టీడీపీ వాళ్లే రాళ్లు విసిరారు: మంత్రి హరీశ్ రావు

టీడీపీ వాళ్లే రాళ్లు విసిరారు: మంత్రి హరీశ్ రావు


-  ప్రతిపక్షాలవి కవ్వింపు చర్యలు: మంత్రి హరీశ్

సిద్దిపేట: మల్లన్న సాగర్ ప్రాజెక్టు విషయంలో ప్రతిపక్షాలు కవ్వింపు చర్యకు దిగుతున్నాయని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. రైతులను రెచ్చగొట్టి రోడ్లపైకి తెచ్చి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించేందుకు టీడీపీ నాయకులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని, అందుకు ఆదివారం నాటి ఘటనే  నిదర్శనమన్నారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో ఆదివారం రాత్రి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మల్లన్నసాగర్ నిర్మాణం కోసం ఇప్పటికే ఐదు గ్రామాలు పూర్తిగా సంసిద్ధత వ్యక్తం చేశాయని, ఇంకో గ్రామం మరో రెండ్రోజుల్లో స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. మిగిలిన వేములఘాట్, ఎర్రవల్లి గ్రామస్తులతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందన్నారు. వారితో ఎన్నిసార్లరుునా చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నామని, భూనిర్వాసితులను అన్ని రకాలుగా అదుకుంటామని ప్రతిపక్షాల మాయలో పడొద్దని విజ్ఞప్తి చేశారు.

 

 ప్రతాప్‌రెడ్డికి ఆ గ్రామాల్లో ఏం పని?

 టీడీపీ నాయకుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆదివారం తన అనుచరులతో వెళ్లి రైతులను రెచ్చగొట్టాడని, రైతుల వెనక టీడీపీవాళ్లు చేరి పోలీసులపై రాళ్లు విసిరారని హరీశ్ పేర్కొన్నారు. దీంతో ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారన్నారు. దీనిపై పోలీసులను హెచ్చరించామని, భవిష్యత్‌లో రైతులు ఎదురు తిరిగినా, గాయపర్చినా సంయమనంతో మెలగాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ప్రతాప్‌రెడ్డికి మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో ఏం పని అని ప్రశ్నించారు. ప్రాజెక్ట్ పూర్తయితే రాజకీయ భవిష్యత్ ఉండదన్న భయంతోనే టీడీపీ, కాంగ్రెస్‌లు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం రెండు పంటలు పండే 50 వేల ఎకరాల భూమిని బలవంతంగా లాక్కుందని, అక్కడి రైతులు విలపించినా పట్టించుకోలేదన్నారు.

 

 టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులు అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరి 2013 భూసేకరణ చట్టాన్ని రద్దు చేయాలన్న తీర్మానంపై పార్లమెంట్‌లో సంతకం చేశారని గుర్తు చేశారు. అక్కడ చట్టం రద్దు కోసం సంతకం చేసి, ఇక్కడ భూసేకరణకు 2013 చట్టాన్ని అమలు చేయాలనడం టీడీపీ రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని దుయ్యబట్టారు. వేములఘాట్, ఎర్రవల్లి గ్రామాల ప్రజలు, రైతులు ఆందోళన చెందవద్దని, వారి ఇష్టం మేరకే భూసేకరణను రెండు పద్ధతుల్లో నిర్వహిస్తామన్నారు. ఈ గ్రామాల రైతులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని టీడీపీ నాయకులను హెచ్చరించారు. కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రులు సునీత లక్ష్మారెడ్డి, దామోదర రాజనర్సింహ ఎందుకు బంద్‌కు పిలుపునిచ్చారో చెప్పాలన్నారు. నర్సాపూర్, జోగిపేటకు గోదావరి నీళ్లు రావడం ఇష్టం లేదా అని వారిని ప్రశ్నించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top