గోదావరి గుండెలపై... మందుపాతర


  • దిన దిన గండంగా జిల్లా ప్రజల జీవనం

  •  కేజీ బేసిన్ కల్లోలం

  •  మరమ్మతులు ట్రంక్ లైన్లకే పరిమితం

  •  900 కిలోమీటర్లకు 95 కిలో మీటర్లు మాత్రమే మార్పు

  •  గడువు తీరినా పట్టించుకోని వైనం

  •  లీకేజీలు షరా మామూలే...

  •  ‘నగరం’ విషాద ఘటనతో గుణపాఠం ఏదీ?

  • తూర్పుగోదావరి జిల్లా పేరు వినగానే దశాబ్దాల కిందట మదిలో మెదిలే అందమైన భావన ఇది. కాలం మారుతోంది ... ప్రకృతి కనువిందులపై మందుపాతరలు పేలుతున్నాయి. కంటినిండా కునుకు రాదు ... రెప్ప పడితే ఉదయం తెరుచుకుంటుందో...లేదోననే భయం కోనసీమలో అలుముకుంది. మామిడుకుదురు మండలంలోని నగరం గ్రామంలో గ్యాస్ బుసకొట్టి మృత్యువు కబళించిన ఆ విషాద ఘటనలు మరవకముందే మరోసారి గత వారం, పది రోజులుగా బుసలు కొడుతూ గ్యాస్ పెల్లుబికి ముచ్చెమటలు పట్టిస్తుంది. జనం గుండెలపై మందుపాతర్లగా పేలుతున్నాయి. పచ్చని జీవితాల్లో అల్లకల్లోలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథన మిదీ...

     

     మలికిపురం : రెండేళ్ల క్రితం సంభవించిన నగరం పేలుడు దుర్ఘటన ఆయిల్, గ్యాస్ వ్యాపార సంస్థలకు ఏమాత్రం గుణపాఠం నేర్పలేదని తరచూ సంభవిస్తున్న  సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఇలాంటి విషాద ఘటనలు జరుగుతాయని ముందే ఊహించారేమో కేజీ బేసిన్‌కు 30 ఏళ్ల క్రితం పెట్టిన పేరేమిటో తెలుసా ‘మందుపాతర’. భూ గర్భంలోని చమురు నిక్షేపాలను బయటకు తీస్తున్నామని సగర్వంగా ప్రకటించే ఆయా అన్వేషణ సంస్థల నిర్లక్ష్య వైఖరి ప్రజల పాలిట ప్రాణ సంకటంగా మారుతోంది.




    మొత్తం 900 కిలో మీటర్లు.. మార్చింది 95 కిలో మీటర్ల

    కేజీ బేసిన్‌లో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్)కు మొత్తం 900 కిలోమీటర్లు గ్యాస్ పైప్‌లైన్లు విస్తరించి ఉన్నాయి.  కెయిర్న్, రిలయన్స్‌లకు చెందిన గ్యాస్‌లైన్లూ ఉన్నాయి. గెయిల్ లైన్లు  కోనసీమతోపాట కొవ్వూరు, విజ్జేశ్వరం, వేమగిరి, కాకినాడ, విజయవాడ, కొండపల్లి, హైదరాబాద్ వరకూ వీటిని ఏర్పాటు చేశారు.


    నగరంలో గెయిల్ పైప్ లైన్ పేలుడు అనంతరం కేంద్ర పెట్రోలియం శాఖ ఆదేశాల మేరకు పలు సర్వే సంస్థలచే నాణ్యత పరిశీలిన అనంతరం ఇచ్చిన నివేదిక ఆధారంగా కేజీ బేసిన్‌లో గెయిల్ గ్యాస్ పైపు లైన్లన్నీ సుమారు 25 ఏళ్ల క్రితం వేసినవేనని, వీటిలో సుమారు 700 కిలోమీటర్ల లైన్లు మార్చాలని గ్యాస్ సంస్థలకు సూచించినట్లు సమాచారం.

     

    ఇప్పటి వరకూ కేవలం 95 కిలోమీటర్ల మేర మాత్రమే పైప్‌లైన్లు మార్చారు. అది కూడా ప్రమాదానికి గురైన తాటిపాక - విజయవాడ ట్రంక్ లైన్లో కేవలం తాటిపాక నుంచి దిండి వరకూ మాత్రమే 20 కిలోమీటర్లు మార్చారు. విజయవాడ నుంచి దిండి వరకూ సుమారు 170 కిలోమీటర్ల లైన్ మార్చ లేదు. అయినప్పటికీ గ్యాస్ సరఫరా జరుగుతూనే ఉంది.


    దిండి- కొవ్వూరు  మధ్య సుమారు 75 కిలో మీటర్ల లైన్ పనులు  వచ్చే ఏడాది ప్రారంభిస్తామంటున్నారు. ఈ లైన్‌లో కూడా విజ్జేశ్వరం పవర్‌ప్లాంట్ సహా పలు విద్యుత్ ప్రాజెక్టులకు  గ్యాస్ సరఫరా సాగుతూనే ఉంది. కాకినాడ- తాటిపాక మధ్య 75  కిలోమీటర్ల లైన్ పనులు  పూర్తయ్యాయి. ఈ కొత్త లైన్ ప్రారంభం కాలేదు కానీ ఇక్కడ కూడా పాత  లైన్‌లోనే  గ్యాస్ సరఫరా అవుతూనే ఉంది.

     

    ఆయిల్ లైన్లు కూడా అంతే...

    కోనసీమలోని వివిధ ప్రాంతాల్లోని సుమారు 100కు పైగా గ్యాస్ బావుల నుంచి తాటిపాక రిఫైనరీ వద్దకు  నాలుగు  అంగుళాల పైప్‌లైన్లు ద్వారా ఆయిల్ కమ్ గ్యాస్‌ను తరలిస్తారు. మరో వంద బావుల నుంచి కేశనపల్లి, అడవిపాలెం, కేశవదాసుపాలెం జీసీఎస్‌లకు కూడా నాలుగు అంగుళాల పైప్‌లైన్ల నుంచి గ్యాస్, ఆయిల్‌ను తరలిస్తారు, ఇవి ఓఎన్జీసీ పరిధిలో ఉంటాయి. ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల నివాసాల మధ్య ఉన్నాయి. ఇవి కూడా  శిధిలమై తరచూ పేలిపోతున్నాయి. బావుల వద్ద తరచూ లీకేజీలే.   

     

    పొగమంచుని చూసినా...

    గ్రామాల్లో  ఆయిల్ బావుల వద్ద, గ్యాస్ లైన్లు వెళ్లిన ప్రాంతాల్లోనూ పొగమంచును చూసినా ఆందోళన చెందుతున్న పరిస్థితి. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న  పైప్‌లైన్ల నిర్మాణంలో బాధ్యతగా వ్యవహరించవ్యవహరించాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.

     

    కోనసీమలో ఆయిల్, గ్యాస్ నిక్షేపాలు వెతికితీత ప్రారంభం నుంచి...

     1990 లో కొమరాడ ఆయిల్ బావి బ్లోఅవుట్.

     1994లో అమలాపురం వద్ద బొడసకుర్రు బ్లోఅవుట్

     1995లో కొత్త పేట మండలం దేవరపల్లి బ్లోఅవుట్

     2011లో రాజోలు మండంలో కడలిలో పొన్నమండ నుంచి తాటిపాకకు వెళ్లే గెయిల్ పైపు పేలుడు

     2012లో రాజోలు మండలంలో కాట్రేని పాడులంక బావి బ్లోఅవుట్ తృటిలో తప్పింది

     2014 గొల్లపాలెం- కరవాకలో బ్లో అవుట్ కూడా వెంట్రుకవాసిలో తప్పింది

     2015 లో కేశవదాసుపాలెం జీసీఎస్‌లో ఆయిల్ పైప్ పేలుడు


     

     దశలవారీగా మారుస్తాం

     నగరం పేలుడు అనంతరం  కేంద్ర ప్రభుత్వం నియమించిన పలు సర్వే సంస్థల నివేదిక ఆధారంగా పైప్‌లైన్లను దశల వారీగా మారుస్తున్నాం. ఇప్పటి వరకూ దిండి- తాటిపాక మధ్య 20 కిలోమీటర్లు, తాటిపాక- కాకి నాడ మధ్య 75 కిలోమీటర్లు మార్చాం. త్వరలో దిండి- కొవ్వూరు మధ్య లైన్ పనులు ప్రారంభిస్తాం.

     - వై.ఎ. కుమార్, గెయిల్ చీఫ్ మేనేజరు

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top