‘ట్యాపింగ్’లో తదుపరి చర్యలు నిలిపివేత


సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (సీఎంఎం) కోర్టులో ఫోన్ ట్యాంపింగ్‌పై జరుగుతున్న విచారణకు సంబంధించిన తదుపరి చర్యలన్నింటినీ హైకోర్టు నిలుపుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెల్యులార్ అపరేటర్లు సీల్డ్ కవర్లలో సమర్పించే నివేదికలను అందుకున్న వెంటనే వాటిని తెరవకుండా, ప్రత్యేక దూత ద్వారా హైకోర్టుకు పంపాలని విజయవాడ సీఎంఎం కోర్టును ఆదేశించింది.


 


విజయవాడ కోర్టు నుంచి సీల్డ్ కవర్లు అందుకున్న తర్వాత వాటిని జాగ్రత్త చేయాలని హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)కు స్పష్టం చేసింది. టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 5(2) అమలు కోసం తమ పరిధిలోని యంత్రాంగాలు, రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రభుత్వ సంస్థలకు తగిన ఆదేశాలు జారీ చేసేలా కేంద్ర ప్రభుత్వానికి సూచించాలని, అలాగే కాల్ డేటా ఇవ్వాలని సెల్యులార్ అపరేటర్లను ఆదేశిస్తూ విజయవాడ సీఎంఎం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. వీటిని సవాలు చేస్తూ తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా దాఖలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా వ్యాజ్యాల విచారణార్హతపై రిజిస్ట్రీతోపాటు ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) పి.వేణుగోపాల్ లేవనెత్తిన అభ్యంతరాలను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ వ్యాజ్యాల్లో ప్రతివాదులుగా ఉన్న కేంద్ర హోంశాఖ కార్యదర్శి, టెలికాం మంత్రిత్వశాఖ కార్యదర్శి, ఏపీ సిట్, బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్, ఐడియా, రిలయన్స్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలానీ, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఏజీ పి.వేణుగోపాల్, అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) నటరాజన్ వాదనలను వినిపించారు. ఉదయ 10.30 గంటలకు ప్రారంభమైన వాదనలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాగాయి.

 

 

 ముందస్తు అనుమతి తీసుకున్నాం..

 

 ముందుగా రాం జెఠ్మలానీ వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం చట్ట ప్రకారమే సెల్యులార్ ఆపరేటర్ల నుంచి వివరాలు కోరినట్లు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు అధికారి సైతం అంగీకరించినట్లు తెలిపారు. అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి అందుకున్న రాతపూర్వక విజ్ఞప్తుల తాలుకు పత్రాలు ఇవ్వాలని సెల్యులార్ ఆపరేటర్లను దర్యాప్తు అధికారి కోరడం వెనుక దురుద్దేశాలు ఉన్నాయని చెప్పారన్నారు. టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం నోడల్ అధికారి టెలీకమ్యూనికేషన్ల శాఖేనని, ఆ శాఖ నుంచి ముందస్తు అనుమతులు కూడా తీసుకున్నామని కోర్టుకు వివరించారు. తర్వాత రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ.. విజయవాడ కోర్టులో జరుగుతున్న ప్రొసీడింగ్స్‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రతివాది కాదని, అయినా ఆ కోర్టు తమ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగే విధంగా ఆదేశాలు జారీ చేసిందన్నారు. సెల్యులార్ అపరేటర్ల వద్ద తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖలు ఉన్నాయని, వాటిని బహిర్గతం చేయడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని, తన పరిధిలో లేని రాష్ట్రం విషయంలో జోక్యం చేసుకునే అధికారం విజయవాడ కోర్టుకు లేదన్నారు. సమాచారం ఇవ్వాలని సెల్యూలార్ అపరేటర్లను తెలంగాణ ప్రభుత్వం కోరడంలో తప్పులేదని అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజన్ తెలిపారు. టెలిగ్రాఫ్ చట్ట నిబంధనలకు లోబడే సమాచారం కోరిందన్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో ఉత్తర, ప్రత్యుత్తరాలు జరిగాయని వివరించారు. ఏపీ ఏజీ వేణుగోపాల్, ఏఏజీ శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. అసలు ఈ వ్యాజ్యాలకు విచారణార్హతే లేదన్నారు. దేశ ప్రయోజనాలు, ప్రజాభద్రతకు సంబంధించిన వ్యవహారాల్లో మాత్రమే కాల్‌డేటా వివరాలు కోరవచ్చునన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top