి

అనాథలైన పిల్లలు

చావుబతుకుల మధ్య ప్రియురాలు


 

శ్రీకాకుళం జిల్లా : వివాహేతర సంబంధం ఇద్దరిని ఆత్మహత్యా యత్నానికి ప్రేరేపించింది. వీరిలో ఒకరి ప్రాణం తీసింది. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. మృతుడి పిల్లలను అనాథను కూడా చేసింది. ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఇద్దరికీ వివాహం కావడం, వివాహేతర సంబంధం విషయం వారి ఇళ్లల్లో తెలిసిపోయి కుటుంబ సభ్యులు నిలదీయడంతో మనస్తాపానికి గురై చివరకు ఇద్దరూ తమ వారిని మరచి ఆత్మహత్యా యత్నానికి పాల్పడడం వారిలో ప్రియుడు మృతి చెందడం మంగళవారం సంచలనం రేపింది.


వివరాల్లోకి వెళ్తే....మండలంలోని మకరాంపురం గ్రామానికి చెందిన వజ్జ సురేష్(30), అదే గ్రామానికి చెందిన ఎలుసూరి స్రవంతి మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో గ్రామానికి దూరంగా ఉన్న కంకర గోతులు వద్ద గల జీడితోటలో మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న ప్రియురాలి తరఫు కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌లో సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్స కోసం బరంపురం తరలించారు. ప్రియుడు రమేష్‌ను అక్కడే విడిచిపెట్టేయడంతో అతని కుటుంబ సభ్యులు బైక్‌పై సోంపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. అయితే ఆసుపత్రికి తీసుకొచ్చిన కొద్దిసేపటికే రమేష్ ప్రాణాలు కోల్పోయూడు. అంతకు ముందు ప్రియురాలు స్రవంతి సోంపేట సీఐ సూరినాయుడు, కంచిలి ఎస్‌ఐ ఆర్.వేణుగోపాల్ వద్ద వాంగ్మూలం ఇచ్చింది.

 

ఆ వివరాలిలా ఉన్నాయి. స్రవంతి మాటల్లో...తనకు ప్రియుడు రమేష్‌తో 16 ఏళ్ల కిందట నుంచి ప్రేమ సాగుతోందని, పదేళ్ల కిందట తనకిష్టం లేకపోయినా మేనమామతో వివాహం చేశారని చెప్పింది. తరువాత ప్రియుడు రమేష్ సిలగాం గ్రామానికి చెందిన గాయిత్రిని ప్రేమించి వివాహం చేసుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చినట్టు తెలిపింది. తనకు కూడా ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారని ఇటీవల కాలంలో ప్రేమికులమైన తాము తరచూ కలుస్తూ ఉండేవాళ్లమని చెప్పింది. రెండు నెలల కిందట గ్రామానికి చెందిన దేవాలయంలో రమేష్‌తో మళ్లీ వివాహం చేసుకున్నట్టు తెలిపింది.

 

మా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం గ్రామస్తులు, కుటుంబ సభ్యులకు తెలిసిపోవడంతో అందరూ నానా మాటలు అనడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డామని చెప్పింది. ఇదిలా ఉండగా రమేష్ మృతి చెందడంతో భార్య గాయిత్రి, మూడేళ్ల కుమారుడు అనాథలుగా మిగిలారు. మరోవైపు చావుబతుకుల్లో ఉన్న స్రవంతిని చూసి భర్త, ముగ్గురు పిల్లలు ఆందోళన చెందుతున్నారు. కాగా మృతుని సోదరుడు సురేష్ ఫిర్యాదు మేరకు కంచిలి ఎస్‌ఐ ఆర్.వేణుగోపాల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రమేష్ మృతదేహానికి సోంపేట ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.  

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top