ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతో భారీ దోపిడీ


-టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క



చేవెళ్ల


 ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భారీ దోపిడీకి పాల్పడుతోందని.. ప్రభుత్వ చర్యలను ఎండగట్టేందుకు కాంగ్రెస్ అనుబంధ సంస్థలను బలోపేతం చేయడానికి ప్రణాళిక రూపొందించామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క చెప్పారు. కాంగ్రెస్‌పార్టీ అనుబంధ సంస్థల రంగారెడ్డి జిల్లా సమీక్షా సమావేశం చేవెళ్లలోని కేజీఆర్ గార్డెన్‌లో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో భట్టివిక్రమార్క మాట్లాడారు.


 


ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతో వ్యయాన్ని పెంచి లక్షల కోట్ల దోపిడీకి సీఎం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాకు తాగునీరందించడానికి కాంగ్రెస్ హయాంలో అప్పటి సీఎం డాక్టర్. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రూ.36వేల కోట్ల వ్యయంతో ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తే.. దాని నామరూపాలు లేకుండా ఈ ప్రభుత్వం రీ డిజైనింగ్ చేసిందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలో జరుగుతున్న దోపిడీని, అవినీతిని ఎండగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. దళితులకు మూడెకరాల భూ పంపిణీ, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత పథకానికి నిధులు కేటాయించలేదని దుయ్యబట్టారు.


 


నీటి పారుదల ప్రాజెక్టులకు భూ సేకరణ కోసం కాంగ్రెస్ 2013లో భూసేకరణ చట్టం తీసుకువస్తే.. దానిని కాదని బలవంతంగా రైతులనుంచి భూములను లాక్కునే సంప్రదాయానికి తెరతీశారని విమర్శించారు. టీపీసీసీ ఉపాధ్యక్షురాలు పి.సబితారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌పార్టీకి ప్రజల అండ, కార్యకర్తల బలం పుష్కలంగా ఉందన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, అనుబంధ సంస్థల సమన్వయకర్త కుసుమకుమార్, మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఇన్‌చార్జి పి.కార్తీక్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు శారద, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top