ప్లీనరీ పేరుతో జల్సాలా?

ప్లీనరీ పేరుతో జల్సాలా?


కరువుతో జనం పస్తులుంటే..

విందులు చేసుకుంటారా?

టీఆర్‌ఎస్ తీరును తప్పుపట్టిన ఎమ్మెల్యే గీతారెడ్డి


 జిల్లాలో కరువు సహాయక చర్యలు  తక్షణమే చేపట్టాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. నర్సాపూర్ ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిర్వహిం చిన నిరసనలో డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే గీతారెడ్డి ఆధ్వర్యంలో జహీరాబాద్‌లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరువు సమయంలో ప్రజలను, రైతులను ఆదుకోవాల్సిన టీఆర్‌ఎస్ ప్లీనరీ పేరుతో జల్సాలు చేస్తోందని విమర్శించారు.


జహీరాబాద్: కరువుతో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతుంటే టీఆర్‌ఎస్ నేత లు మాత్రం ప్లీనరీ పేరుతో జల్సాలు చేయడం ఎంతవరకు సమంజసమని ఎమ్మెల్యే జె.గీతారెడ్డి విమర్శించారు. బుధవారం ఆమె జహీరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఓవైపు కరువు, మరో వైపు రైతుల ఆత్మహత్యలతో రాష్ట్రం అట్టుడికిపోతుంటే ప్లీనరి పేరుతో 55 రకాల వంటకాలతో సీఎం, మంత్రులు, టీఆర్‌ఎస్ నేతలు విందు ఆరగించడం ఎంతమాత్రం సబబు కాదన్నారు. ప్రజలు గుక్కెడు నీరు, అన్నం ముద్ద కోసం అల్లాడుతున్నారని గుర్తుచేశారు.


ఇటు జనం కడుపులు మాడుతుంటే నేతలు మాత్రం పసందైన వంటకాలతో విందారగించడం విచారకరమన్నారు. టీఆర్‌ఎస్ ప్లీనరీని జరుపుకోవడం సరైందే అయినా కరువు పరిస్థితుల దృష్ట్యా సాదా సీదాగా నిర్వహిస్తే సరిపోయేదన్నారు. ఖమ్మం జిల్లా పాలేరులో ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకునే టీఆర్‌ఎస్ ప్లీనరీ నిర్వహిస్తోందని ఆరోపించారు. ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. ఖేడ్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసమే ఆ పార్టీ ప్రయత్నిస్తోంది తప్ప ప్రజల బాగోగుల కోసం కాదని విమర్శించారు. 


ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధమవుతున్నారన్నారు. జహీరాబాద్ మండలం రంజోల్ సర్పంచ్ పదవికి ఉప ఎన్నిక జరగనున్నందున అక్కడ అభివృద్ధి కూడా ఇప్పుడే గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. సమావేశంలో జహీరాబాద్ పార్లమెంట్ యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలు మేఘనారెడ్డి, కాంగ్రెస్ నాయకులు మంకాల్ సుభాష్, కండెం నర్సింలు, శ్రీనివాస్‌రెడ్డి, షిలారమేష్ పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top