ఎంపీ గల్లా చౌక బేరం

వేలం వేయబోతున్న ఇల్లు (ఇన్సెట్) జయదేవ్


అద్దెకున్న భవనంపై కన్నేసిన జయదేవ్

సగం ధరకే కొట్టేయడానికి పథకం

ఎంపీకి సహకరించిన బ్యాంకు డీజీఎం?

రూ.7.5 కోట్ల భవనం ప్రారంభ ధర రూ.2.80 కోట్లుగా నిర్ణయం

డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఆదేశాలూ బుట్టదాఖలు

నేడు 11-12 గంటల మధ్య వేలం

ఆసక్తి చూపిన వారికి ఎంపీ అనుచరుల బెదిరింపులు


 

సాక్షి ప్రతినిధి, అమరావతి: 50 శాతం డిస్కౌంట్ అని దుస్తుల దుకాణం ముందు బోర్డు పెడితేనే కొనడానికి క్యూ కట్టే కాలమిది. అలాంటి ప్రైమ్ ఏరియాలో భవనాన్ని సగానికి సగం ధరకే గుంటూరు నగరంలో బ్యాంకు వేలం వేస్తామంటే.. పోటీ ఎక్కువ ఉంటుంది. కానీ అద్దెకున్న భవనాన్ని చౌకగా కొట్టేయడానికి టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చక్రం తిప్పారు. బ్యాంకు అధికారుల సహకారంతో వేలానికి పోటీ లేకుండా చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే...



గుంటుపల్లి శ్రీనివాసరావు గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని 300 గజాల్లో మూడు అంతస్తుల భవనాన్ని 2013లో ఆంధ్రాబ్యాంకులో తాకట్టుపెట్టి రూ. 2.30 కోట్ల రుణం తీసుకున్నారు. ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో ఈఎంఐ చెల్లించలేకపోయారు. ఈ భవనాన్ని 2014 ఎన్నికల సమయంలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అద్దెకు తీసుకున్నారు. ఇంటి యజమాని ఈఎంఐలు చెల్లించలేకపోవడంతో... బ్యాంకు అధికారులపై ఒత్తిడి తెచ్చి భవనం వేలానికి వచ్చేలా చేశారు. ఆ తర్వాత బ్యాంకు డీజీఎంతో కుమ్మక్కై రిజర్వు ధర మరీ తక్కువగా ఉండేలా చక్రం తిప్పారని తెలుస్తోంది. ఈమేరకు.. ప్రస్తుతం రూ.7.5 కోట్లు మార్కెట్ విలువున్న భవనం ప్రారంభ ధర రూ. 2.80 కోట్లుగా నిర్ణయించి బ్యాంకు ఇటీవల వేలం ప్రకటన జారీ చేసింది.



ఆసక్తి చూపినవారికి బెదిరింపులు

తన భవనాన్ని వేలం వేయడాన్ని శ్రీనివాసరావు ఆర్డీటీ(డెట్ రికవరీ ట్రిబ్యునల్)లో సవాల్ చేశారు. తాను బాకీ పడిన మొత్తం రూ. 1.98 కోట్లు చెల్లించడానికి కొంత గడువు కావాలని కోరారు. ఈ నెల 24లోగా రూ. కోటి చెల్లిస్తే, మిగతా సగం చెల్లించడానికి సహేతుకమైన గడువు ఇవ్వాలంటూ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలు బుట్టదాఖలు చేస్తూ 24వ తేదీ ఉదయం 11-12 గంటల మధ్య వేలం వేయడానికి బ్యాంకు సిద్ధమైంది.



వేలంలో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న వారు భవనాన్ని సందర్శించడానికి ఈనెల 20, 21 తేదీల్లో అవకాశం కల్పించింది. అయితే భవనాన్ని సందర్శించడానికి వెళ్లిన వారిని... ‘అధికార పార్టీ ఎంపీ నివాసం ఉన్న భవనాన్ని కొని, ఖాళీ చేయించే దమ్ము మీకు ఉందా?’ అని బెదిరించడంతో పోటీకి రాకుండా తప్పుకున్నారు. స్థానిక వ్యాపారి దేనా బ్యాంకు నుంచి ధరావత్తు సొమ్ము చెల్లించినా.. గురువారం రాత్రి వరకు వేలంలో పొల్గొనడానికి వీలు కల్పించే పాస్‌వర్డ్‌ను చెప్పలేదు. పోటీ నుంచి తప్పుకోవాలని అధికార పార్టీ నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.

 

యథేచ్ఛగా నిబంధల ఉల్లంఘన

రిజర్వుబ్యాంకు నిబంధనల ప్రకారం.. వేలం వేయాల్సిన భవనాన్ని ఖాళీ చేయించి బ్యాంకు స్వాధీనం చేసుకోవాలి. బ్యాంకుకు తాకట్టుపెట్టినట్లు అందరికీ కనిపించే విధంగా పెద్ద అక్షరాలతో భవనం మీద రాయాలి. భవనానికి తాళం వేయాలి. కానీ... భవనంలో నివాసం ఉంటున్న ఎంపీ గల్లా జయదేవ్ గురువారం రాత్రి 12 గంటల వరకు ఖాళీ చేయలేదు. బ్యాంకుకు తనఖా పెట్టినట్లు ఎక్కడా రాయనూ లేదు. ఈ విషయమై బ్యాంకు మేనేజర్‌ను ‘సాక్షి’ ప్రశ్నించగా... అవన్నీ ఇంటి యజమాని అడగాలి, మీరడుగుతున్నారేంటి? అని ఎదురు ప్రశ్నించారు. ట్రిబ్యునల్ ఉత్తర్వులు అందితే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తక్కువ ప్రారంభ ధరపై సమాధానం దాటవేశారు. 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top