బాధితులకు అండగా ఆపన్నహస్తం

బాధితులకు అండగా ఆపన్నహస్తం - Sakshi

* నేడు, రేపు ముంపు ప్రాంతాల్లో వైఎస్‌ జగన్‌ పర్యటన

బాధితులను పరామర్శించనున్న ప్రతిపక్ష నేత

 

సాక్షి, అమరావతి బ్యూరో : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 26, 27 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను, సర్వం కోల్పోయి నిరాశ్రయులైన బాధితులను పరామర్శించి వారికి భరోసా కల్పించనున్నారు. జిల్లాలో అధికంగా పల్నాడు ప్రాంతంలో పంట నష్టం వాటిల్లిన దష్ట్యా పొలాలను పరిశీలించి రైతుల కష్టాలను తెలుసుకోనున్నారు. గత ఐదు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు జిల్లా అతలాకుతలమైంది. వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. పలుచోట్ల చెరువులకు గండ్లు పడి పంట చేలు, గ్రామాలు నీట మునిగాయి. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పల్నాడు ప్రాంతంలో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. కొన్నిచోట్ల ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా జిల్లాలో పెద్ద ఎత్తున పంట నష్టం సంభవించింది. మట్టి, రాళ్లు పొలాల్లో మేట వేశాయి. మాచర్ల, గురజాల, సత్తెనపల్లి, పెదకూరపాడు, చిలకలూరిపేట, ప్రత్తిపాడు, బాపట్ల నియోజకవర్గాల్లో వాగులు పొంగడం, కాలువలకు గండ్లు పడటంతో పంట పొలాలు కోతకు గురయ్యాయి. కొన్నిచోట్ల వాగులు పొలాలపై పారడంతో పంట నేలకొరిగింది. గత నాలుగు రోజులుగా పొలాల్లో నీరు నిల్వ ఉండటంతో పత్తి, మిరప పంటలకు భారీ నష్టం సంభవించింది. క్రోసూరు, కాకుమాను, పెదనందిపాడు, బాపట్ల మండలాల్లో వరిపంట దెబ్బతింది. దాదాపు లక్షా 40 వేల ఎకరాల్లో అన్ని రకాల పంటలకు నష్టం వాటిల్లింది. దాదాపు రూ.250 కోట్ల పెట్టుబడులు మట్టిపాలయ్యాయి. జిల్లాలో పంట నష్ట పోయిన అన్నదాతలను, సర్వం కోల్పోయి నిరాశ్రయులైన వారిని జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించనున్నారు. ఆపన్నహస్తం అందించనున్నారు. బాధితుల ఇబ్బందులను తెలుసుకొని వాటిని ప్రభుత్వం దష్టికి తెచ్చి, వారికి ఆసరాగా నిలవనున్నారు. 

 

సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం...

భారీ వర్షాల కారణంగా నిరాశ్రయులైన వారిని కాపాడటంలో ప్రభుత్వం వైపల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మూడు రోజులుగా గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా వారికి బియ్యం, పప్పులు కూడా పంపిణీ చేయలేదు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ఖరారైన నేపథ్యంలో ఆదివారం హడావుడిగా అరకొర బియ్యం పంపిణీ చేశారు. వరద ప్రవాహంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు వీలుగా హెలికాప్టర్‌ అవసరమని పదే పదే ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శికి దష్టికి జిల్లా కలెక్టర్‌ తీసుకెళ్లినా.. సకాలంలో స్పందించలేదు. రోడ్డు మార్గాలను పునరుద్ధరించడంలో తీవ్ర జాప్యం జరిగింది. 

 

నేడు జగన్‌ పర్యటన ఇలా..

దాచేపల్లి/ గుంటూరు(పట్నంబజారు) : వైఎస్‌ జగన్‌ సోమవారం దాచేపల్లి, గురజాల మండలాల్లో పర్యటిస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్‌ తెలిపారు. ఉదయం 10 గంటలకు దాచేపల్లి మండలం పొందుగల చేరుకుంటారని, అక్కడ నుంచి దాచేపల్లి, ముత్యాలంపాడు గ్రామాల్లో వరద వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులను పరామర్శిస్తారని ఆయన చెప్పారు. అనంతరం దాచేపల్లిలోని ఎస్టీ, ఎస్సీ, బీసీ కాలనీల్లో వరదకు దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడతారని తెలిపారు. కాటేరు వాగును కూడా జగన్‌ పరిశీలిస్తారన్నారు. అనంతరం గురజాల మండలం చేరుకుని జంగమహేశ్వరపురం, చర్లగుడిపాడు గ్రామాల్లో వరదకు దెబ్బతిన్న పంటలను, మిర్యాలగూడలో కూడా జగన్‌ పర్యటించి బాధితుల్ని పరామర్శిస్తారని రాజశేఖర్‌ వివరించారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top