ఎందుకీ పక్షపాతం..?

ఎందుకీ పక్షపాతం..? - Sakshi


సాక్షి, హైదరాబాద్: చిత్తూరు జిల్లా ఏర్పేడు పోలీసుల తీరుపై హైకోర్టు మండిపడింది. తిరుపతి విమానాశ్రయంలో తనపట్ల దురుసుగా ప్రవర్తించారంటూ ఎయిర్ ఇండియా మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాజంపేట ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులపై కేసు నమోదు చేసినప్పుడు... మిథున్‌రెడ్డి తదితరులిచ్చిన ఫిర్యాదు ఆధారంగా మేనేజర్‌పై కేసెందుకు నమోదు చేయలేదని పోలీసులను ప్రశ్నించింది. ప్రతీ కేసునూ రాజకీయకోణంలో చూడటం తగదని హితవు పలికింది. రాజకీయ కారణాలతో చట్టవిరుద్ధంగా వ్యవహరించడానికి వీల్లేదంది. చట్టప్రకారం వ్యవహరించనప్పుడే ఆరోపణలు వస్తాయని, అలాంటివాటికి అవకాశమివ్వకుండా నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలని సూచించింది.



మేనేజర్ ఫిర్యాదు ఆధారంగా ఎవరినైనా అరెస్ట్ చేయాలని భావిస్తే, సీఆర్‌పీసీ చట్టంలోని సెక్షన్ 41ఎ కింద వారికి నోటీసులిచ్చి, వారి వాదనలు విన్నాక చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. గత నెల 26న తిరుపతి విమానాశ్రయంలో ఎంపీ మిథున్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలు తమపై చేయి చేసుకున్నారంటూ ఎయిర్ ఇండియా మేనేజర్ రాజశేఖర్ ఫిర్యాదు చేయగా ఏర్పేడు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తమపట్ల దురుసుగా ప్రవర్తించడమేగాక తిరిగి కేసు కూడా పెట్టడంతో ఎంపీ మిథున్‌రెడ్డి తదితరులు రాజశేఖర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు రాజశేఖర్‌పై కేసు నమోదు చేయలేదు. పోలీసుల పక్షపాత వైఖరిని ప్రశ్నిస్తూ మిథున్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయగా.. దానిపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ విచారించారు.



 పోలీసులకు రాజకీయాలతో సంబంధం ఏముంది?

 పిటిషనర్ తరఫున న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపిస్తూ.. పోలీసులు రాజకీయ కారణాలతోనే పిటిషనర్ ఫిర్యాదును పట్టించుకోలేదన్నారు. ఒక ఎంపీ ఫిర్యాదునే పోలీసులు పట్టించుకోకుంటే ఇక సామాన్యుల సంగతేమిటన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. రాజకీయ కారణాలతో కేసు నమోదు చేయకపోవడం సరికాదన్నారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది వివరణ కోరారు. హోంశాఖ తరఫు న్యాయవాది సమాధానమిస్తూ.. వ్యక్తిగతంగా వచ్చి ఫిర్యాదు ఇవ్వలేదని, అందుకే కేసు నమోదు చేయలేదన్నారు.



న్యాయమూర్తి స్పందిస్తూ.. వ్యక్తిగతంగానే వచ్చి ఫిర్యాదు చేయాలని ఎక్కడుంది? సుప్రీంకోర్టు ఏం చెప్పిందో మీకు తెలియదా? పోస్టుద్వారా పంపినా, మెయిల్ ద్వారా పంపినా కేసు నమోదు చేయాల్సిందేనని స్పష్టం చేసింది కదా. కానీ మీరు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. రాజకీయ కారణాలతో మీరిప్పుడిలా చేస్తే, వారు కూడా తరువాత ఇలానే చేస్తారు. పోలీసులకు రాజకీయాలతో సంబంధమేముంది..? మేనేజర్ ఫిర్యాదిస్తే కేసు నమోదు చేశారు. మరి పిటిషనర్ ఫిర్యాదిస్తే ఎందుకు కేసు నమోదు చేయలేదు.?’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top