బాసరలో యాత్రీకుల యాతన

బాసరలో యాత్రీకుల యాతన


భైంసా(ముథోల్‌) : బాసర క్షేత్రానికి భక్తులు కుటుంబ సమేతంగా వస్తుంటారు. చిన్న పిల్లలతో కుటుంబమంతా రాత్రి సమయంలో రైలు దిగి ఆలయానికి వెళ్లేందుకు అటు ఇటు తిరుగుతూ కనిపిస్తారు. ఆ సమయంలో ముందరున్న ఏ వాహనమైన సరే తీసుకుని ఆలయానికి వెళ్లాల్సిన పరిస్థితి. అర్ధరాత్రి.. అప్పటికే ప్రయాణంలో అంతా అలిసిపోయి ఉంటారు. పిల్లలు తల్లిదండ్రుల ఒడిలోనే నిద్రపోతారు. పిల్లలను ఒడిలో పడుకోబెట్టుకుని పక్కనే ఉన్న ఆలయానికి చేరుకోవాలని యాత్రీకులు తపన పడుతుంటారు.



అలాంటి సమయంలో వచ్చే యాత్రీకులకు రైలు దిగగానే ఉచిత బస్సు సౌకర్యం ఉందని, ఆలయంలో వసతి సౌకర్యం ఉందని చెప్పే ఏర్పాట్లు ఉండాలి. రైల్వేస్టేషన్‌లోనే ఆలయ సిబ్బందిని అందుబాటులో ఉంచి యాత్రీకులకు తగ్గట్లు అవసరమైతే బస్సును 2 నుంచి 3 ట్రిప్పులు అయినా సరే పంపించే ఏర్పాట్లు చేయాలి. బస్సులో వెళ్లే యాత్రీకులు రైలు దిగగానే అక్కడే సేదదీరేలా వసతి కల్పించాలి. బాసర రైల్వేస్టేషన్‌లోనే రైలుమార్గం ద్వారా వచ్చే యాత్రీకులకు వసతి గదులను బుక్‌ చేసుకునేలా ఆన్‌లైన్‌ సౌకర్యం ఏర్పాటు చేయాలి. ఇలా చేస్తే వచ్చే వారికి తక్కువ ధరకే ఆలయ వసతి గృహాలు దొరుకుతాయి. కానీ ప్రస్తుతం వచ్చిన యాత్రీకులంతా ముందు వసతి కోసం ఆలయ అతిథి గృహాలకు వెళ్లి అక్కడ గదులు లేవని చెప్పగానే ప్రైవేటు లాడ్జీలకు తిరగాల్సి వస్తోంది.



ఇలా రాత్రంతా పిల్లాపాపలతో వచ్చే కుటుంబీకులు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. వేకువజామునే స్నానాలు చేసి నిద్ర లేకుండానే పిల్లలకు అక్షరశ్రీకార పూజలు జరిపిస్తున్నారు. దీంతో ఒక్కసారి బాసరకు వచ్చే యాత్రీకులు అక్కడ ఏ సౌకర్యాలూ లేవంటూ పెదవి విరుస్తున్నారు. ఆలయం తరఫున ఉచిత బస్సులను నడిపితే రాత్రి సమయంలో వచ్చే యాత్రీకులకు ఇబ్బందులు దూరమవుతాయి. ఆ బస్సులోనే ఆలయ వసతిగృహాల ఖాళీ గదుల వివరాలను తెలిపే ఏర్పాట్లు చేస్తే యాత్రీకులను నేరుగా అక్కడికే వెళ్లగలుగుతారు.



క్యాబ్‌లు నడిపితే..

ప్రస్తుతం బాసర రైల్వేస్టేషన్‌ నుంచి ఆలయం వరకు ప్రైవేటు ఆటోలు నడుపుతున్నారు. అయితే అభివృద్ధి చెందుతున్న ఈ ఆలయానికి తగ్గట్లు ప్రభుత్వమే క్యాబ్‌లను అందిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. క్యాబ్‌లలో యాత్రీకులకు నిర్ధిష్టమైన అద్దె చెల్లింపునకు రశీదులు అందుతాయి. ఇప్పుడున్న ప్రైవేటు వాహనాల వారు ఇష్టారీతిన యాత్రీకుల వద్ద అద్దె డబ్బులను తీసుకుంటున్నారు. క్యాబ్‌లతో బాసర ఆలయానికి కొత్త అందం కూడా వస్తుంది. యాత్రీకులకు సౌకర్యంగా ఇక్కడ ఎన్నో ఏళ్లుగా వాహనాలు నడిపే వారికి ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చేలా ఉంటుంది. పైగా దేశవ్యాప్తంగా వచ్చే భక్తుల ప్రయాణానికి మెరుగైన సౌకర్యం ఉంటుంది.



రోడ్డుపైనే పార్కింగ్‌

బాసర రైల్వేస్టేషన్‌ వద్ద ఉన్న చౌరస్తాలో ప్రైవేటు ప్రయాణికులను తీసుకెళ్లే వాహనాలను ఇష్టారీతిన పార్కింగ్‌ చేస్తున్నారు. భైంసా–నిజామాబాద్‌ ప్రధాన రహదారిపై ఎప్పుడు చూసినా ఇక్కడ చౌరస్తా సర్కిల్‌లో ప్రయాణికుల కోసం వాహనాలను నిలిపి ఉంచుతారు. ఆలయానికి ప్రతీరోజు వందల సంఖ్యలో యాత్రీకులు వస్తుంటారు. వారిని తీసుకువచ్చే వాహనాల రాకపోకలకు రోడ్లపై నిలిపిన ఈ వాహనాలతో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది.



యాత్రీకుల నిరీక్షణ

రైల్వేస్టేషన్‌ ముందు ప్రధాన రహదారి ఉంది. యాత్రీకులు రైలు దిగగానే బస్సుల కోసం వేచిచూస్తారు. అయితే రైల్వేస్టేషన్‌ సమీపంలోని ప్రధాన రహదారిపై ఇప్పటి వరకు బస్టాండ్‌ నిర్మాణం జరుగలేదు. కిలోమీటరున్నర దూరంలో బాసర గ్రామంలో ఉన్న బస్టాండ్‌ ఎవరికీ ఉపయోగపడడంలేదు. రైలు దిగగానే ట్రిపుల్‌ఐటీకి వెళ్లే విద్యార్థులు భైంసా, మహారాష్ట్రకు వెళ్లేవారు బాసర ఆలయానికి చేరుకునే వారంతా బస్సుల కోసం ప్రధాన రోడ్డుపైకి వస్తుంటారు. వర్షాకాలంలో, వేసవిలో పక్కనే ఉన్న హోటల్‌ షెడ్లలోకి వెళ్లి బస్సు రాగానే పరుగెత్తుకుంటూ వెళ్తారు. ఈ క్రమంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ చౌరస్తా కూడలిలో అందరికీ ఉపయోగపడేలా బస్టాండ్‌ నిర్మాణం చేపట్టాల్సిన అత్యవసరం ఉంది.



అస్తవ్యస్తంగా ట్రాఫిక్‌

ఇక ఇక్కడ ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా ఉంటుంది. బాసర రైల్వేస్టేషన్, గ్రామం, భైంసా, నిజామాబాద్‌ల నుంచి నాలుగు వైపులుగా వచ్చే వాహనాలన్నీ తహసీల్దార్‌ కార్యాలయ సమీపంలోని చౌరస్తా మీదుగా వెళ్తాయి. ఈ చౌరస్తా వద్ద ఇప్పటికీ ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఏర్పాటు చేయలేదు. పుష్కరాల్లో విధులు నిర్వహించే ముథోల్‌కు చెందిన హోంగార్డు కూడా ఇక్కడే రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. బాసరకు చెందిన పలువురు యువకులు సైతం ఇలా రోడ్లపై నిలిపి ఉన్న భారీ వాహనాలకు ఢీకొని మృతిచెందిన సంఘటనలు ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలు జరిగినా ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా స్పందించడం లేదు.



ఉచిత బస్సులు నడపాలి

దూరప్రాంతం నుంచి వచ్చే భక్తులకు ఆలయం నుంచి బస్టాండ్, రైల్వేస్టేషన్, గోదావరి నదికి వెళ్లేలా ఉచిత బస్సులను నడపాలి. అలా చేస్తే ఇబ్బందులు ఉండవు. భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించాలి.

- లక్ష్మి, నిర్మల్‌



వసతి కల్పించాలి

రైల్వేస్టేషన్‌కు రాగానే ఉచిత బస్సు వచ్చే వరకు నిరీక్షించేందుకు వసతి సౌకర్యం కల్పించాలి. రైలు ద్వారా ఒకేసారి వందలాది మంది యాత్రీకులు వస్తారు. అందరినీ ఉచిత బస్సు ద్వారానే ఆలయానికి తరలించాలి.

- భాస్కర్, మహారాష్ట్ర



ఆన్‌లైన్‌లో వివరాలుంచాలి

ఉచిత బస్సు, ఆలయంలో వసతి వివరాలను ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు నమోదుచేయాలి. రైల్వేస్టేషన్‌లో దిగగానే యాత్రీకులకు ఎక్కడెక్కడ గదులు ఖాళీ ఉన్నాయో వివరాలు తెలిపేలా బోర్డులు ఏర్పాటుచేయాలి.

- సురేశ్, మహారాష్ట్ర


Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top