జిల్లాలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత

జిల్లాలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత


సాక్షి, కొత్తగూడెం: భగభగ మండే భానుడి ప్రతాపానికి ప్రజలు విలవిలలాడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సోమవారం అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యల్పంగా కూడా 39.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండటం గమనార్హం. ఉదయం 7 గంటల నుంచే ఎండవేడి మొదలవుతోంది. మధ్యాహ్నం సమయానికి పట్టణం మొత్తం కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తోంది. రోడ్లన్నీ నిర్మానుశ్యంగా మారిపోతుండటంతోపాటు షాపులన్నీ మూతపడుతున్నాయి. దీంతో వ్యాపారాలు సైతం మందగించాయి.



సాయంత్రం 6 గంటలు దాటితే తప్ప ప్రజలెవరూ బయటకు వచ్చేందుకు మొగ్గు చూపడంలేదు. మరోవైపు వేడి గాలుల కారణంగా జిల్లాలో వడదెబ్బమృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రతీరోజు కనీసం నలుగురు వడదెబ్బ కారణంగా మృతిచెందుతున్నారు. జిల్లాలో ఈనెలలో ఇప్పటివరకు 23 మంది వడదెబ్బతో మృతి చెందినట్లు చెప్తుండగా, ఒక్కరు కూడా వడదెబ్బతో మృతిచెందినట్లు అధికారిక లెక్కల్లో లేకపోవడం గమనార్హం. ఎండలు విపరీతంగా పెరుగుతున్నా చలివేంద్రాల సంఖ్య పెరగడంలేదు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలని, ఇటు ఉన్నతాధికారులు, మరోవైపు ప్రజా ప్రతినిధులు ఆదేశాలు జారీ చేసినా వారు మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.


అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లోని చలివేంద్రాల్లో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్ల పంపిణీ ఊసు కన్పించడంలేదు. ఇక కొత్తగూడెం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఒక్క చలివేంద్రం కూడా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. మే నెల ముంచుకొస్తున్నా.. రోజు రోజుకూ ఎండలు విపరీతంగా పెరుగుతున్నా అధికారుల్లో మాత్రం చలనం రావడంలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఎండాకాలం దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముందస్తు సమావేశాలు తప్ప ఆచరణలో మాత్రం కార్యరూపం దాల్చడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top