‘కోటి’ విలువైన ప్రభుత్వ భూమి కబ్జా

‘కోటి’ విలువైన ప్రభుత్వ భూమి కబ్జా

  • స్వాధీనం చేసుకోవడంలో అధికారుల మీనమేషాలు

  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు

  • తోటపల్లిగూడూరు(సర్వేపల్లి): ‘కోటి’ విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. అయితే అన్నీ తెలిసినా అధికారులు మీనమేషాలు లెక్కపెడుతున్నారు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తోటపల్లిగూడూరు మండలం నరుకూరు పంచాయితీ సర్వేనంబరు 1–1ఏలో 59 సెంట్ల ప్రభుత్వ భూమి ఉంది. కోడూరు రోడ్డు వైపు నరుకూరు సెంటర్‌ సమీపంలో స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ ఎదురుగా ఉన్న ఈ ప్రభుత్వ భూమి ప్రస్తుత విలువ సుమారు రూ.కోటి వరకు ఉంటుంది. 30 ఏళ్ళ క్రితం ఈ భూమిని వర్షం కొలిచే యంత్రం ఏర్పాటుకు ప్రభుత్వం కేటాయించింది.గతంలో అక్కడ వర్షం కొలిచే యం త్రం తో పాటు ఇరిగేషన్‌ శాఖకు చెందిన విశ్రాంతి బంగ్లా ఉండేదిట. అధికారులు, పాలకులు ఈ ప్రాంతంలో పర్యటనకు వచ్చినపుడు ఈ బంగ్లాలో విడిది చేసేవారు. కాలక్రమంలో ప్రభుత్వ బంగ్లా కనుమరుగు కాగా, ప్రభుత్వ భూమి మాత్రం నరుకూరు పంచాయితీ ఆధీనంలో ఉండేది.



    కాగా ఈ ప్రభుత్వ భూమికి ఇరువైపులా ఉన్న పొలాలను ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఏడేళ్ల కిందట కొనుగోలు చేసి ప్లాట్‌లుగా మార్చుకొంది. ఈ క్రమంలో ఖాళీగా ఉన్న ఈ ప్రభుత్వ భూమిపై ఆ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల కన్ను పడింది. దీంతో అప్పటి అధికారపార్టీ నాయకుల అండదండలతో రెవెన్యూ అధికారులను లోబరచుకుని ప్రభుత్వ భూమికి దొంగ పట్టాలు పుట్టించుకొన్నారని ఆరోపణలున్నాయి.  ఇలా ఆ ప్రభుత్వ భూమిని కబ్జాచేయడమే కాకుండా ప్లాట్‌లుగా మార్చి అమాయకులకు అంటగట్టి సొమ్ముచేసుకొన్నారు. ఎంతో విలువైన ప్రభుత్వ భూమి ఓ రియల్‌ ఎస్టేట్‌ యాజమాన్యం చేతుల్లోకి వేళ్లే విషయంలో అప్పటి అధికార పార్టీ నాయకులకు, అధికారులకు భారీ ఎత్తున ముడుపులు ముట్టాయని ఆరోపణలున్నాయి.



    ఉన్నతాధికారులు ఆదేశించినా..

    నరుకూరులో స్వాహా కాబడ్డ ఈ ప్రభుత్వ భూమి విషయం మూడేళ్ల కిందట వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో ఈ భూకబ్జా వ్యవహరంపై  2013లో స్థానికులు అప్పటి ఆర్డీఓ మాధవీలత దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో స్పందించిన ఆర్డీఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలని మండల రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అనంతరం స్థానిక రెవెన్యూ అధికారులు ఆక్రమిత ప్రభుత్వ భూమిలో సర్వే చేసి బౌండరీ గీయించారు. అంతేకాక ఆ ప్రభుత్వ భూమిలో ఎరూ దిగరాదంటూ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసారు. దీంతో ఆందోళనకు గురైన ప్లాట్ల కొనుగోలుదారులు రియల్‌ ఎస్టేట్‌ యాజమాన్యంతో గొడవకు దిగారు.



    ఈ క్రమంలో రియల్‌ ఎస్టేట్‌ సంస్థ మళ్లీ అప్పటి అధికార పార్టీ నాయకులను ఆశ్రయించి రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి భూమిని స్వాధీనం చేసుకొన్నారు. అంతే కాకుండా ఆ భూమిలో భవనాలు కట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే రాజకీయ నాయకుల ఒత్తిడితో పాటు ముడుపులు అందడంతో ప్రభుత్వ స్థలం స్వాధీనంపై రెవెన్యూ అధికారులు మౌనం వహిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.  కాగా ఈ సంఘటనపై నరుకూరు గ్రామస్తులు,  స్థానిక అఖిల పక్షం నేతలు  పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.



    స్వాధీనం చేసుకోవాల్సిందే

    నరుకూరు పంచాయతీలో ఉన్న ఈ ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురికావడం అందరికీ తెలుసు. ఈ విషయమై అనేక దఫాలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రియల్‌ ఎస్టేట్‌ యాజమాన్యం ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని పంచాయతీకి అప్పజెప్పాలి.  

     – ఆకుల మధు, సర్పంచ్, నరుకూరు పంచాయతీ  



    కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి

    రూ.కోటి విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనా రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు. ఈ భూమిని స్వాధీనం చేసుకోవాలని చాలా కాలంగా రెవెన్యూ అధికారులను కోరుతున్నా పట్టించుకోవడం లేదు.  ఈ విషయంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని  విడిపించి పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలి.   

     – పాకం వెంకయ్య, ఎంపీటీసీ సభ్యుడు



    చర్యలు తీసుకొంటాం

    నరుకూరు పంచాయితీలోని సర్వేనంబరు 1–1ఏలో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లుగా మాకు సమాచారం ఉంది. దీనిపై మరో సారి ఫీల్డ్‌ సర్వే చేట్టి విచారిస్తాం.  ప్రభుత్వ భూమి అని తేలితే భూమిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆక్రమణదారులపై చర్యలు తీసుకొంటాం.

    – రామలింగేశ్వరరావు, తహసీల్దార్,తోటపల్లిగూడూరు 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top