భయం గుప్పిట్లో చదువులు


 మరోసారి పెచ్చులూడిన వంగపల్లి పాఠశాల

 విద్యార్థులు, ఉపాధ్యాయులకు తప్పిన ప్రమాదం

 పాఠశాలకు సెలవు ప్రకటించిన డిప్యూటీ ఈఓ


 

నల్లగొండ: వర్షాకాలం వస్తే చాలు ఆ పాఠశాలలోని తరగతి గదుల్లో పైకప్పు పెచ్చులూడి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి యాదగిరిగుట్ట మండలం వంగపల్లి జిల్లా పరిషత్ పాఠశాల భవనంలోని పైకప్పు మంగళవారం పెచ్చులూడి పడ్డాయి. ఉదయం పాఠశాలకు విద్యార్థులు, ఉపాధ్యాయులు చేరుకోగానే మొత్తం ఆరు గదులతో పాటు వరండాల్లో పైకప్పులూడిపడి ఉన్నాయి. దీంతో ఫర్నిచర్ ధ్వంసమైంది. భయభ్రాంతులకు గురైన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాల ఆవరణలోని చెట్ల కిందికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ ఈఓ పాఠశాలకు సెలవు ప్రకటించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు.

 

సందర్శించిన ఈఈ....

 పాఠశాలను సర్వశిక్ష అభియాన్ ఈఈ వైద్యుల భాస్కర్ మంగళవారం మధ్యాహ్నం సందర్శించారు. ఇటీవల పాఠశాల శిథిలావస్థపై వచ్చిన కథనాలపై స్పందిం చిన ఆయన సందర్శించినట్లు తెలిపారు. పాఠశాలలోని 11 గదులు శిథిలావస్థకు చేరాయని, అంతే కాకుండా వరండా సైతం కూలేందుకు సిద్ధంగా ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. రెండ్రోజులుగా కురిసిన వర్షాలకు పాఠశాల మరింత దెబ్బతిన్నదని, తరగతి గదుల్లో పెచ్చులు ఊడిపోయిన విషయంపై సర్పంచ్ చంద్రగాని నిరోష, జహంగీర్, ఎస్‌ఎంసీ చైర్మన్ రేగు బాలనర్సయ్య, ఇన్‌చార్జి హెచ్‌ఎం రమాదేవి వివరించారు. ఆయన వెంట ఏఈ సహదేవ్  ఉన్నారు.  

 

 ముందుగానే హెచ్చరించిన ‘సాక్షి’..


 జిల్లా పరిషత్ పాఠశాల శిథిలావస్థకు చేరిందని ‘సాక్షి’ ముందుగానే అధికారులకు సూచించింది. మే 27న ‘సమస్యల్లో సక్సెస్..’ ఈ నెల 13న ‘సమస్యల వలయంలో.. సరస్వతీ నిలయం’ అనే శీర్షికలతో ముందుగానే సాక్షి కథనాలను ప్రచురించింది. అయినా అధికారులు ఎవరూ స్పందించకపోవడంతో సోమవారం కురిసిన వర్షానికి పాఠశాలలోని తరగతి గదుల్లో పెచ్చులూడి పడ్డాయి. ఈ ఘటనపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top