జిల్లాలో గం’జాయ్‌’

జిల్లాలో గం’జాయ్‌’ - Sakshi

అమ్మపాలెంలో విచ్చలవిడిగా అమ్మకాలు 

ఇంజినీరింగ్‌ విద్యార్థులే టార్గెట్‌

కళాశాలల సమీపంలోనే నిల్వలు

’సాక్షి’, ఎక్సైజ్‌ శాఖ సంయుక్త దాడులు

భారీ ఎత్తున సరకు స్వాధీనం

సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లాలో గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి.  ఇంజినీరింగ్‌ విద్యార్థులే టార్గెట్‌గా ఈ దందా నడుస్తోంది. ఏలూరు శివారు పెదవేగి మండలం అమ్మపాలెం దీనికి వేదికవుతోంది. ప్రతి ఆదివారం ఇక్కడకు విద్యార్థులు భారీగా  వచ్చి గంజాయి కొనుగోలు చేస్తున్నట్టు సమాచారం. దీంతో ఈ దందాపై వచ్చిన సమాచారంతో ’సాక్షి’ ఎక్సైజ్‌ అధికారులను అప్రమత్తం చేసింది. వారు ’సాక్షి’ప్రతినిధులతో కలిసి  సంయుక్తంగా అమ్మపాలెంలో శనివారం దాడులు నిర్వహించారు. దీంతో భారీ ఎత్తున గంజాయి బయటపడింది.

చిన్న ప్యాకెట్లలో విక్రయం 

జిల్లాలో గంజాయి సాగు లేనప్పటికీ  విశాఖపట్నం ఏజెన్సీ నుంచి జిల్లా మీదుగా గంజాయి అక్రమ రవాణా సాగుతోంది. ఈ అక్రమ రవాణాలో కీలకపాత్రదారులు జిల్లావారు కావడంతో గుట్టుచప్పుడు కాకుండా రాష్ట్ర సరిహద్దులు దాటుతోంది. అప్పుడప్పుడు పోలీసులకు వచ్చిన సమాచారంతో భారీగా గంజాయి పట్టుబడుతోంది. బయట నుంచి తీసుకువచ్చిన గంజాయిని చిన్నచిన్న పాకెట్లలో విక్రయిస్తున్నారు. చిన్న ప్యాకెట్‌ గంజాయి రూ.వంద వరకూ పలుకుతున్నట్టు సమాచారం.

బయట పడిందిలా..!

 పెదవేగి మండలంలో గంజాయికి అలవాటు పడ్డ ఓ యువకుడు ఇంట్లో వారి ఒత్తిడి మేరకు గంజాయి మానివేసే యత్నం చేశాడు.  దీంతో గంజాయిని అలవాటు చేసిన ముఠా ఇతనిపై దాడి చేయడంతోపాటు అతని కుటుంబసభ్యులపైకీ ఆ ముఠా దాడికి తెగబడింది. ఫలితంగా మనస్తాపానికి గురైన గంజాయి బాధితుడి తమ్ముడు గతనెలలో అత్మహత్యాయత్నం చేశాడు. దీంతో బాధితుడు సాక్షిని ఆశ్రయించాడు. ఈ విషయాన్ని ’సాక్షి’ ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారుల దృష్టికి తీసుకువెళ్లింది. 

నిఘా పెట్టి దాడి 

’సాక్షి’ ఇచ్చిన సమాచారంతో అధికారులు కొన్ని రోజులుగా గంజాయి విక్రయ కేంద్రాలపై నిఘా పెట్టారు. శనివారం దాడులు నిర్వహించారు. ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ సురేష్‌బాబు, సీఐ ధనరాజుల ఆధ్వర్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏఈఎస్‌ నాగేందర్‌తో కలిసి బృందంగా ఏర్పడి అమ్మపాలెంలో నాలుగు స్థావరాలపై దాడులు నిర్వహించారు.  వీరంకి సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లో ఐదు కిలోల గంజాయి బస్తాను స్వాధీనం చేసుకోగా పక్కనే ఉన్న ఇంట్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న గంజాయి ప్యాకెట్లు పట్టుపడ్డాయి. దాడుల సమయంలో నిందితులు లేకపోవడంతో కేసు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకోవాలని నిర్ణయించారు. విశాఖపట్నం పరిసర ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకువచ్చి అమ్ముతున్నట్టు విచారణలో తేలింది. 

సిగరెట్‌ కవర్లలో నింపి.. 

హైదరాబాద్‌లో డ్రగ్స్‌ దందా పద్ధతిలోనే ఇక్కడ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయాలు సాగుతున్నట్టు సమాచారం. ఇంజినీరింగ్‌ కళాశాలకు దగ్గరలోనే ఈ  విక్రయ స్థావరాలు ఉన్నాయి. ప్రతి శనివారం, ఆదివారం విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ ప్రాంతానికి గంజాయి కొనుగోలు చేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఏలూరు ఆర్‌ఆర్‌పేటలోని ఒక హోటల్‌ వద్ద ఉన్న బంకులో సిగరెట్‌ ఖాళీ కవర్లు అమ్ముతున్నట్టు సమాచారం. గంజాయిని కొనుగోలు చేసి దాన్ని పొడిగా మార్చి సిగరెట్‌ ఖాళీ కవర్లలో దీన్ని కూర్చి తాగుతున్నట్టు తెలిసింది.  సిగరెట్‌ ధరలోనే గంజాయి కూడా అందుబాటులో ఉండటం, మత్తు ఎక్కువగా ఉండటంతో విద్యార్థులు దీనికి అలవాటు పడుతున్నట్టు సమాచారం. 

 

 

 

 

 

 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top