ప్రభుత్వ భూమికి ఎసరు


చెరువులో 6.13 ఎకరాలు కబ్జా..

మామిడితోట సాగు చేస్తున్న ఇద్దరు నగరవాసులు


 వికారాబాద్: కొంతకాలంగా హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు 6.13 గుంటల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని మామిడి తోట సాగుచేస్తున్నారు. అదే గ్రామంలో ఎమ్మెల్యే పర్యటన ఉండటంతో వికారాబాద్ తహసీల్దార్ గౌతంకుమార్ ఆ గ్రామాన్ని మంగళవారం సందర్శించారు. అటువైపు ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలించుకుంటూ రాగా.. చెరువులో యధేచ్ఛగా మామిడి తోట సాగు చేస్తున్న దృశ్యం కనిపించింది. దీంతో స్పందించిన తహసీల్దార్ సాగు చేస్తున్న ఆక్రమణదారులకు రెవెన్యూ యాక్టు 1905 సెక్షన్ 7 కింద నోటీసులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే..


మండలంలోని మదన్‌పల్లి గ్రామంలోని చెరువులో ఉన్న ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 154లో మూడెకరాలు.. మరో సర్వే నంబర్ 170లో మూడెకరాల 16 గుంటల భూమిని కబ్జా చేసి కొంత కాలంగా హైదరాబాద్‌కు చెందిన లతీఫ్ హమ్మద్, షేక్ మహరూఫ్ మామిడి తోట సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే సంజీవరావు పర్యటన అదే గ్రామంలో మరో రెండు రోజుల్లో ఉండటంతో ముందుజాగ్రతగా తహసీల్దార్ గౌతంకుమార్ ఆ గ్రామాన్ని మంగళవారం రోజు సందర్శించారు. ప్రభుత్వ కార్యక్రమం చేపట్టే స్థలంతోపాటు అటువైపు ఉన్న ప్రభుత్వ భూములను, చెరువులను తన సిబ్బందితో కలిసి పరిశీలించారు.


చెరువులో ఏదో తోట ఉన్నట్లుంది.. అని అనుమానం వచ్చి చెరువు దగ్గరకు వెళ్లి చూడగా.. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి మామిడి తోటను సాగుచేస్తున్న దృశ్యం ఆయన కంటపడింది. దీంతో ఆగ్ర హించిన ఆయన సంబంధిత వీఆర్‌ఓను తీవ్రస్థాయిలో మందలించారు. ఓ పక్క ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చెరువులను, కుంటలను పునరుద్ధరించాలని చెబుతుంటే.. కొంతకాలంగాా సాగు చేస్తున్న తోటను యజమానులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ఈ సందర్భంగా వీఆర్‌ఓను మందలించారు. ‘పద్దతి మార్చుకో.. లేదంటే నీపై వేటు వేయాల్సి ఉంటుంది’ అని తహసీల్దార్ వీఆర్‌ఓను హెచ్చరించారు.


అనంతరం అక్కడినుంచి వికారాబాద్ కార్యాలయానికి వచ్చి మండలంలోని వీఆర్‌ఓలందరినీ పిలిచి వెంటనే తన చాంబర్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను ఎవరైన కబ్జా చేసినా.. దాంట్లో ఎలాంటి పంటలను సాగు చేసినా.. బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, లేకుంటే మీపై నేనే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అక్రమార్కులకు కొమ్ముకాసే పరిస్థితి తీసుకురావద్దని హితవు పలికారు. అనంతరం ఆయన మదన్‌పల్లి చెరువును ఆక్రమించి మామిడి తోట సాగు చేస్తున్న వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈనెల 10వ తేదీన వికారాబాద్ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి మీ సంజాయిషీ ఇవ్వాలని ఆయన ఆదేశించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top