ప్రేముంచాడు

ప్రేముంచాడు


నరసన్నపేట(శ్రీకాకుళం):

పెళ్లి చేసుకుంటానని ప్రియురాలిని నమ్మించిన ప్రియుడు పెళ్లి ముహూర్తం సమయానికి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన నరసన్నపేటలో గురువారం జరిగింది. దీంతో వధువు బంధువులు, తల్లిదండ్రులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నరసన్నపేటలోని తిరుమలవీధికి చెందిన రాజ్యలక్ష్మి(వధువు)కి ఇదే మండలం నడగాంకు చెందిన పొట్నూరు గాంధీ కుమారుడు ప్రదీప్‌(స్వామి)తో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. వీరి ప్రేమకు వధువు వైపు నుంచి బంధువులు అంగీకరించారు. వరుడు బంధువులతో కూడా మాట్లాడారు. చివరికి రెండు కుటుంబాలు అనుకొని గురువారం తెల్లవారుజాము 4.15 గంటలకు వివాహం నిర్ణయించారు.



నరసన్నపేటలోని సూర్యనారాయణ స్వామి కల్యాణ మండపంలో వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇరు కుటుంబాల్లో, కల్యాణ మండపం వద్ద బుధవారం ఉదయం నుంచీ అంతా సందడిగా ఉంది. వధువు వైపు నుంచి బంధువులు వచ్చి మధ్యాహ్న విందు ఆరగించారు. వేలాది రూపాయలు ఖర్చు చేశారు. పెళ్లి తంతులో భాగంగా నిర్వహించాల్సిన ఇతర కార్యక్రమాల కోసం వరుడును పురోహితులు పిలిచారు. అయితే ప్రదీప్‌ కనిపించలేదు. ఆందోళన చెందిన వధువు బంధువులు ఫోను చేస్తే ఇదిగో వస్తా, అదిగో వస్తా అని ఒక గంట కాలం కాలక్షేపం చేశాడు. రాత్రంతా చూశారు, అయినా రాలేదు. పెళ్లి ముహూర్తం సమయానికైనా వస్తాడని అందరూ ఆశించారు. అయినా వరుడు ఆచూకీ లభించలేదు. ఫోను కూడా స్విచ్‌ఆఫ్‌ అని వస్తుండటంతో ఇక చేసేదేమీ లేక నరసన్నపేట పోలీసులను వధువు తల్లిదండ్రులు గురువారం ఉదయం ఆశ్రయించారు.



మా అమ్మాయిని ప్రేమించి, పెళ్లి వరకూ తీసుకువచ్చిన పొట్నూరు గాంధీ కుమారుడు స్వామి మోసం చేశాడని వధువు తల్లిదండ్రులు విష్ణుమూర్తి, శాంతికుమారి ఎస్‌ఐ ఎన్‌.లక్ష్మణకు ఫిర్యాదు చేశారు. స్వామి ఆచూకీని కనిపెట్టి మా అమ్మాయితో వివాహం చేయించాలని వీరు విజ్ఞప్తి చేశారు. పెళ్లి పీటలపై కుమార్తె వివాహం నిలిచి పోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు. కాగా నరసన్నపేటలో ఒక హోల్‌సేల్‌ షాపులో పనిచేస్తున్నప్పుడు మాకు పరిచయం అయిందని, అది ప్రేమగా మారిందని వధువు వివరించారు. ఇన్నాళ్లు నాతో చాలా గౌరవంగా ప్రవర్తించాడని పెళ్లి కూడా ఆయన ఇష్ట ప్రకారమే నిర్ణయించామని తెలిపారు. ఇప్పుడు పెళ్లి సమయానికి ఎందుకు ఇలా చేశాడో అని కంటతడి పెట్టారు. పోలీసులు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top