‘తూర్పు’న అంతటా వాన


 -నీట మునిగిన పల్లపు ప్రాంతాలు, కాలనీలు

-వీఆర్ పురం మండలంలో 18.46 సెంటీమీటర్ల వర్షపాతం

-గోదావరిలో ఒకరి గల్లంతు



అమలాపురం


బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా తూర్పు గోదావరి జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకూ భారీ వర్షం కురిసింది. ఐదు రోజులుగా తూర్పున వర్షం కురుస్తున్నా రెండు రోజుల నుంచీ మాత్రం ఏకధాటిగా పడుతూనే ఉంది. నాలుగు విలీన మండలాల్లో కుండపోత వాన కురిసింది.


 


వీఆర్ పురం మండలంలో అత్యధికంగా 18.46 సెంటీమీటర్ల వర్షం కురవగా కూనవరంలో 6.82, చింతూరులో 5.84, ఎటపాకలో 7.64 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి జిల్లాలోని ఏజెన్సీలో వాగులు పొంగుతున్నాయి. చింతూరు మండలం తిమ్మెరగూడెం వద్ద వాగు పొంగి రహదారి మీదుగా ప్రవహిస్తోంది. చింతూరు-వీఆర్ పురాల మధ్య వరుసగా రెండవ రోజూ రాకపోకలకు అవాంతరాలేర్పడ్డాయి. దేవీపట్నం మండలంలో పూడిపల్లి పంచాయతీ పరిధిలోని పోశమ్మగండి వద్ద బొందూరు పంచాయతీ పరిధిలోని పోతవరానికి చెందిన తురం బొర్రన్న దొర ఉదయం చేపల వేటకు వెళ్లి, కాలుజారి గోదావరిలో పడి గల్లంతయ్యాడు.



వర్షం వల్ల రాజమహేంద్రవరం, కాకినాడ నగరాలతోపాటు పలు ప్రాంతాలో ప్రధాన రహదారులు నీట మునిగాయి. రాజమహేంద్రవరంలో రైల్వేస్టేషన్ రోడ్డు, ఎస్‌వీ జనరల్ మార్కెట్, కాకినాడలో శివారు ప్రాంతాలైన పర్లోపేట, దుమ్ములపేట, ముత్తానగర్, సాంబమూర్తినగర్ తదితర పల్లపు ప్రాంతాలు జలమయమయ్యూయి. కోనసీమలో మామిడికుదురు వద్ద ఎన్‌హెచ్-216 మీదుగా, రాజానగరం మండలం సూర్యారావుపేట వద్ద ఎన్‌హెచ్-16 మీదుగా వాన నీరు వేగంగా పారుతోంది. మండపేట, రామచంద్రపురం ప్రాంతాల్లో భారీ వర్షాలకు పల్లపు ప్రాంతాలు, కాలనీలు నీట మునిగాయి. ఈ ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. వర్షాలతో ఇటుకబట్టీలకు ఎక్కువ నష్టం వాటిల్లింది.



నీట మునిగిన నారుమడులు

తూర్పుడెల్టాలోని ఆలమూరు, రామచంద్రపురం, అనపర్తి, మధ్యడెల్టాలో కొత్తపేట, పి.గన్నవరం వ్యవసాయ సబ్ డివిజన్ల పరిధిలో సుమారు 60 వేల ఎకరాల్లో సాగు కోసం వేసిన నారుమడులు నీట మునిగాయి. వరుసగా రెండవ రోజు ముంపులో ఉండడం, ముంపు నీరు తొలగేందుకు మరో రెండు, మూడు రోజులు పట్టే అవకాశమున్నందున నారుమడులు దెబ్బతింటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెట్టలోని తుని, ప్రత్తిపాడు పరిసర ప్రాంతాల్లో మొలకదశలో ఉన్న పత్తిపంట వర్షం వల్ల దెబ్బతినే ప్రమాదముంది. కొత్తపేట నియోజకవర్గం ఆలమూరులో అరటితోటలు వర్షానికి నేలకొరగగా, దొండ, బెండ, చెరకు తోటలు నీటితో నిండిపోవడంతో దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయి. కాగా ఎగువన కురిసిన వర్షాలతో గోదావరిలో నీటిమట్టం పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజి నుంచి మంగళవారం రాత్రి 43,000 క్యూసెక్కుల నీటిని విడిచి పెట్టగా బుధవారం సాయంత్రానికి ఆ పరిమాణం 29,584 క్యూసెక్కులకు తగ్గించారు.



 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top