వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు
వరంగల్: అల్పపీడన ద్రోణి ప్రభావంతో వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజామున మొదలైన వాన ఎడతెరిపి లేకుండా పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఏజెన్సీ ప్రాంతంలో కూడా భారీ వర్షం కురుస్తోంది. ఏటూరునాగారం వద్ద జీడివాగు పొంగిపొర్లుతోంది. నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి నీరు చేరడంతో ఉత్పత్తి నిలిచిపోయింది. గ్రేటర్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.