భూ సేకరణకు సిద్ధం కండి

భూ సేకరణకు సిద్ధం కండి - Sakshi

  • మంత్రి దేవినేని ఉమ

  • గుమ్మఘట్ట : జీడిపల్లి నుంచి బీటీపీ వరకు త్వరలో భూ సేకరణ పనులకు సిద్ధంకావాలని ఆర్డీఓ రామారావును జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆదేశించారు. గుమ్మఘట్ట మండలం బీటీప్రాజెక్ట్‌ రిజార్వాయర్‌ను మంగళవారం జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఉన్నం హనుమంతరాయచౌదరి, బీకే పార్థసారథి, ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, ఇతర జిల్లా అధికారులు, ప్రజాప్రతి నిధులు సందర్శించారు.


    ముందుగా రిజర్వాయర్‌ వద్దనున్న సవారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రిజర్వాయర్‌ పై భాగంలో హెడ్‌స్లూయిస్, ప్రాజెక్ట్‌ ఎత్తు, పూడిక, జీడిపల్లి నుంచి నీరు తెచ్చేందుకు కావాల్సిన లిఫ్ట్‌ల సౌకర్యంపై ఇరిగేషన్‌ సీఈ జలంధర్, ఎస్‌ఈ సుబ్బారావును అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి అథితి గృహం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో దేవినేని మాట్లాడారు. 


    సముద్రం సున్నాలో ఉంటే జీడిపల్లి రిజర్వాయర్‌ 1718 అడుగుల్లో ఉందనీ, బీటీపీకి 330 అడుగుల ఎత్తుకు నీటిని ఎత్తిపోసి 8 లిప్ట్‌ల ద్వారా నీటిని చేర్చాల్సి ఉంటుందన్నారు. ఇందుకు రూ.1100 కోట్లను ప్రభుత్వం ఖర్చుచేయాల్సి ఉందని చెప్పారు. జీడిపల్లికి ప్రస్తుతం ఆరు పంపుల ద్వారా నీటిని చేర్చుతున్నామని, మరో రూ.1000 కోట్లు ఖర్చుచేసి అదనంగా మరో ఆరు పంపులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.  ఈ పనులు ఆగస్టులోగా పూర్తయ్యేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. బీటీపీకి కచ్చితంగా నీరు తెస్తామని మంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు.


    బీటీపీకి నీరివ్వడం సాధ్యం కాదు..


    భైరవానితిప్ప ప్రాజెక్టు (బీటీపీ)కు ఇప్పట్లో నీరివ్వడం సాధ్యం కాదనీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. 12 నెలల్లో కృష్ణాజలాలు తెస్తామనే మాటలను ప్రజలు నమ్మవద్దన్నారు. వచ్చే ఎన్నికల నాటికి మీ అందరి కలను కచ్చితంగా సాకరం చేస్తామని చెప్పారు. బీటీపీకి నీరు తేవాలంటే భూసేకరణ పూర్తికావాలా..? ఇందుకు రైతులు అంగీకరించాలా..? ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి సీనయ్య (మంత్రి కాలవ శ్రీనివాసులు)కు కంటనీళ్లు తప్పవని తేల్చి చెప్పారు. వచ్చే ఏడాదికి పోలవరం పూర్తవడం కూడా అనుమానమేనన్నారు. 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top