గోరుముద్ద అందేనా?

గోరుముద్ద అందేనా?


నిధులు కేటాయించని సర్కారు

సమీపిస్తున్న పదో తరగతి పరీక్షలు

అర్థాకలితో విద్యార్థులు 

ఆరోగ్యంపై ప్రభావం




రెంజల్‌ : 2016–17 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడానికి కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతీ పాఠశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ఒక గంట అదనంగా ఉపాధ్యాయులు ప్రత్యేక క్లాసులు తీసుకుంటున్నారు. విద్యార్థుల ఉత్తమ గ్రేడ్‌ల సాధనే ప్రామాణికంగా పెట్టుకున్న విద్యాశాఖ అధికారులు వారి బాగోగులు పట్టించుకొనడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యాశాఖ పాత్ర బాగానే ఉన్నా.. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించకపోవడంతో దాతలపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రత్యేక తరగతుల కోసం వేకువ జామునే ఇంటి నుంచి బయల్దెరే పిల్లల ఆకలిని తీర్చుకునేందుకు మధ్యలో మధ్యాహ్న భోజనం మాత్రమే పెడుతున్నారు. సాయంత్రం బడి వదిలాక అర్దాకలితో ఇంటికి చేరుకోవాల్సిన పరిస్థితులను విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. హైస్కూళ్లకు చట్టూ పక్కల గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు రాత్రి సమయానికి ఇంటికి చేరుకున్నాకనే ముద్ద నోట్లో వేసుకుంటున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు పస్తులుంటున్న విద్యార్థుల ఆకలిని తీర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించక పోవడంతో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని తల్లిదండ్రులు వాపోతున్నారు.



అందని ఉదయం, సాయంత్రం స్నాక్స్‌..

జిల్లాలోని దాదాపు అన్ని పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో స్నాక్స్‌ అందడం లేదు. ఈ ఏడాది జనవరి ప్రారంభం నుంచి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తీసుకుంటున్నారు. విద్యాశాఖ ప్రణాళిక ప్రకారం ఇప్పటికే వీక్లీ టెస్టులు, స్పెషల్‌ టెస్టులు పూర్తవగా ప్రస్తుతం ఈ నెల 15వ తేదీ వరకు గ్రాండ్‌ టెస్టులు నిర్వహిస్తున్నారు. 20వ తేదీ నుంచి మార్చి 6 వరకు ఫ్రీఫైనల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. అయినప్పటికీ విద్యార్థుల నోట్లోకి గోరుముద్ద అందడం లేదు. పదో తరగతి పరీక్షలు మార్చి నెల 17 నుంచి ప్రారంభం అవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 504 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నాయి. సుమారు 24 వేల మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. ఈ పరిస్థితుల్లో పదిలో ఉత్తమ ఫలితాలను సాధించేందుకు విద్యాశాఖ గత డిసెంబరు నుంచి ప్రత్యేక కార్యాచరణను రూపకల్పన చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి.



ఆరోగ్యంపై ప్రభావం

పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురుకావద్దని ప్రముఖ వైద్య నిఫుణులు పేర్కొంటున్నారు. మూడుపూటలా తప్పని సరిగా మితంగా భోజనం చేయాలని సూచిస్తున్నారు. అప్పుడే మనసును ప్రశాంతంగా నిమగ్నం చేసి చదువుకునే వీలుంటుందని అంటున్నారు. అర్దాకలితో చదివితే నిరుపయోగమని సూచిస్తున్నారు. చదివింది ఒంటబట్టేందుకు సమయం వృథా అవుతుందంటున్నారు. సమయానికి తినకపోతే ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రణాళిక ప్రకారం భోజనం, నిద్ర విద్యార్థులకు తప్పనిసరని పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఉదయం విద్యార్థులు లేచింది మొదలు రాత్రి వరకు పాఠశాలలకు అతుక్కుపోతున్నారు. వారి ఆరోగ్యంపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.



గోరుముద్దకు దాతలు ముందుకు రావాలి..

గోరుముద్దకు దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. గోరుముద్ద పేరిట గతేడాది పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు దాతలతో అల్పాహారం అందించేందుకు అధికారులు ప్రయత్నించి సఫలమయ్యారు. ప్రభుత్వం ప్రత్యేక నిధులను అందించకున్నా అధికారులు ప్రత్యేక చోరవ తీసుకున్నారు. ఈ విద్యా సంవత్సరం కూడా ఏర్పాట్లు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్‌ను వివరణ కోరగా.. గోరుముద్ద అందించేందుకు జిల్లాలోని హైస్కూల్‌ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశాం. ఇప్పటికే పలు పాఠశాలల్లో దాతల సహకారంతో అల్పాహారం అందిస్తున్నాం. ప్రభుత్వం నుంచి గోరుముద్దకు నిధులు రాకున్నా ఇంకా సమయం ఉన్నందును త్వరలోనే జిల్లాలోని అన్ని పాఠశాలల్లో దాతల సహకారంతో ప్రారంభించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.



ఆకలితో అలమటిస్తున్నాం..

నా పేరు వంశి. నేను కూనేపల్లి ప్రభుత్వ పాఠశాలలో పదో   తరగతి చదువుతున్నాను. మా తరగతిలో 45 మంది విద్యార్థులు ఉంటారు. మా సొంత గ్రామం కల్యాపూర్‌. కూనేపల్లికి అర కిలోమీటర్‌ దూరంలో ఉంటుంది. నాతోపాటు మా ఊరు నుంచి పదో తరగతి విద్యార్థులు 15 మంది వస్తారు. ప్రత్యేక తరగతుల కోసం ఉదయం ఏడు గంటలకు మా ఊరు నుంచి బస్సులో వస్తాము. కొందరం భోజనం చేసి వస్తారు, కొందరు చేయక వస్తారు. మధ్యాహ్నం మాత్రమే మధ్యాహ్న భోజనం చేస్తాము. ప్రత్యేక తరగతులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లే సరికి రాత్రి 7 గంటలు అవుతుంది. పగలంతా ఆకలితో పాఠాలు వింటు న్నాము. ఉదయం, సాయంత్రం స్నాక్స్‌ పెడితే బాగుంటుంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top