అక్రిడిటేషన్‌ లేకుండానే హెల్త్‌ కార్డులు

అక్రిడిటేషన్‌ లేకుండానే హెల్త్‌ కార్డులు - Sakshi


► విద్యార్హతలు లేకుండా అక్రిడిటేషన్‌

► రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టుల యూనియన్‌

► జోగిపేటలో జిల్లా జర్నలిస్టుల సమావేశం




జోగిపేట(అందోలు): త్వరలో రాష్ట్రంలో అక్రిడిటేషన్‌ కార్డులు లేని జర్నలిస్టులకు కూడా హెల్త్‌ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఒప్పుకుందని రాష్ట్ర తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల యూనియన్‌  ప్రధాన కార్యదర్శి విరాహత్‌ అలీ అన్నారు. గురువారం జోగిపేటలోని  శ్రీరామా ఫంక్షన్‌ హాలులో జరిగిన జిల్లా టీయూడబ్ల్యూజే (ఐజేయూ)  సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సమావేశానికి  ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రంగాచారి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విరాహత్‌ అలీ మాట్లాడుతూ గత నెల 22న జర్నలిస్టుల సమస్యలపై స్పందించిన సీఎం మూడు రోజుల్లో జర్నలిస్టు సంఘాల నాయకులు, ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించారన్నారు.



అక్రిడిటేషన్‌ కార్డులు లేకున్నా హెల్త్‌ కార్డులు, విద్యార్హతతో సంబంధం లేకుండా అక్రిడిటేషన్‌ కార్డులు ఇచ్చేందుకు నిర్ణయించిన ఫైలుపై సీఎం కేసీఆర్‌ సంతకం చేసి కమిటీని కూడా వేశారన్నారు. రాష్ట్రంలో 430 మంది వరకు జర్నలిస్టులు చనిపోతే ఇప్పటి వరకు కేవలం 130 మందికి మాత్రమే ఆర్థికంగా సహకారం అందిందన్నారు. జిల్లా అధ్యక్షుడు రంగాచారి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల కోసం రాజీలేని పోరాటం చేస్తున్నామన్నారు. రాష్ట్ర నాయకుడు కాల్వ మల్లికార్జున్‌రెడ్డి మాట్లాడుతూ అందరూ ఐక్యంగా ఉండాలన్నారు.



జర్నలిస్టుల ర్యాలీ: జోగిపేటలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం నుంచి జర్నలిస్టులు ర్యాలీ చేపట్టారు. స్థానిక అంబేద్కర్‌ చౌరస్తా మీదుగా శ్రీ రామ ఫంక్షన్‌ హాలు వరకు ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఫైజల్,  జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్‌రెడ్డి,  వెంకట్‌రెడ్డి, జిల్లా నాయకులు దుర్గారెడ్డి , రవిచంద్ర, మన్మథరావు, పానుగంటి కృష్ణ, జగన్మోహన్‌రెడ్డి, సిద్దన్నపాటిల్, హైమద్,  శివగౌడ్, మురళి, ఖయ్యూం, ఆరీఫ్, అందోలు తాలుకా ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు భూమయ్య, నాయకులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top