గండికోట ఉత్సవాలను వైభవంగా నిర్వహిద్దాం!

గండికోట ఉత్సవాలను వైభవంగా నిర్వహిద్దాం! - Sakshi


– 16, 17 తేదీల్లో ఉత్సవాలు

– ముఖ్యమంత్రికి ఆహ్వానం

కడప కల్చరల్‌ :  జిల్లాకు ప్రతిష్టాత్మకరంగా ఉన్న గండికోటలో వారసత్వ ఉత్సవాలను అక్టోబరు 16, 17 తేదీలలో వైభవంగా నిర్వహించేందుకు అన్ని వర్గాల వారు తమవంతు సహకారం అందించాలని కలెక్టర్‌ కేవీ సత్యనారాయణ తెలిపారు. కలెక్టరేట్‌ సభా భవనంలో శుక్రవారం ఆయన గండికోట ఉత్సవాల సన్నాహాక తొలి సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గండికోట ఉత్సవాల సందర్బంగా కడప, ప్రొద్దుటూరులలో కూడా ఒకటి, రెండు రోజులు ముందు ప్రచార సంబరాలు నిర్వహించి ప్రధాన ఉత్సవాలకు ఎక్కువ మంది హాజరయ్యేలా కృషి చేస్తామని తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు ఇప్పటికే కమిటీలను ఏర్పాటు చేశామని, ప్రస్తుతం సావనీర్‌ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రెండు రోజుల్లో ఉత్సవాలకు సంబంధించిన అన్ని విభాగాల తుది ప్రణాళికలను సిద్ధం చేసి కార్యచరణ ప్రారంభించాలని సూచించారు.  కార్యక్రమాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వానిస్తున్నామని, ప్రకటించిన తేదీలలో ఆయనకు వీలు కాకుంటే ఆ వారంలోనే వీలైన తేదీలలో నిర్వహిస్తామని తెలిపారు.  రాష్ట్ర పర్యాటకశాఖ రీజినల్‌ డైరెక్టర్‌ జి.గోపాల్‌ మాట్లాడుతూ ఉత్సవాలను గండికోటతోపాటు ఇతర ప్రాంతాలలో కూడా నిర్వహించాలన్న కొందరి సూచనపై చర్చ నిర్వహించారు. సిద్దవటం, కడప లేదా ఇతర ప్రాంతాలలో నిర్వహించేందుకు ఆర్థిక వనరులు సరిపోవని, ఒకటి, రెండు రోజులు ముందు సన్నాహాల స్వాగత ఉత్సవాలను కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగులలో నిర్వహిద్దామని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఉత్సవాలను ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి రాత్రి 8.00 గంటల వరకు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో సిద్దవటం సీతారామయ్య, ఎలియాస్‌రెడ్డి, ఎన్‌.ఈశ్వర్‌రెడ్డి, సాంబశివారెడ్డి, ఇంకా పలువురు ప్రముఖులు మాట్లాడారు. ఏఎస్పీ విజయ్‌కుమార్, జిల్లా పర్యాటకశాఖ అధికారి ఖాదర్‌బాషా, డీఆర్‌డీఏ పీడీ అనిల్‌కుమార్‌రెడ్డి, అన్ని విభాగాల కమిటీ కన్వీనర్లు, సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు.



 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top