మహా విషాదం

మహా విషాదం


గోదావరిలో మునిగి నలుగురు మృతి

చింతలబయ్యారం వద్ద ప్రమాదం

యువకుల ప్రాణాలు తీసిన శివరాత్రి స్నానం

మరణంలోనూ వీడని స్నేహ బంధం




మహా శివరాత్రి పండగ పూట ఆ కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు చేసి, దైవ దర్శనానికి వెళ్లాలనుకున్న ఆ నలుగురు మిత్రుల ప్రాణాలను గోదారి మింగేసింది. పినపాక మండలం చింతల బయ్యారం వద్ద శుక్రవారం ఉదయం జరిగిన ఘటనలో   గూదె ప్రేమ్‌కుమార్‌(22), తంతరపల్లి మురళీకృష్ణ(20),  అల్లి నాగేంద్రబాబు(20)  బోనగిరి పవన్‌కుమార్‌(20) గోదావరిలో ఉన్న సుడిగుండంలో మునిగి ప్రాణాలు వదిలారు.



శివరాత్రి పండగ.. నలుగురి యువకుల ప్రాణాలను బలిగొంది. నాలుగు నిరుపేద కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. శివరాత్రి రోజున గోదావరిలో పుణ్య స్నానాలు చేసేం దుకు వెళ్లిన స్నేహితులైన నలుగురు యువకులు నీట మునిగి మృతిచెందారు.



పినపాక మండలం ఏడూళ్లబయ్యారం గ్రామ పంచాయతీలోని చింతలబయ్యారం గ్రామం వద్ద గల శివాలయంలో పూజలు చేసేందుకని ఏడూళ్ళబయ్యారం సాయినగర్‌కు చెందిన గూదె ప్రేమ్‌కుమార్‌(22), తంతరపల్లి మురళీకృష్ణ(20), సెంటర్‌కు చెందిన అల్లి నాగేంద్రబాబు(20), ఉప్పాక గ్రామానికి చెందిన బోనగిరి పవన్‌కుమార్‌(20) తమ కుటుంబీకులతో కలిసి శుక్రవారం ఉదయం వెళ్లారు. అందరూ కలిసి పుణ్య స్నానాలు ఆచరించేందుకని గోదావరిలోకి దిగారు. స్నేహితులైన ఆ నలుగురు యువకులు మాత్రం గోదావరి మధ్యలోకి వెళ్లి అక్కడ జలకాలాడుతున్నారు.


అక్కడ లోతు ఎక్కువగా ఉన్న ప్రదేశం(సుడిగుండం)లో బోనగిరి పవన్‌కుమార్‌ మునిగిపోతుండడాన్ని మిగి లిన ముగ్గురు గమనించారు. అతడిని రక్షిం చేందుకని నాగేంద్రబాబు, మురళీకృష్ణ, గూదె ప్రేమ్‌కుమార్‌ వెళ్లారు. నలుగురూ పూర్తిగా నీట మునిగారు. అక్కడకు దగ్గరలోనే స్నానమాచరిస్తున్న స్థానికులు, ఈతగాళ్లు గమనించి వెంటనే ఈదుకుంటూ వెళ్లారు. సుమారు రెండు గంటలపాటు వెదికారు. నాటు పడవ సాయం తో సుడిగుండం వద్ద ఆ నలుగురి మృతదేహాలను గుర్తించారు. ఒడ్డుకు తీసుకొచ్చారు. ఉత్సాహంగా లోనికెళ్లిన ఆ నలుగురు.. గంటల వ్యవధిలోనే నిర్జీవంగా బయటకు వస్తుండడాన్ని వారి కుటుంబీకులు తట్టుకోలేకపోయా రు. గుండెలవిసేలా రోదించారు.



ప్రాణ స్నేహితులు

ఈ నలుగురు యువకులవి నిరుపేద కుటుం బాలే. గూదె ప్రేమ్‌కుమార్, తంతరపల్లి మురళీకృష్ణ, అల్లి నాగేంద్రబాబుది ఏడూళ్లబయ్యారం గ్రామం. బోనగిరి పవన్‌కుమార్‌ది ఉప్పాక గ్రామం. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రేమ్‌కుమార్‌ డిగ్రీ చదువును మధ్యలో ఆపేశాడు. మిగతా ముగ్గురు, భద్రాచలంలోని ప్రైవేట్‌ కాలేజీలో ఐటీఐ సెకండియర్‌ విద్యార్థులు. వీరు గురువారం పరీక్షలు రాసి ఇంటికి వచ్చారు. ఉప్పాకలో ఉంటున్న పవన్‌కుమార్‌ని పిలిపించారు. ప్రాణ స్నేహితులైన ఈ నలుగురు, శుక్రవారం మహాశివరాత్రి రోజున చింతలబయ్యారం గ్రామంలోని శివాలయంలో పూజలు చేసేందుకని కుటుంబీకులతో కలిసి వచ్చారు. ప్రాణ స్నేహితులైన ఈ నలుగురిని విడదీయడం.. శివయ్యకు ఇష్టం లేకపోయిందేమో! నలుగురినీ ఒకేసారి తీసుకెళ్లాడు.



ఓదార్పు

ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, మణుగూరు డీఎస్పీ బి.అశోక్‌కుమార్, ఏడూళ్ళబయ్యారం సీఐ అంబటి నర్సయ్య హుటాహుటిన గోదావరి ఒడ్డుకు చేరుకున్నారు. మృతుల కుటుంబీకులను ఓదార్చారు. మృతదేహాలకు గోదావరి ఒడ్డునే పోస్టుమార్టం నిర్వహించేలా చూడాలని డీఎంఅండ్‌హెచ్‌ఓను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఫోన్‌లో కోరారు.



వైద్యులు వెంటనే వచ్చి, పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించారు.



కేసు నమోదు

నలుగురు యువకుల మృతిపై ఏడూళ్లబయ్యా రం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమా దం తీరును తెలుసుకున్నారు. మృతుల వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు సీఐ అంబటి నర్సయ్య చెప్పారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top