ఈ శిక్ష తగునా..?

ఈ శిక్ష తగునా..? - Sakshi


కక్షల నేపథ్యంలో తలిదండ్రుల హత్య

అనాథగా మారిన కుమారి

పోలీసుల సంరక్షణలో ఎన్నాళ్లు?




సాలూరు(విజయనగరం) :

అభం, శుభం తెలియని ప్రాయం ఆ బాలికది. ఏ తప్పూ చేయకపోయినా.. అయినవారు కక్షలకు పోవడంతో తాను శిక్ష అనుభవిస్తోంది. కన్న తల్లిదండ్రులకు దూరమై అనాథగా మారింది. ఆ బాలిక పేరు తాడంగి కుమారి. వయసు ఎనిమిదేళ్లు. ఊరు బింగుడువలస. ఈనెల 11వరకు తను కూడా అందరి చిన్నారుల్లాగే ఎంతో సంతోషంగా ఆడుతూ.. పాడుతూ.. అమ్మా, నాన్నల చెంత మారాం చేస్తూ సంతోషంగా గడిపింది. ఇంతలో బాబాయి కుటుంబంతో తన తల్లిదండ్రులు సీతమ్మ, శంబుకున్న పాతకక్షలు పొడచూడడంతో ఈనెల 11న తల్లిదండ్రులిద్దరూ దారుణ హత్యకు గురయ్యారు. తల్లిదండ్రులు తప్పు చేసారో లేదో గానీ స్పర్థల నేపథ్యంలో కుమారి జీవితం ప్రశ్నార్థకమైంది. అన్నీ తామై పెంచిన అమ్మానాన్నలు ఇక తిరిగిరారన్న విషయం పూర్తిగా అర్థం కాకపోయినా..  బంధువులు, ఇళ్లూ వాకిలీ, ఊరు అన్నీ వదిలి పోలీసుల సంరక్షణలో కాలం వెళ్లబుచ్చాల్సిన దుస్థితి ఏర్పడింది.



ఇమడలేకపోతున్న చిన్నారి

తల్లిదండ్రుల హత్య నేపథ్యంలో విచారణకు వెళ్లిన సీఐ జి. రామకృష్ణ అనాథ అయిన కుమారిని వెంటబెట్టుకుని సాలూరు పోలీస్‌స్టేషన్కు తీసుకువచ్చారు. రెండు రోజులపాటు మహిళా హోమ్‌గార్డ్‌ ఇంటిలో ఆశ్రయం కల్పించారు. అక్కడ ఇమడలేకపోతే తన ఇంటికే సీఐ తీసుకువెళ్లి తన పిల్లలతో కలిపి ఉంచారు. రెండు రోజులు గడచిన తర్వాత చైల్డ్‌లైన్‌ సంస్థకు అప్పగించారు. అయితే  కొండకోనల్లో  హాయిగా గడిపిన ఆ చిన్నారి అక్కడ కూడా ఇమడలేకపోయింది. దీంతో బాలికను  అక్కడ నుంచి బొబ్బిలిలోని సన్‌రైజ్‌ హోమ్‌కు తరలించారు. అక్కడా అదే పరిస్థితి. చేసేది లేక కుమారిని మరలా తన ఇంటికే తీసుకువచ్చారు సీఐ రామకృష్ణ, తన బిడ్డ దుస్తులనే వేయించి, ఆలనాపాలనా చూస్తున్నారు. కుమారికి అండగా నిలుస్తానని సీఐ రామకృష్ణ చెబుతున్నప్పటికీ, ఇలాంటి వ్యక్తులు  తారసపడకపోయి ఉంటే ఆ చిన్నారి పరిస్థితి ఏమిటనేది ప్రశ్న.



జీవితాలు బలిపెట్టొద్దు..

ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం, కక్షలు పెంచుకోవడం వంటి కారణాలతో చాలామంది తమ జీవితాలను నాశనం చేసుకోవడంతో పాటు, పిల్లల భవిష్యత్‌ను కూడా నాశనం చేస్తున్నారు. అందుకే చట్టంపై అవగాహన పెంచుకుని, ప్రశాంతంగా జీవనం సాగించాలి.

     – జి రామకృష్ణ, సీఐ, సాలూరు

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top