ఇజ్జత్ కాపాడిన

ఇజ్జత్ కాపాడిన


మార్కెట్ లేకపోతే తెచ్చిన.. ‘ఖేడ్’ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

బడీడు పిల్లలు నీళ్లు మోస్తుంటే కాంగ్రెసోళ్లకు కనిపించలేదా?

ఒక్క అంబులెన్సును కూడా తీసుకురాని దద్దమ్మలు

కాంగ్రెస్ నేతలను నిలదీసిన మంత్రి హరీశ్‌రావు

టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ‘మీట్ ది ప్రెస్’

పలు అంశాలపై ఘాటుగా స్పందించిన మంత్రి


సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ‘నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఇప్పటివరకు వ్యవసాయ మార్కెట్ లేకపోతే మీకు ఇజ్జత్ అనిపించలేదా..?, కంగ్టి మండలంలో మూడంటే మూడే ఉన్నత పాఠశాలలు ఉన్నప్పుడు మీకేం బాధకలగలేదా..?, చిన్న పిల్లలు బడి మానేసి నీళ్లు మోస్తుంటే మీ గౌరవం తగ్గలేదా..?, ఖేడ్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక్క ఆసుపత్రి, అంబులెన్స్ తెచ్చుకోలేక పోయినప్పుడు మీ ఆత్మగౌరవం దెబ్బతినలేదా..?’ అని రాష్ర్ట నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు కాంగ్రెస్ నేతలను  ప్రశ్నించారు. మంగళవారం టీయూడబ్ల్యూజే  ఆధ్వర్యంలో ఖేడ్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.


జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు హరీశ్‌రావు సమాధానమిచ్చారు. నారాయణఖేడ్ చరిత్రలోనే తొలిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలకు కనీసం డిపాజిట్లు కూడా రావని మంత్రి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంజీవరెడ్డి... ‘మన ప్రాంతం- మన పాలన’ ఆత్మగౌరవం నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యంలో హరీశ్‌రావు ఘాటుగా విమర్శించారు. ‘150 పడకల ఆసుపత్రికి కోట్లాది రూపాయలు మంజూరు చేయించి మీ ఇజ్జత్ నిలబెట్టిననా.. తీసేసిననా చెప్పండి..?. ఖేడ్ ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడ్డారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో వ్యవసాయ మార్కెట్ లేకపోతే రూ.14 కోట్లు ఇచ్చి అధునాతన మార్కెట్‌ను మంజూరు చేసి మీ గౌరవం కాపాడలేదా.? అంటూ కాంగ్రెస్ నేతలపై ఎదురు దాడి చేశారు.


కేవలం మూడు శాతమే ఉన్న జాతీయ రహదారి రోడ్లను రూ.170 కోట్లు ఖర్చు చేసి 38 శాతానికి పెంచలేదా? ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సునీతారెడ్డి ఇక్కడి వాళ్లేనా?, రేపొద్దున ఎన్నికలు ముగిసిన తరువాత వాళ్ల మొఖం మళ్లీ చూపెడతారా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ‘జిల్లా మంత్రిగా నేను మీమధ్యే ఉంటా. ఖేడ్‌ను దత్తత తీసుకున్నా. ముఖ్యమంత్రి కాళ్లుమొక్కైనా దుబ్బాక తరహా ప్యాకేజీ తీసుకొస్తా. నియోజకవర్గాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తా. ఏళ్లకేళ్లుగా మీరు తీసుకు రాలేని ఆసుపత్రిని నారాయణఖేడ్‌లో ప్రజలకు నీళ్లు, రోడ్డు, విద్య, వైద్యం ప్రధాన సమస్యలను తీర్చిన. ఈ మౌలిక అవసరాలకే అధిక ప్రాధాన్యమిస్తున్నా’ని తెలిపారు. నీళ్లు లేక తన కొడుకుకు పిల్లను కూడా ఇవ్వడం లేదని కంగ్టి మండలం సర్దార్ తండాకు వెళ్లినప్పుడు చిమ్నిబాయి అనే మహిళ చెప్పిన మాటలు తనను తీవ్ర ఆవేదనకు, ఆలోచనకు గురిచేశాయన్నారు.


తాను సింగూరు జలాలను ఘణపురం వైపునకు తీసుకపోవడం వలనే మంజీర ఎండిపోయిందని కొంత మంది, కాంగ్రెస్, టీడీపీ నాయకులుచెబుతున్నారు. వీళ్లకు తెలివి ఉందో? లేదో అర్థం కావడం లేదు. ఈ ఏడాది వర్షాలు లేక సింగూరుకు నీళ్లే చేరలేదు. ఇలాంటి పరిస్థితిలో ఇంకా నీళ్లు ఎలా వదులుతాం?. ఇరిగేషన్ రికార్డులు చూసుకుంటే తెలుస్తుంది కదా..?. ఓట్ల కోసం అబద్ధాలు చెప్తే జనం నమ్మె పరిస్థితిలో లేరు అని మంత్రి విమర్శించారు. చరిత్రలో మొదటి సారి హైదరాబాద్‌కు సింగూరు జలాలను నిలిపివేసి జిల్లాకే వినియోగిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. మిషన్ భగీరథ పథకం కింద 9 నెలల నుంచి ఏడాది కాలం లోపు నారాయణఖేడ్‌లో ప్రతి ఇంటికి తాగు నీళ్లు అందిస్తామని ప్రకటించారు.  ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీఇంజినీరింగ్ ద్వారా పెద్దశంకరంపేట, నారాయణఖేడ్ ప్రాంతాలకు సాగునీటిని అందిస్తామన్నారు. గట్టు లింగంపల్లి వద్ద మరో బ్యారేజ్ కట్టడం కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు.


వ్యాస్కోప్ అనే కేంద్ర పాలన సంస్థ దీని డిజైన్‌పై కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ బ్యారేజ్ ద్వారా నారాయణఖేడ్ ప్రాంతానికి 77 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని, మనూరు, కంగ్టి, కల్హేర్ మండలాలు లబ్ధిపొందుతాయని చెప్పారు. కరెంటు సరఫరా, సంక్షేమ పథకాల అమలు, రోడ్ల నిర్మాణం తదితర పనులు ఎలా ఉన్నాయో..? పక్కనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్న కర్ణాటకతో పోల్చుకొని ప్రజలే చెబుతున్నారన్నారు. ఇంతకాలం నారాయణఖేడ్ ప్రాంతంలో ఫ్యాక్షన్, కక్షలు, పోలీసు కేసులు, రాత్రి పూట ప్రచారాలతో ఎన్నికలు నడిపించేవారు. జర్నలిస్టులు పత్రికల్లో రాస్తే వారిపై దాడులు చేసేవాళ్లని, ఇక అలాంటి వాటికి కాలం చెల్లిందన్నారు. తండ్రి చనిపోయాడని తల్లిని ప్రజల్లోకి తీసుకొచ్చి మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని, కానీ  రాష్ర్టంలో ఎక్కడలేని విధంగా నారాయణఖేడ్‌లో సాగిన ఫ్యాక్షన్ రాజకీయలతో ఎన్ని కుటుంబాలు కన్నీళ్లు పెట్టాయో కూడా ప్రజలకు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.


ఇంతకాలం ప్రజలను పస్తులుంచిన కాంగ్రెస్ నేతలు మాత్రం ఆస్తులు సంపాదించుకున్నారన్నారు. ఇక మీదట ప్రజలు 2016 ఉప ఎన్నికలకు ముందు నారాయణఖేడ్ అభివృద్ధి, తరువాత నారాయణఖేడ్ అభివృద్ధి అని చరిత్రలో చెప్పుకుంటారని మంత్రి అన్నారు. టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి అధ్యక్షతజరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్, ఉపాధ్యక్షులు పల్లె రవి, పీవీ శ్రీనివాస్, సీనియర్ పాత్రికేయులు, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ, టీఆర్‌ఎస్ నాయకులు దేవేందర్‌రె డ్డి, యూనియన్ జిల్లా నేతలు పరుశురాం, శ్రీనివాస్, యోగానందరెడ్డి, సునిల్, వెంకటేశ్, రాజు, శ్యాంసుందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top