'ర్యాగింగ్‌పై ఉక్కుపాదం'

'ర్యాగింగ్‌పై ఉక్కుపాదం'


తాడేపల్లిగూడెం: కళాశాలల్లో ర్యాగింగ్‌కు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. తాడేపల్లిగూడెంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ర్యాగింగ్ నిరోధానికి కళాశాలల్లో బయట వ్యక్తుల ప్రమేయం లేకుండా చూసేందుకు ప్రతి విద్యార్థికి బార్ కోడింగ్, గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పారు. కుల, మత సంఘాలకు సంబంధించి ఎలాంటి ప్రచార బోర్డులను అనుమతించేది లేదన్నారు. గతంలో విద్యాభివృద్ధికి 10 శాతానికి మించి బడ్జెట్ ఉండేది కాదని, ప్రస్తుత ప్రభుత్వం బడ్జెట్‌ను 17 శాతానికి పెంచి రాష్ట్రాన్ని 'ఎడ్యుకేషన్ హబ్‌'గా మార్చేందుకు కృషి చేస్తోందని చెప్పారు.



విద్యతోపాటు పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించే విద్యాబోధన అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనికోసం బీవీ పట్టాభిరామ్, చాగంటి కోటేశ్వరరావు వంటి వారితో విద్యాసంస్థల్లో అవగాహన తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. ఉన్నత విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు మంత్రిమండలి నిర్ణయం తీసుకుందన్నారు. అన్ని కళాశాలల్లో వైఫై సౌకర్యంతోపాటు బయోమెట్రిక్ పద్ధతి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉత్తమ విద్యాబోధన అందించే చర్యల్లో భాగంగా విద్యార్థులకు 75 శాతం హాజరు ఉంటేనే ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపజేస్తామన్నారు. ఆయన వెంట రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఉన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top