ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం


నల్లగొండ : ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ఐటీ., మున్సిపల్, గనులశాఖా మంత్రి కె.తారకరామారావు జిల్లా కలెక్టర్లకు సూచించారు. రాష్ట్రంలో సాగునీటి  రంగంలో వేగవంతంగా ప్రాజెక్టు నిర్మాణాలు జరుగుతున్నందున జిల్లాల కలెక్టర్లతో తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ కార్యదర్శి అరవింద్‌కుమార్, చైర్మన్ సుభాష్‌రెడ్డి, డెరైక్టర్ సుశీల్‌కుమార్‌లతో కలిసి మంగళవారం మంత్రి వీడియో కాన్ఫరెన్‌‌సలో మాట్లాడారు. ప్రాజెక్టుల పనులకు ఇసుక కొరత లేకుండా సకాలంలో అందించే విధంగా ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా స్థానిక అవసరాలకు, ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల ద్వారా ఇసుకను నిర్ధిష్ట రుసుము తీసుకొని ఇసుక రవాణాకు అనుమతించాలని పేర్కొన్నారు. 

 

 సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగరాదని, అదే సమయంలో ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లవద్దన్నారు. పర్మిట్‌లు లేకుండా లారీలు, ట్రక్కుల ద్వారా జరుగుతున్న అక్రమ రవాణాకు సంబంధించిన వాహనాలను సీజ్ చేసి, నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా ట్రాక్టర్ల ద్వారా డంప్ చేస్తున్న ప్రదేశాలను గుర్తించి డంప్‌ను సీజ్ చేసి ఆ ఇసుకను అక్కడే వేలం వేయాలని సూచించారు. వినియోగదారుడికి కనీస ధరకు ఇసుక అందాలని, దళారుల ప్రమేయాన్ని పూర్తిగా నియంత్రించాలని తెలిపారు. పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సంయుక్త తనిఖీ బృందాలను నియమించి తనిఖీలు చేపట్టాలన్నారు. దీనికోసం జిల్లా కలెక్టర్లు ప్రధాన భూమిక పోషించాలన్నారు.

 

  స్థానికంగా ప్రైవేట్ రంగంలో జరుగుతున్న నిర్మాణాలకు ఇసుక సరఫరాపై పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, స్థానిక బిల్డర్స్, కాంట్రాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి సమీక్షించాలని మంత్రి సూచించారు. జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో చేపడుతున్న డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులకు   5 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను గుర్తించినట్లు వివరించారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు సంయుక్త కమిటీ బృందాలను ఏర్పాటు చేశామని, రూ. 150 క్యూబిక్ మీటర్ చొప్పున ఇసుక ధరను నిర్ణయించినట్లు తెలిపారు. స్థానిక అవసరాలకు 1, 2, 3 ఆర్డర్ ప్రకారం ప్రాధాన్యతాపరంగా సమగ్ర ప్రణాళిక ద్వారా ఇసుక రవాణాకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్‌‌సలో గనుల శాఖ సహాయ సంచాలకులు ఎ.సురేందర్, తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.  

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top