ప్రగతి పథం

ప్రగతి పథం - Sakshi


∙ ధార్మిక, కార్మికక్షేత్రంగా అభివృద్ధి

∙ చేనేత పరిశ్రమ ప్రగతికి త్రిముఖ వ్యూహం

∙ పండుగలా వ్యవసాయం

∙ కులవృత్తులకు పూర్వవైభవం

∙ వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌

∙ స్వచ్ఛతలో జాతీయస్థాయి గుర్తింపు

∙ టీఎస్‌ ఐ–పాస్‌లో రూ.987 కోట్లు

∙ నిరుద్యోగుల కోసం 81 పరిశ్రమలు

∙ నర్మాలలో 50 ఎకరాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌

∙ పెద్దూరు, జిల్లెల్ల వద్ద ఇండస్ట్రియల్‌ పార్క్‌లు

∙ డిసెంబర్‌ నాటికి ఇంటింటికీ ‘మిషన్‌ భగీరథ’ నీళ్లు

∙ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌

∙ జిల్లాలో తొలి స్వాతంత్య్ర దినోత్సవం




సిరిసిల్ల: స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తి, అహింసామార్గంతో, ప్రజాస్వా మ్య పద్ధతిన సబ్బండ వర్ణాల మహోద్యమం ద్వారా తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నం సాకారం చేసుకున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. స్వాతంత్య్ర దినోత్స వం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో మంగళవారం నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ పతాకం ఆవిష్కరించి, పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కొత్తగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధికి ప్రభు త్వం చేపట్టిన కార్యక్రమాలు, ప్రగతి నివేదిక, భవిష్యత్‌ కార్యాచరణ, ప్రతిపాదనలను ఆయన తన సుదీర్ఘ ప్రసంగంలో వివరించారు.



కులవృత్తులకు పూర్వవైభవం..

కులవృత్తులకు పూర్వవైభవం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి చెప్పారు. యాదవ, కురుమలకు ఉపాధి మెరుగు పర్చేందుకు జిల్లాలో 16,162 మందిని గుర్తించి ఒక్కొక్కరికి రూ.1.25 లక్షల చొప్పునరూ.220 కోట్లతో 3,39,402 గొర్రెలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 2400 మందికి గొర్రెలు అందించామన్నారు. వీటికి సత్వర వైద్యం అందించేందుకు త్వరలోనే సంచార వైద్యశాలు ప్రారంభిస్తామని తెలిపారు. మత్య్సరంగం అభివృద్ధికి గతేడాది 95 చెరువుల్లో 30.50 లక్షల చేపపిల్లలు వదిలామని, ప్రస్తుతం 210 చెరువుల్లో రెట్టింపు చేపపిల్లలు  పంపిణీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. నాయీబ్రాహ్మణులకు అధునాతన సెలూన్లు, రజకులకు వాషింగ్‌ మిషన్లు అందించేందుకు పథకాలు రూపొందించా మని తెలిపారు. నేతకార్మికులు, విశ్వబ్రాహ్మణులు, కల్లుగీసే గౌడ వృత్తిదారులు, మేర కులస్తులు, కుమ్మరి పనివారికి ఆర్థిక ప్రేరణ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని అన్నారు. ఇప్పటికే రూ.వెయ్యి కోట్ల బడ్జెట్‌లో అత్యంత వెనకబడిన వర్గాల కార్పొరేషన్‌ ఏర్పాటు చేశామని తెలిపారు.



డిసెంబరు నాటికి ఇంటింటికీ నల్లానీరు..

13 మండలాల్లో 341 ఆవాసాలకు మిషన్‌భగీరథ ద్వారా వ చ్చే డిసెంబరు నాటికి సురక్షిత తాగునీరు అందించేందుకు రూ.1132 కోట్లతో పనులు చేపట్టామని కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీ, వేములవాడ నగరపంచాయతీతో పాటు జిల్లాలోని 5.50 లక్షల మంది ప్రజలకు నీళ్లు అందిస్తామన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా 625 చెరువులకు గాను ఒకటి, రెండు, మూడో దశ కింద రూ.194 కోట్లతో 295 చెరువుల పునరుద్ధరణ చేపట్టామన్నారు. 162 చెరువుల పనులు పూర్తయ్యాయని, మిగతావి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో రూ.20 కోట్లతో ప్రతీ మండల కేంద్రంలో ఒక్కటి చొప్పున నాలుగు మినీ ట్యాంక్‌బండ్‌లు మంజూరు చేశామని తెలిపారు. వేములవాడ గుడి చెరువును అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. చెరువులు అన్యాక్రాంతం కాకుండా జియోట్యాగింగ్‌ చేశామని అన్నారు.



పరిశ్రమలకు ‘టీఎస్‌ ఐపాస్‌’..

జిల్లాలో టీఎస్‌ ఐ–పాస్‌ పథకం కింద రూ. 987 కోట్ల పెట్టుబడితో 81 పరిశ్రమల స్థాపనకు ప్రతిపాదనలు వచ్చాయని, ఇప్పటి వరకు 58  స్థాపించామని, 872 మందికి ఉపాధి కల్పించామని మంత్రి వివరించారు.  గంభీరావుపేట మండలం నర్మాలలో 50 ఎకరాల్లో ఫుడ్‌ప్రాసెసింగ్‌ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సిరిసిల్ల మండలం పెద్దూరులో 120 ఎకరాలు, తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. హరితహారం ద్వారా ఈ ఏడాది 46.60 లక్షల మొక్కలు నాటామని వివరించారు. జిల్లెల్ల వద్ద ఐదెకరాల్లో శ్వేతవనం ఏర్పాటు చేస్తున్నామని, సిరిసిల్ల కొత్తచెరువు పక్కన స్మృతి వనం నిర్మిస్తామని వివరించారు. హరితహారంలో పారదర్శకత, జవాబుధారీతనం పెంచేందుకు ప్రతి మొక్కకూ జియోట్యాగింగ్‌ చేస్తున్నామని కేటీఆర్‌ తెలిపారు. దళితులకు భూమి కొనుగోలు పథకంలో 120 మంది లబ్ధిదారులకు 450 ఎకరాలు పంపిణీ చేసినట్లు తెలిపారు.



సంక్షేమ రంగంలో..

జిల్లాలో 1,11, 503 మందికి వృద్ధాప్య, వితంతు, గీత, చేనేత, బీడీకార్మికుల, వికలాంగులకు రూ.11.15 లక్షలు పింఛన్లు పంపిణీ చేస్తున్నామని కేటీఆర్‌ వెల్లడించారు. 1,655 మంది ఒంటరి మహిళలకు జీవనభృతి కల్పిస్తున్నామన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కింద రూ.75,116 చొప్పున ఆర్థికసాయం అందిస్తున్నామని తెలి పారు. వేములవాడ మండలం తిప్పాపూర్‌లో రూ.22.50 కోట్ల వ్యయంతో వంద పడకల ప్రాంతీయ ఆస్పత్రి నిర్మిస్తున్నామన్నారు. సిరిసిల్ల ప్రాంతీయ ఆస్పత్రిలో రూ.36 లక్షలు వెచ్చించి రక్తనిధి మంజూరు చేశామని, రూ.13.50 వ్యయంతో మాతాశిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. త్వరలో డయాలసిస్‌ కేంద్రాన్ని, అత్యవసర విభాగాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. గులాబీ డే లో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రోగుల బెడ్‌షీట్లను మార్చుతున్నామని, దీని ద్వారా అంటువ్యాధులు, దుర్వాసనను నివారిస్తున్నామని చెప్పారు. కేసీఆర్‌ కిట్ల పథకంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయని, ఇప్పటివరకు జిల్లాలో 614 మందికి కిట్లు అందించామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సగటు ప్రసవాల సంఖ్య 181 ఉండగా.. కేసీఆర్‌ కిట్ల పంపిణీ ద్వారా 287కు పెరిగాయని చెప్పారు.



పండుగలా వ్యవసాయం..

జిల్లాలో 56,109 మంది రైతులకు నాలుగు విడతల్లో రూ.240 కోట్ల రుణమాఫీ చేశామని మంత్రి అన్నారు. 79,359 మంది రైతులకు చెందిన 2,12,596 ఎకరాలను కంప్యూటరీకరించామని తెలిపారు. వీరికి వచ్చే ఏడాది నుంచి ఎకరాకు రూ.4 వేల చొప్పున రూ.8 వేలు పెట్టుబడి రాయితీ ఇస్తామన్నారు. రబీలో 162 కొనుగోలు కేంద్రాల ద్వారా 36,424 మంది రైతుల నుంచి రూ.298 కోట్ల విలువైన 1,97,123 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేశామన్నారు. నాబార్డు కింద రూ.24 కోట్లతో 40వేల మెట్రిక్‌ టన్నుల గోదాములు నిర్మిస్తున్నామని మంత్రి వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా రూ.1464 కోట్లతో చేపడుతున్న 9 ప్యాకే జీ పనులతో మిడ్‌మానేరు నుంచి అప్పర్‌మానేర్‌ వరకు 11.634 టీఎంసీలనీటిని ఎత్తిపోయడం ద్వారా వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లోని 86,150 ఎకరాల ఆయకట్టుకు సాగునీళ్లందిస్తామన్నారు.



2018 నాటికి ప్యాకేజీ పనులు పూర్తి చేయాలనే లక్ష్యమన్నారు. 25 టీఎంసీల సామర్థ్యంతో చేపడుతున్న మిడ్‌మానేరు ద్వారా రెండు లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. వ్యవసాయ రంగానికి ఇప్పటికే 24 గంటల కరెంట్‌ ఇస్తున్నామని, రైతుల అవసరాన్ని బట్టి తగ్గించుకునే వీలు కల్పిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఉపాధిహామీలో 88,861 మందికి జాబ్‌ కార్డులున్నాయని, 29 లక్షల పనిదినాలు కల్పించినట్లు మంత్రి తెలిపారు. 41,801 కుటుంబాలకు చెందిన 66,252 మందికి రూ.31.53 కోట్ల పని లభించిందన్నారు.



గుడుంబా రహిత జిల్లాగా..

జిల్లాను గుడుంబా రహిత జిల్లాగా మార్చామని, సారా తయారీ మానేసిన వారికి ప్రతామ్నాయ  ఉపాధి కోసం 58 మందికి రూ.2 లక్షల చొప్పున రూ.కోటి 16 లక్షలు అందిస్తున్నామని వివరించారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించే లక్ష్యంతో ప్రభుత్వం గుడుంబా రహిత జిల్లాగా తీర్చిదిద్దామన్నారు. తంగళ్లపల్లి మండలం  మండెపల్లి వద్ద రూ.16.50 కోట్లతో 20 ఎకరాల్లో నిర్మించే అంతర్జాతీయ డ్రైవింగ్‌ శిక్షణ, పరిశోధన కేంద్రం రాష్ట్రంలోనే మొదటిదని, దేశంలో రెండవదన్నారు. 587 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాల లోపు పిల్లలకు పోషణ, ఆరోగ్యసేవలందిస్తున్నామని పేర్కొన్నారు. 1,67,556 కుటుంబాలకు దీపం పథకం కింద వంటగ్యాస్‌ కనెక్షన్లు మంజూరు చేశామని తెలిపారు. బ్యాంకు లింకేజీ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7154 సంఘాలకు రూ.162.53 కోట్లరుణం అందించే లక్ష్యం కాగా ఇప్పటి వరకు 349 సంఘాలకు స్త్రీనిధి ద్వారా రూ.13.92 కోట్లు అందించామని మంత్రి వెల్లడించారు. పంచాయతీరాజ్‌ ద్వారా రూ.588 కోట్లతో చేపట్టిన 4167 పనుల్లో 2303 పూర్తయ్యాయని వివరించారు. ఆర్‌ అండ్‌ బీ ద్వారా రూ. 552 కోట్లతో 58 పనులు చేపట్టామని, సిరిసిల్ల పట్టణ సుందరీకరణలో రూ.44.45 కోట్లతో 6.9 కిలోమీటర్ల రోడ్ల పనులు సాగుతున్నాయన్నారు. సిరిసిల్లలో రూ.56 కోట్లతో మురుగునీటి కాలువలు, సిమెంట్‌రోడ్లు చేపట్టినట్లు కేటీఆర్‌ తెలిపారు.



వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి త్రిముఖ వ్యూహం..

వస్త్రపరిశ్రమ అభివృద్ధికి త్రిముఖ వ్యూహం అనుసరిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ ఏడాది రూ.225కోట్ల విలువైన వస్త్రాలకు ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చిందన్నారు. నేత కార్మికులకు నెలకు రూ.18 వేల నుంచి రూ.20 వేలు వేతనం వస్తుందన్నారు. కార్మికుల సంక్షేమానికి త్రిఫ్ట్‌ పథకం అమలు, జనశ్రీ బీమా సౌకర్యం, 50 రాయితీతో విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని కేటీఆర్‌ తెలిపారు. వంద ఎకరాల స్థలంలో వర్క్‌షెడ్‌లను నిర్మించి, రెండు వేల మంది చేనేత కార్మికులకు నాలుగు సాంచాల చొప్పున కేటాయంచి ఉపాధి కల్పించనున్నామన్నారు. రూ.కోటితో యార్న్‌బ్యాంక్, రూ.2 కోట్లతో ఉమ్మడి వసతుల కేంద్రం మంజూరు చేశామని తెలిపారు. మండెపల్లిలో రూ.30 కోట్లతో 60 ఎకరాల్లో అపెరల్‌ పార్క్‌ నిర్మిస్తామన్నారు.



రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధికి కొత్తపల్లి–మనోహరబాద్‌ రైల్వే లైను ఆయువు పట్టుగా నిలవనుందన్నారు. స్వచ్ఛభారత్‌లో దేశంలోనే 20వ స్థానంలో జిల్లా నిలిచిందని, రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని కేటీఆర్‌ వెల్లడించారు. జిల్లాను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుపేందుకు కృషి చేస్తానని మంత్రి వెల్లడించారు. జిల్లా కలెక్టర్‌ దేవరకొండ కృష్ణభాస్కర్, ఎస్పీ విశ్వజిత్‌ కంపాటి, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, కరీంనగర్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, మాజీ ఎమ్మెల్యే రేగులపాటి పాపారావు, జేసీ యాస్మిన్‌బాషా, ‘సెస్‌’ చైర్మన్‌ దోర్నాల లక్ష్మారెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సామల పావని, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top