గురజాడ సాహిత్యంలో వాస్తవాలు


విజయనగరం టౌన్: ప్రముఖ రచయిత  గురజాడ అప్పారావు సాహిత్యంలో వాస్తవాలు ఉంటాయని కవయిత్రి బులుసు సరోజినీదేవి అన్నారు. బుధవారం స్థానిక ఆనంద గజపతి కళాక్షేత్రంలో గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో గురజాడ 101 వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఉదయం నిర్వహించిన ఈ వేడుకల్లో ముందుగా గురజాడ చిత్రపటం వద్ద జ్యోతిప్రజ్వలన చేసి సదస్సు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆధునిక మహిళకు  గురజాడ మార్గదర్శి వంటి వారన్నారు.  సమాజంలో మార్పు అనివార్యమని గురజాడ తన రచనల్లో  వ్యక్తపరిచారని చెప్పారు. అలాగే  కేవలం రచనల ద్వారానే మనిషిలో మార్పు తీసుకురావచ్చని తెలియజేసిన మహామనిషని కొనియాడారు. చదువుకున్న స్త్రీలు అన్ని రంగాల్లోనూ రాణించాలన్నదే గురజాడ అభిమతమన్నారు. 

 

 అనంతరం శ్రీకాకుళం సాహితీ, కథానిలయం అధ్యక్షుడు డాక్టర్ బీవీఏ రామారావు నాయుడు మాట్లాడుతూ, ఆధునిక ప్రపంచంలో నాటకకర్తలు నాటకాలు రాస్తున్న సమయంలోనే  గురజాడ కన్యాశుల్కం వచ్చిందన్నారు. గురజాడ సాహిత్యంలో నాటి సమాజంలో ఉన్న వాస్తవాలతో పాటూ ముందుచూపుతో రాసిన వాక్యాలు నేటితరానికి ఎంతో దగ్గరగా ఉంటాయన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.   కార్యక్రమంలో గురజాడ ఇందిర, వేంకటేశ్వరప్రసాద్,  కాపుగంటి ప్రకాష్, మేకా కాశీవిశ్వేశ్వరుడు, పవ్వాడ సుబ్బరాజు, పీవీ.నరసింహరాజు, డాక్టర్ ఎ.గోపాలరావు, భోగరాజు సూర్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top