అభివృద్ధిని అడ్డుకుంటే సహించం

అభివృద్ధిని అడ్డుకుంటే సహించం - Sakshi


కాంగ్రెస్, టీడీపీలపై హరీశ్‌రావు మండిపాటు

 

మీ రాజకీయ మనుగడ కోసం అభివృద్ధికి ఆటంకం కలిగిస్తారా?

ఆంధ్రా నాయకుల రాద్ధాంతానికి మద్దతు పలుకుతారా?

వారికి ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని వ్యాఖ్య

మహబూబ్‌నగర్ జిల్లాలో రెండో రోజు పర్యటన

పలు చోట్ల మిషన్ కాకతీయ పనుల ప్రారంభం

పనుల్లో జాప్యంపై అధికారులను నిలదీసిన మంత్రి

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సస్పెన్షన్ వేటు తప్పదని హెచ్చరిక


 

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు ప్రాజెక్టు వంటి ప్రజాహిత కార్యక్రమాలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్, టీడీపీలకు రాజకీయాలు కావాలో.. ప్రజల సంక్షేమం కావాలో తేల్చుకోవాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రాజకీయ మనుగడ కోసం అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటే సహించబోమని హెచ్చరించారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం నిజాలాపూర్‌లో మిషన్ కాకతీయ రెండో విడత పనులను హరీశ్‌రావు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడారు.



రాజకీయ మనుగడ కోసం ప్రజాహిత కార్యక్రమాలను అడ్డుకుంటున్న కాంగ్రెస్, టీడీపీలను ప్రజలు రాజకీయ సమాధిచేసే రోజులు ఎంతో దూరంలో లేవని వ్యాఖ్యానించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్, టీడీపీలు చేస్తున్న రాద్ధాంతానికి ఆ పార్టీల తెలంగాణ నేతలు వత్తాసు పలకడం దారుణమని చెప్పారు. పాలమూరు ప్రజలు కరువుతో మాడినా, దుర్భర దారిద్య్రం అనుభవిస్తున్నా ఆ పార్టీలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు.

 

నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు..

మహబూబ్‌నగర్ జిల్లాలో మిషన్ కాకతీయ పనుల పురోగతిపై అధికారులను మంత్రి హరీశ్‌రావు నిలదీశారు. వేదికపైకే పిలిచి వారి డివిజన్లలో కేటాయించిన చెరువుల జాబితా, పనుల తీరును పరిశీలించారు. రెండో విడతలో మంజూరైన చెరువులకు సంబంధించి ఇంకా ఒప్పందాలు పూర్తి కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు జిల్లాకు రెండో విడతలో 1,530 చెరువులకు రూ.420 కోట్లను మంజూరు చేస్తే... కేవలం 570 చెరువుల అగ్రిమెంట్లు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ‘‘ముఖ్యమంత్రి ఎంతో ప్రేమతో నిధులు మంజూరు చేశారు. అధికారులు పనిచేయకపోతే వ్యవసాయ సీజన్ ప్రారంభంనాటికి పనులు పూర్తికావు. అప్పుడు రైతులు మరో సంవత్సరం నష్టపోవాల్సి వస్తుంది. తెలంగాణ మొత్తానికి రాని నిధులు పాలమూరుకు ఇస్తే మీరు పనిచేయకపోతే ఎలా? ఈ నిర్లక్ష్యాన్ని ఇక ముందు సహించబోం. సస్పెన్షన్ వేటు వేయాల్సి వస్తుంది..’’ అని హరీశ్ హెచ్చరించారు.



మే 3న లేదా 4న జిల్లాకు వచ్చేసరికి అన్ని చెరువుల అగ్రిమెంట్లు పూర్తికావాలని, లేకుంటే సంబంధిత డీఈలను సస్పెండ్ చేస్తానని పేర్కొన్నారు. టెండర్లు తెరిచిన వెంటనే ఎమ్మెల్యేల కోసం ఆగకుండా పనులను మొదలుపెట్టాలని ఆదేశించారు. శంకర సముద్రం వద్ద కానాయపల్లివాసులు పరిహారం తీసుకున్నా ఖాళీ చేయడం లేదని... దాన్ని విడిచిపెట్టేది లేదని పేర్కొన్నారు. వెంటనే గేట్లు బిగించి నీళ్లు నింపి పొలాలకు పారిస్తామన్నారు. హరీశ్‌రావు వెంట మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ తదితరులు ఉన్నారు.

 

సుడిగాలి పర్యటన

మంత్రి హరీశ్‌రావు రెండో రోజూ జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. శుక్రవారం రాత్రి జొన్నలబొగుడ రిజర్వాయర్ వద్ద నిద్రించిన మంత్రి... శనివారం ఉదయం సొరంగం, సర్జిపుల్ పంపు, విద్యుత్ మోటార్ల పనులు పరిశీలించారు. అనంతరం నాగర్‌కర్నూల్‌కు చేరుకున్నారు. అక్కడ మినీ ట్యాంక్‌బండ్, మిషన్ కాకతీయ, నూతన మార్కెట్ యార్డు, గోదాం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి అడ్డాకుల మండలం నిజాలాపూర్‌కు చేరుకుని మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు. తర్వాత దేవరకద్రకు వెళ్లి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడినుంచి మహబూబ్‌నగర్‌కు చేరుకుని పెద్దచెరువు వద్ద నిర్మించిన ట్యాంక్‌బండ్‌ను పరిశీలించారు. అక్కడ విలేకరులతో మాట్లాడిన అనంతరం హైదరాబాద్‌కు వెళ్లిపోయారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top