రెచ్చిపోతున్న పచ్చ మాఫియా

రెచ్చిపోతున్న పచ్చ మాఫియా

  •    తిరుమనకొండను తవ్వి గ్రావెల్‌ అక్రమ తరలింపు

  •    అధికార పార్టీ అండదండలు

  •    పట్టించుకోని అధికారులు

  • మండల కేంద్రం సంగానికి కూతవేటు దూరంలో ఉన్న తిరుమనకొండను తవ్వి అక్రమంగా గ్రావెల్‌ తరలిస్తున్నారు. కొందరు పచ్చ కార్యకర్తలు మాఫియాగా ఏర్పడి ఇక్కడి నుంచి అక్రమంగా గ్రావెల్‌ను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. తిరుమనకొండపై ఏకంగా యంత్రాలను పెట్టి భారీగా గోతులు తీసి గ్రావెల్‌ను తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు.



    సంగం(ఆత్మకూరు): సంగం, బుచ్చి మండలాల్లో గ్రావెల్‌కు మంచి డిమాండ్‌ ఉండడంతో కొందరు పచ్చ కార్యకర్తలు అక్రమంగా తిరుమనకొండను తవ్వేస్తున్నారు. ఇది ప్రభుత్వ భూమి అని, ఎవరూ ప్రవేశించడానికి వీలు లేదంటూ సంగం తహసీల్దారు రామాంజనేయులు బోర్డులు ఏర్పాటు చేసినా మాఫియా గ్రావెల్‌ తరలింపులను ఆపలేదు. ఈ బోర్డులు అలంకారప్రాయంగా మిగిలిపోయాయి.



    సంగం సర్వే నెం.252/ఏ2లో 15 ఎకరాల తిరుమనకొండ ప్రభుత్వ భూమిగా ఉంది. గత కొంతకాలంగా ఇక్కడ గ్రావెల్‌ను అక్రమంగా తరిలిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు గత వారంలో ధైర్యం చేసి ఒక జేసీబీ యంత్రాన్ని, 10 ట్రాక్టర్లను పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న వీటిపై కేసులు నమోదు చేసే ధైర్యం చేయలేకపోయారు. అధికార పార్టీ స్థానిక నేతల నుంచి మంత్రుల స్థాయి వరకు ఫోన్లు, బెదరింపులు వస్తుండడంతో వీటిని వదిలేశారు. అధికార పార్టీ నేతల బెదిరింపులతో తిరుమనకొండ వైపు చూడడానికి అధికారులు సాహసం చేయడం లేదు. దీంతో రెచ్చిపోతున్న పచ్చగ్రావెల్‌ మాఫియా భారీగా గ్రావెల్‌ను తరలిస్తుంది.



    యథేచ్ఛగా తరలింపు

    ఏకంగా తిరుమనకొండ పైకి రహదారి ఏర్పాటు చేసి మరీ యథేచ్ఛగా గ్రావెల్‌ తరలిస్తున్నారు. పగలు, రాత్రి ఈ గ్రావెల్‌ తరలింపు వల్ల దుమ్ము విపరీతంగా వచ్చి ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికంగా నివాసమున్న దళితులు వాపోతున్నారు. ట్రాక్టర్‌ గ్రావెల్‌ను సంగానికి తరలించడానికి రూ.1000, బుచ్చిరెడ్డిపాళేనికి అయితే రూ.1500 వసూలు చేస్తున్నారు. రోజుకు 100 ట్రిప్పులు గ్రావెల్‌ తరలిపోతున్నట్లు తెలుస్తోంది. లక్షల్లో చేతులు మారుతున్నాయి. గ్రావెల్‌ తరలింపును అడ్డుకోవాల్సిన మైనింగ్‌ శాఖ మాత్రం ఇటు వైపు దృష్టి సారించిన దాఖలాలు లేవు. ఇప్పటికే మైనింగ్‌ శాఖకు నెలసరి మామూళ్లు ఇచ్చేలా గ్రావెల్‌ మాఫియా ఏర్పాటు చేసుకుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మైనింగ్‌ శాఖ పనిచేయకుండా నెలసరి మామూళ్ల మత్తులో జోగుతూ తరలింపుదారులకు సహకరిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్‌ ముత్యాలరాజు స్పందించి ప్రభుత్వ భూముల్లో అక్రమ గ్రావెల్‌ తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.  



    చర్యలు తప్పవు

    తిరుమనకొండ ప్రాంతం పూర్తిగా ప్రభుత్వ భూమి. దీనిలో అక్రమంగా గ్రావెల్‌ తరలిస్తే చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే అక్కడ బోర్డులు ఏర్పాటు చేశాం. అయినా అక్రమాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాం.

    – రామాంజనేయులు, తహసీల్దారు, సంగం

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top