కిరోసిన్‌ ధర దడ!

కిరోసిన్‌ ధర దడ!

పెరగనున్న సబ్సిడీ కిరోసిన ధర 

మరోవైపు గ్యాస్‌ కనెక‌్షన్ల మంజూరులో జాప్యం

48,684 మంది సీఎస్‌ఆర్‌ దరఖాస్తు దారుల ఎదురు చూపు

పండగల వేళ మహిళల అవస్థలు 

 

విజయనగరం కంటోన్మెంట్‌: పండగలొస్తున్నాయంటే గృహిణుల్లో వణుకు పుడుతోంది. అటు గ్యాస్‌కనెక‌్షన్‌ రాక... ఇటు సబ్సిడీ కిరోసిన్‌ ధర అందుబాటులో లేక కలవరపడుతున్నారు. సివిల్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ(సీఎస్‌ఆర్‌) కింద గ్యాస్‌ కనెక‌్షన్‌కోసం చేసుకున్న దరఖాస్తులకు అతీగతీ లేకుండా పోయింది. ఒకవైపు సర్కారు మహిళల పేరున కొత్త కనెక‌్షన్లు కుప్పలు తెప్పలుగా ఇస్తామని ప్రకటిస్తుంటే... ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటోంది. కొత్తవలసకు చెందిన వంగ పద్మ అనే మహిళ సీఎస్‌ఆర్‌ గ్యాస్‌ కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకుంది. ఈమెకు గ్యాస్‌ కనెక్షన్‌ ఇచ్చేందుకు ఏజెన్సీలు తిప్పుతున్నాయి. ఈ లోగా ఏజెన్సీ నుంచి ఫోన్‌ సమాచారం వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే సీఎస్‌ఆర్‌లో గ్యాస్‌ కనెక్షన్‌ ఇవ్వడం కుదరదనీ సాధారణ గ్యాస్‌ కనెక్షన్‌ తీసుకోవాలనీ. అదివిన్న ఆమె అవాక్కయింది. కేవలం కొత్తవలసలోనే కాదు జిల్లా వ్యాప్తంగా ఈ సమస్య ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో ఉన్న  గ్యాస్‌ ఏజెన్సీల నుంచి సుమారు ఏడాది క్రితం  సీఎస్‌ఆర్‌ (సివిల్‌ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీ) పథకం కింద 48,684 మంది గ్యాస్‌ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరు గత సంవత్సర కాలంగా గ్యాస్‌ కనెక్షన్‌ కోసం తిరుగుతున్నారు. ఇదిగో అదిగో అన్న ఏజెన్సీలు ఇప్పుడు చావు కబురు చల్లగా చెబుతున్నాయి. 


 

 

కొడిగట్టిన ‘దీపం’

దీపం పథకాన్ని ఓపెన్‌ చేశామని, ప్రత్యేకంగా విడుదల చేయకుండా ఎప్పుడయినా ఆ పథకంలో గ్యాస్‌ కనెక్షన్‌ పొందొచ్చని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం మహిళల పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. కంపెనీలకు విడుదల చేసిన రూ.29 కోట్ల సబ్సిడీని  సర్దుబాటు చేయకపోవడంతో పాటు ఇప్పుడు సాధారణ గ్యాస్‌ కనెక్షన్లే దిక్కయ్యాయి. ఆ కంపెనీలకు చెందిన ఏజెన్సీలు స్టౌలను వివిధ ధరలతో అంటగడుతున్నాయి. అంతే కాదు కుక్కరు, పాన్‌ అంటూ వేరే సరుకులు కూడా తప్పనిసరిగా కొనిపిస్తున్నారు. దీంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. దీపం పథకాన్ని నిత్య సబ్సిడీ కార్యక్రమంగా చేసి రాష్ట్రాన్ని కిరోసిన్‌ ఫ్రీ చేద్దామని ప్రకటించినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగంలో చిత్తశుద్ధి లేక మహిళలకు అవస్థలు తప్పడం లేదు.

 

 

కిరోసిన్‌ ధరా పెంపు 

పీడీఎస్‌ కార్యక్రమం కింద ఇచ్చే సబ్సిడీ కిరోసిన్‌ ధర పెంచేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ప్రస్తుతం ఇస్తున్న కిరోసిన్‌ లీటరు ధర రూ.15లు కాగా దానిని రూ.19లకు పెంచేందుకు నిర్ణయించారు. ఇది నవంబర్‌ నుంచి అమలు కానుంది. జిల్లా వ్యాప్తంగా ప్రతీ నెలా సుమారు 9లక్షల లీటర్ల కిరోసిన్‌ను పంపిణీ చేస్తున్నారు. ఓ పక్క గ్యాస్‌కనెక్షన్లు దొరకక మరో పక్క కిరోసిన్‌ ధరా పెంచేస్తే ఎలా అని మహిళలు మండిపడుతున్నారు.

 

 

సీఎస్‌ఆర్‌ లేదు–దీపంకు అన్వయిస్తాం. - జె.శాంతి కుమారి, డీఎస్‌ఓ, విజయనగరం

సీఎస్‌ఆర్‌ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారికి దీపం పథకంలోకి కన్వర్ట్‌ చేస్తాం. ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. ఎక్కడయినా మార్చకపోతే వారిపై తగు చర్యలు తీసుకుంటాం. కిరోసిన్‌ ధర పెరిగిన ఆదేశాలు మాకింకా రాలేదు. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top