రామా.. కనవేమీ!

రామా.. కనవేమీ!


ఒంటిమిట్టలో రామ భక్తులకు సౌకర్యాలు కరువు

అంతంత మాత్రంగా స్నానపుగదులు, మరుగుదొడ్ల వసతులు

చాలా రోజులుగా వెలగని ఫ్లడ్‌లైట్లు


పవిత్ర పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న ఏకశిలానగరం ఒంటిమిట్టలో భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.. రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా రెండవమారు కూడా అధికారిక లాంఛనాలతో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించినా భక్తులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. రాష్ట్రం నలుమూలల నుంచి శ్రీరాముడిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులు అరకొర వసతులతో అల్లాడిపోతున్నారు.


సాక్షి, కడప : ఒంటిమిట్టలోని కోదండరాముడి సన్నిధిలో ఆహ్లాదకర వాతావరణంలో గడపాలనుకుంటున్న భక్తులకు నీడ కరువవుతోంది. కనీస సౌకర్యాలు కల్పించే విషయాన్ని టీటీడీ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఒంటిమిట్ట రూపురేఖలు మార్చేస్తానని చెప్పి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పెద్దగా సౌకర్యాలేమీ ఒనగూరలేదు. అభివృద్ధి కూడా నత్తనడకనే సాగుతోంది.


ఆలయం ముందువైపు  రోడ్డుపైనే భక్తుల పడక

ఒంటిమిట్టలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న హరిత హోటల్, గదులు ఉన్నా సామాన్యులు అందులో బస చేయడం కష్టతరమే. లాడ్జీల సంగతి దేవుడెరుగు..చివరికి సత్రాలు కూడా లేవు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న పర్యాటకులు మాడవీధులుగా పిలువబడుతున్న సిమెంటు రోడ్లపైనే రాత్రి సమయంలో పడుకోవాల్సి వస్తోంది. అలాగే ఇక్కడి మరుగుదొడ్లు, స్నానపు గదులు వినియోగించుకోవడానికి అనువుగా లేవని భక్తులు వాపోతున్నారు.


 కరెంటు పోతే ఆలయ పరిసరాల్లో చీకటి

ఒంటిమిట్ట కోదండ రామాలయానికి సంబంధించి ప్రత్యేకంగా జనరేటర్ సౌకర్యం లేదు. రాత్రి పూట కరెంటు లేకుంటే ఆలయం చుట్టూ పడుకున్న భక్తులకు నరకం కనిపిస్తోంది. పైగా ఆలయ ంవెనుకవైపున మెయిన్‌రోడ్డు పక్కనున్న ఫ్లడ్‌లైట్లు కొద్దిరోజులుగా వెలగడం లేదు. దీంతో అంతా చీకటి వాతావరణం కనిపిస్తోంది. 


 పార్కును తవ్వేస్తున్నారు

అభివృద్ధి పేరుతో అధికారులు ఆలయం వెనుకవైపు...రోడ్డు పక్కనున్న పార్కును కూడా తవ్వేశారు. మాడ వీధుల్లో భాగంగా పార్కును తవ్వి సిమెంటు రోడ్డును ఏర్పాటు చేశారు. ప్రతిరోజు సాయంత్రం వందల సంఖ్యలో జనం వచ్చి పార్కులో సేద తీరుతూ కాలక్షేపం చేసేవారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top