నాడు నోరు తెరవలేదు.. నేడు అడ్డుకుంటారా?

నాడు నోరు తెరవలేదు.. నేడు అడ్డుకుంటారా? - Sakshi


ఉత్తమ్‌పై హరీశ్ ధ్వజం

 

 ఆలేరు: నాడు తన నియోజకవర్గంలో పులిచింతల ప్రాజెక్టు చేపడితే నోరు తెరవని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. 2.25 లక్షల ఎకరాల సాగునీరు అందించేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన మల్లన్నసాగర్ ప్రాజెక్టును అడ్డుకుంటానని పేర్కొనడం బాధాకరమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. నల్లగొండ జిల్లా ఆలేరులో శుక్రవారం నిర్వహించిన పార్టీ నియోజకవర్గ స్థాయి సమాశంలో ఆయన మాట్లాడారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ప్రతిపక్షాలు కుట్రలకు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు.



మల్లన్నసాగర్ ప్రాజెక్టు ద్వారా ఎనిమిది గ్రామాలు మాత్రమే ముం పునకు గురవుతున్నాయని.. నిర్వాసితులకు ఎకరానికి రూ.7 లక్షలు, డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ఇక ఏపీ సీఎం బాబుకు రేవంత్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు చంచాలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. శుభమా..అని పెళ్లి ముహూర్తం పెట్టుకుంటే.. కావాలని ఒకడు ముక్కులో పుల్ల పెట్టుకుని తుమ్మినట్లుగా ప్రతిపక్షాల పాత్ర ఉందని మంత్రి విమర్శించారు. ఇకనైనా ప్రతిపక్షాలు తమ వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు. సమావేశంలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top