ముంచెత్తిన వాన

ముంచెత్తిన వాన - Sakshi


అమరావతి సమీపంలో పొంగిన కప్పల వాగు

కొండవీటి వాగుకు చేరుతున్న వర్షపు నీరు

తెనాలి లోతట్టు ప్రాంతాల్లో దెబ్బతిన్న వరి

ఈ వర్షాలతో పంటలకు మేలే అంటున్న అధికారులు




సాక్షి, అమరావతి బ్యూరో :

జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కూడా రోజంతా వర్షం కురుస్తూనే ఉంది.  ఈ వర్షాలు ప్రస్తుతం వేసిన పంటలకు మేలు చేకూర్చుతున్నాయి. ఇంకా పదును కాని మాచర్ల ప్రాంతాల్లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రైతులు పెద్ద ఎత్తున పంటలు సాగు చేయనున్నారు. గుంటూరు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా పలు మున్సిపాలిటీల్లో రోడ్లు చిత్తడిగా మారాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరి, రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. గుంటూరు నగరంలో మ్యాన్‌ హోల్‌లు పొంగి ప్రవహిస్తున్నాయి. తాడికొండ నియోజకవర్గంలోని తాడికొండ, కంతేరు, పొన్నెకల్లు, పాములపాడు గ్రామాల్లో వర్షపు నీరు ప్రత్తి పంట పొలాల్లోకి చేరటంలో నీట మునిగాయి.



అమరావతి సమీపంలో కప్పల వాగు పొంగి ప్రవహించడంతో రెండు గంటల పాటు అమరావతి – క్రోసూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో కూరగాయల సాధారణ సాగు విస్తీర్ణం 32,500 ఎకరాలు కాగా, ఇందులో ఇప్పటికే 16 వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. మిగిలిన విస్తీర్ణంలో ప్రస్తుతం సాగు చేపట్టనున్నారు. జిల్లాలో దాదాపు 2.50 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు. ప్రస్తు›తం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో 30 వేల ఎకరాల్లో మిర్చి పంట వేయనున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు తెనాలి, కొల్లిపర, బుర్రిపాలెం, నందివెలుగు ప్రాంతాల్లో వెదజల్లే పద్ధతిలో సాగు చేసిన వరి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరి మునిగిపోయింది. దాదాపు 50 ఎకరాలకు పైగా వరి పంట నీట మునిగినట్లు సమాచారం.



జిల్లాలో 32.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం...

జిల్లాలో సగటు వర్షపాతం 32.3 మిల్లీమీటర్లుగా నమోదైంది. తుళ్లూరులో అత్యధికంగా 65.4, నూజెండ్లలో అత్యల్పంగా 5 మిల్లీమీటర్లు నమోదైనట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 47 మండలాల్లో 20 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది. మేడికొండూరు 62 మిల్లీమీటర్లు, దాచేపల్లి 58.2, పెదకూరపాడు 55.8, బెల్లంకొండ 54.4, పెదకాకాని 52.4, అమరావతి 50.2, అచ్చంపేట 49.8, తాడికొండ 48.2, తెనాలి 46, కొల్లూరు 45.8, కొల్లిపర 44.6, రెంటచింతల 44.5, క్రోసూరు 42.6, మంగళగిరి 42.2, గుంటూరు 40.4, టి.చుండూరు 38.4, ఫిరంగిపురం 38.2, రాజుపాలెం 38.2, అమృతలూరు 37.2, చేబ్రోలు 36.6, తాడేపల్లి 36.6, సత్తెనపల్లి 33.4, గురజాల 32.4, వేమూరు 32.4, దుగ్గిరాల 31 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.



ఎరువులు, విత్తనాలు సిద్ధం

జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు పంటలకు మేలు చేకూర్చేలా ఉన్నాయి. సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మాచవరం ప్రాంతాల్లో ఇప్పటికే వేసిన ప్రత్తి, అపరాల పంటలకు మేలు చేకూరనుంది. పంటలు వేయకుండా మిగిలిన ఖాళీ పొలాల్లోనూ ప్రస్తుత వర్షాలతో సాగు చేపట్టనున్నారు. ఇప్పటివరకు వర్షాలు లేక సాగు అత్యల్పంగా ఉన్న మాచర్ల ఏడీఏ పరిధిలో ప్రస్తుత వర్షాలతో సాగు విస్తీర్ణం పెరగనుంది. రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువులు, విత్తనాలు సిద్ధం చేసి ఉంచాం. పశ్చిమ డెల్టాలో వర్షం ఆగిపోయిన తరువాత వెద పద్ధతిలో వరి సాగు చేయనున్నారు. మిగిలిన పొలాలకు వరి నార్లు పోస్తున్నారు. – కృపాదాస్, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు, గుంటూరు



30వేల ఎకరాల్లో మిర్చి సాగు

ప్రస్తుత వర్షాలతో జిల్లాలో మిర్చి విత్తనాలు వేయనున్నారు. 30 వేలకు పైగా ఎకరాల్లో సాగు చేయనున్నారు. పసుపు పంటకు కూడా వర్షం మేలు చేకూర్చనుంది. ప్రస్తుతం జిల్లాలో ఉన్న అరటి, బొప్పాయి, నిమ్మకు సైతం ఈ వర్షం ఊపిరి పోయనుంది.

– జయచంద్రారెడ్డి, హార్టీకల్చర్‌ డీడీ, గుంటూరు

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top