వడగళ్లవాన

వడగళ్లవాన


జిల్లాలోని పలు చోట్ల వర్షం

చల్లబడ్డ వాతావరణం

ఊపిరి పీల్చుకున్న జనం

వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలు తడిసిన ధాన్యం 

గాలిదుమారానికి విరిగిన స్తంభాలు.. ఎగిరిన పైకప్పు రేకులు


హమ్మయ్య... జిల్లా ప్రజలు ఎట్టకేలకు చల్లబడ్డారు. ఇంతకాలం ఎండ వేడిమికి ఉక్కిరిబిక్కిరైన జనాన్ని మంగళవారం వర్షం పలుకరించింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. చిరు జల్లుల నుంచి మోస్తరు వర్షం కురవడంతో అన్ని వర్గాల ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. భానుడి భగభగలకు.. వడగాలులకు సతమతమైన వారంతా వర్షాన్ని చూడగానే ఆనందం వెల్లివిరిసింది. వడగళ్ల వాన, గాలిదుమారానికి రైతులకు నష్టం వాటిల్లింది. ధాన్యం రాసులు తడిసిముద్దయ్యాయి. పొలాల్లో వరిపంట నేలకొరిగింది. కొన్నిచోట్ల మామిడి రాలిపడింది. పిడుగుపాటుకు ఓ ఎద్దు ప్రాణాలు విడిచింది. పలు ఇళ్ల పైకప్పులు ధ్వంసమయ్యాయి.      

     - సాక్షి నెట్‌వర్క్


 దుబ్బాక: మండలంలోని పలుచోట్ల మంగళవారం వర్షం కురిసింది. రాజక్కపేట, రేకులకుంటలో కురిసిన అకాల వర్షానికి భారీ నష్టం జరిగింది. పలువురి పొలాల్లోని వరి పంట నేలకొరిగింది. అక్కల సత్తెగౌడ్‌కు చెందిన నాలుగు ఎకరాల మామిడి తోట, ఎక్కాల రాజయ్యకు చెందిన 3.20 ఎకరాల మామిడి  కాయలు పూర్తిగా రాలిపోయాయి.


ఐకేపీ కొనుగోలు కేంద్రంలో సుమారు 200 మంది రైతులు ఆరబెట్టిన వరి ధాన్యం తడిసింది. 15 రోజుల క్రితం ఆరబెట్టిన వరి ధాన్యం రాసులు వడగండ్ల వానకు చెల్లా చెదురయ్యాయి. ఐకేపీ సిబ్బంది టార్పాలిన్లను సకాలంలో ఇవ్వకపోవడంతో ఆరు నెలల రెక్కల కష్టం నీటి పాలైందని రైతులు వాపోయారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బాధిత రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.


 వేలూరు, నాచారంలో విరిగిన విద్యుత్ స్తంభాలు

వర్గల్: మండలంలోని వేలూరు, నాచారం గ్రామాల్లో మంగళవారం సాయంత్రం వీచిన బలమైన గాలులకు రెండు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. కొద్దిసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆయా గ్రామాల్లో విరిగిన స్తంభాలను మార్చుతామని టీఎస్‌సీపీడీసీఎల్ ఏఈ వేణుగోపాలాచార్యులు తెలిపారు. గజ్వేల్ 132 కేవీ సబ్‌స్టేషన్ బ్రేకర్‌లో సాంకేతిక లోపం కారణంగా మండలంలోని గౌరారం, వర్గల్ విద్యుత్ సబ్‌స్టేషన్లకు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.


 సిద్దిపేటలో..

సిద్దిపేట రూరల్: ఇబ్రహీంపూర్, కోదండరావుపల్లి, బంజేరుపల్లి, తడ్కపల్లి తదితర గ్రామాల్లో అక్కడక్కడా వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడగా భూమి కొద్దిమేర తడిసింది. ఇబ్రహీంపూర్‌లో కొంత ఎక్కువ మోతాదులో వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు, వ్యవసాయ మడుల్లో వర్షం నీరు నిలిచింది.


 తూప్రాన్‌లో గాలిదుమారం...

తూప్రాన్: మండలంలోని పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. వెంకటాపూర్‌లో మామిడి కాయలు రాలడంతో సుమారు రూ.లక్షకుపైగా నష్టం జరిగినట్టు బాధిత రైతు మంగారెడ్డి తెలిపారు. చెట్ల గౌరారంలో యాదాగౌడ్‌కు చెందిన రెండు ఎకరాలు, మహిబూబ్‌రెడ్డికి చెందిన ఎకరంన్నర పొలంలో చేతికందిన వరి ధాన్యం వడగళ్ల వానకు నేలరాలింది. కోనాయిపల్లిలో రావెల్లి దుర్గయ్య ఇంటి పైకప్పు రేకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. చెట్లగౌరారంలో విఠల్‌రెడ్డికి చెందిన పౌల్ట్రీ ఫారం రేకులు లేచిపోయాయి. మనోహరాబాద్ వద్ద 33/11 సరఫరాకు చెందిన 10  విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రామాయిపల్లిలో మహ్మద్ అన్వర్‌కు చెందిన ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపడ్డాయి.


 పిడుగు పాటుకు ఎద్దు మృతి

తొగుట: మండలంలోని ఎల్లారెడ్డిపేట గ్రామంలో మంగళవారం సాయంత్రం పిడుగు పడడంతో ఎద్దు మృతి చెందింది. గ్రామానికి చెందిన రాంపురం కిష్టయ్య తన వ్యవసాయ బావి వద్ద ఎడ్లను చె ట్టుకింద ఉంచాడు. సాయంత్రం ఊరుములతో కూడిన వర్షం పడింది. ఈ సమయంలో పిడుగు పడడంతో ఎద్దు చనిపోయింది. రూ. 50 వేలు నష్టం వాటిల్లిందని తనను ఆదుకోవాలని బాధిత రైతు కోరారు.


 కుప్పకూలిన రేకుల షెడ్డు

వర్గల్: మండలంలో మంగళవారం సాయంత్రం జల్లులు కురిసాయి. ఉక్కపోతతో అల్లాడుతున్న జనానికి కాసింత ఉపశమనం లభించింది. నాచారం, మజీద్‌పల్లి, వేలూరు, అనంతగిరిపల్లి, నర్సంపల్లి, సీతారాంపల్లిలో ఓ మోస్తరు వాన పడింది. మధ్యాహ్నం 2 గంటల వరకు వడగాలుల తీవ్రత కొనసాగగా, ఆ తరువాత ఆకాశం ఒక్కసారిగా మబ్బులతో నిండిపోయింది. కొన్ని చోట్ల వాన పడగా, మిగతా గ్రామాల్లో వాతావరణం చల్లబడింది. మజీద్‌పల్లిలో ఓ కట్టె కోత మిషన్ రేకుల షెడ్డు గాలి దుమారానికి కుప్పకూలింది. రేకులన్నీ ఒక్కసారిగా కిందకు పడిపోయాయి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top