కళాకారిణిపై గ్యాంగ్‌ రేప్‌


►    బాధితురాలు చిత్తూరు జిల్లా వాసి

►    పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు

►    ఆస్పత్రికి తరలింపు



నార్పల : శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవ ముగింపు కార్యక్రమంలో అపచారం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన కళాకారిణిపై సామూహిక అత్యాచారం, దాడి చేశారు. శనివారం అర్ధరాత్రి ఈ సంఘటన నార్పలలో జరిగింది. బాధితురాలు తెలిపిన కథనం మేరకు... మండల కేంద్రం నార్పలలో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవ ముగింపు కార్యక్రమం జరిగింది. చిత్తూరు జిల్లా తిరుపతి నుంచి చెక్కభజన, బృందగాన కళాకారులు హాజరయ్యారు. సాయంత్రం నుంచి చెక్క భజన, బృందగానంతో కళాకారులు ప్రజలను రంజింపజేశారు. అదే రోజు రాత్రి పది గంటల సమయంలో ఓ వితంతు కళాకారిణి తనతో సన్నిహితంగా ఉండే వ్యక్తితో కలిసి శివకళాజ్యోతి భవన ఆవరణలో నిద్రించింది. అప్పటికే అక్కడ మాటవేసిన ఓ ముగ్గురు యువకులు రాత్రి 11.30 గంటల సమయంలో ఆమెను అక్కడి నుంచి  చీకటిగదిలోకి ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు. ప్రతిఘటించే సమయంలో ఆ యువకులు దాడికూడా చేశారు.  



కలకలం

చీకటి గదిలో కామాంధుల చెరనుండి తప్పించుకున్న బాధితురాలు కూతలేరు వంక గట్టున ఉన్న చికెన్‌ సెంటర్‌ వద్ద నిద్రిస్తున్న వారిని లేపి జరిగిన విషయాన్ని కన్నీరుమున్నీరుగా విలపిస్తూ చెప్పింది. వారు వెంటనే పరిసర ప్రాంతంలో గాలించగా ఎవరూ కనిపించలేదు. ఆదివారం ఉదయం బాధితురాలు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కళాకారిణిపై అత్యాచారం జరిగిందన్న విషయం దావానలంలా వ్యాపించడంతో మండల కేంద్రంలో కలకలం రేగింది. జనం శివకళాజ్యోతి ఆవరణం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆరా తీయడం కనిపించింది.



పోలీసుల అదుపులో అనుమానితులు?

అత్యాచారం ఘటనలో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వారిని తమదైన శైలిలో విచారణ చేస్తున్నట్లు సమాచారం. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. ఇటుకలపల్లి సీఐ రాజేంద్రప్రసాద్‌ యాదవ్‌ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top