ఎమ్మెల్యే చెప్పారని...వచ్చేశారు!

ఎమ్మెల్యే చెప్పారని...వచ్చేశారు! - Sakshi


ఎల్‌.ఎన్‌.పేట:  ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని జిల్లా కలెక్టర్‌ పి.లక్ష్మీనరసింహం అదేశించారు. జిల్లాస్థాయి అధికారి చెప్పారుకదాని ఓ రైస్‌ మిల్లు తనిఖీకి వెళ్లిన అధికారులకు అక్కడ  పరిస్థితి విస్మయం కలిగించింది. ఓ మాటలో చెప్పాలంటే చేదు అనుభవం ఎదురైనట్టే.. వివరాల్లోకి వెళితే ఎల్‌.ఎన్‌.పేట మండల ప్రత్యేక అధికారి ధనుంజయరావు, తహసీల్దార్‌ నారాయణమూర్తి, ఆర్‌ఐ గోవిందరాజులుతో పాటు పలువురు అధికారులు స్కాట్‌పేట వద్ద అలికాం–బత్తిలి రోడ్డు పక్కన ఉన్న శ్రీమాణిక్యాంబ రైస్‌మిల్లు తనిఖీ కోసం సోమవారం సాయంత్రం చేరుకున్నారు. మిల్లులోకి వెళ్లే సరికి సంబంధిత యజమాని లేరు. అక్కడ పనిచేస్తున్న కలాసీలు, రైస్‌మిల్లు గుమస్తాలతో అధికారులు మాట్లాడారు. రికార్డులు చూపించాలని గుమస్తాను అడిగారు. రికార్డులు బీరువాలో ఉంటాయని, తాళాలు యజమాని వద్ద ఉన్నాయని గుమస్తా చెప్పారు. యజమాని ఫోన్‌ నంబర్‌ తీసుకుని తహసీల్దార్‌ ఫోన్‌ చేశారు.



ఎమ్మెల్యే వద్ద ఉన్నాను..తరువాత రండి

తహసీల్దార్‌ నారాయణరావు ఫోన్‌ లిఫ్టు చేసిన రైస్‌ మిల్లు యజమాని చెప్పిన సమాధానం సంబంధిత అధికారిని కంగుతీనిపించింది. తాను స్థానిక ఎమ్మెల్యే కలమట వెంకటరమణ వద్ద ఉన్నానని.. మరోసారి రావాలని అధికారికి స్పష్టం చేశారు. చేసేదిలేక తహస్‌ల్దారు ఫోన్‌ కట్‌చేశారు.



తరువాత ఏం జరిగిందంటే..

తరువాత తహసీల్దార్‌ నారాయణమూర్తి ఫోన్‌ రింగయింది. ఫోన్‌ లిఫ్ట్‌చేసి ఎవరు అని ప్రశ్నించారు. నైను మాణిక్యాంబ రైస్‌మిల్లు యజమానినని, ఎమ్మెల్యే మాట్లాడుతారు లైన్లో ఉండండి అని ఫోన్‌ ఇచ్చారు. తహసీల్దార్‌తో ఎమ్మెల్యే ఏం మాట్లాడారో సీక్రెట్‌. అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఏమి జరిగింది సార్‌ అని అధికారులను అక్కడే ఉన్న విలేకర్లు అడగ్గా ఏమి చేస్తాం ఒకవైపు జిల్లా అధికారుల ఆదేశాలు... మరో వైపు అధికార పార్టీ నాయకుల అడ్డుకట్టలు అంటూ పెదవి విరిశారు.



అక్రమాలు జరిగినట్టు అనుమానం!

ధాన్యం కొనుగోలులో మాణిక్యాంబ రైస్‌మిల్లు యజమాని అధికారం ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్నారని అధికారులు నిర్ధారణకు వచ్చారు. మిల్లు యజమాని కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన రికార్డులను ఐకేపీ, పీఏసీఎస్‌ల్లో పరిశీలించారు. సంబంధిత మిల్లు యజమాని పీఏసీఎస్‌ ద్వారా ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 24 మంది రైతుల నుంచి 1655 క్వింటాలు (2060 బస్తాలు, బస్తా 80కిలోలు చెప్పున్న) కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో ఉంది. వాస్తవానికి మిల్లులో ఉన్న ధాన్యం నిల్వలు పరిశీలించి..తక్కువగా లెక్కవేసుకున్న 10 వేల బస్తాలు (80కిలోలు) పైనే ఉంటాయని అధికారులే అంచనాలు వేసుకున్నారు. మిల్లు యజమాని ప్రభుత్వానికి ఇచ్చిన బ్యాంక్‌ గ్యారంటీ రూ.24 లక్షలు మాత్రమే. అంటే ఆయన ఇచ్చిన గ్యారంటీకి సబంధించిన ధాన్యం 24 మంది రైతుల నుంచి కొనుగోలు జరిగిపోయింది. మిగిలిన ధాన్యం ఎక్కడి నుంచి వచ్చాయి? లెక్కల పరిస్థితి ఏమిటి? చిక్కుముడులు జిల్లా కలెక్టర్, విజిలెన్స్‌ అధికారులు విప్పుతారో? అధికార పార్టీ నాయకులకు తలొగ్గుతారో వేచిచూడాలి.



అందరికీ హడలే..!

శ్రీమాణì క్యాంబ రైస్‌మిల్లు అంటే రైతులకు, మిగిలిన మిల్లర్లకు, అధికారులకు అందరికీ హడలే. మిల్లు యజమానికి ఉన్న రాజకీయ పలుకుబడి అలాంటిది. తనను ఎవరేమీ చేయలేరన్న ధీమాతో తన ఇష్టం వచ్చినట్లు వ్యపారం చేస్తున్నారనే విమర్శలు, ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయకపోయిన చేసినట్లు అధికారులు రికార్డులు తయారు చేస్తారు. ఒడిశా నుంచి యథేచ్ఛగా ధాన్యం వస్తున్న అడ్డుకట్టు వేసే అధికారే లేరు. రైస్‌మిల్లు నుంచి వచ్చిన ఊక రోడ్డుమీద వెళుతున్న ప్రయాణికుల కంట్లో పడుతున్న పట్టించుకునేవారేలేరు. దీనిపై అధికారులు స్పందించాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top