తమ్ముళ్ల తగువు


సాక్షి ప్రతినిధి, ఒంగోలు:  టీడీపీ పాతనేతలు, ఫిరాయింపు ఎమ్మెల్యేల మధ్య తగువు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ముఖ్యంగా అద్దంకి వ్యవహారం ఆ పార్టీ అధిష్టానానికి కొరకరాని కొయ్యగా మారింది. పాత నేత కరణం బలరాం ఇటు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ వర్గాలను సర్దుబాటు చేయలేక మంత్రులు చేతులెత్తగా ముఖ్యమంత్రి సైతం ఎటూ తేల్చుకోలేకపోవడంతో  అద్దంకిలో  అధికారపార్టీ ఆధిపత్యపోరు రోజురోజుకూ ముదురుతోంది. వారి గొడవలు తాజాగా జన్మభూమి–మా ఊరు కార్యక్రమానికి తలనొప్పిగా పరిణమించాయి.  ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా  జనచైతన్య యాత్రలు నిర్వహించిన టీడీపీ ఆ కార్యక్రమ బాధ్యతలను శాసనసభ్యులకు అప్పగించింది. ప్రకాశం జిల్లాలో నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉండటంతో ఆ పార్టీలో వర్గవిభేదాలు తలెత్తాయి. పాత, కొత్త నేతల మధ్య ఏ మాత్రం పొసగకపోవడంతో అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రాధాన్యతనివ్వడాన్ని అద్దంకికి చెందిన సీనియర్‌ నేత కరణం బలరాం, కరణం వెంకటేశ్, గిద్దలూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివిశివరాం, చీరాల టీడీపీ నేత పోతుల సునీత వ్యతిరేకించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బహిరంగ విమర్శలకు దిగారు. నచ్చచెప్పినా వినకపోవడంతో ఆ తరువాత అధిష్టానం బెదిరింపు ధోరణికి దిగింది. దీంతో మెత్తబడిన దివి శివరాం ఎమ్మెల్యే పోతుల రామారావుతో సర్దుబాటు చేసుకున్నారు. పోతుల సునీత ఎమ్మెల్యే ఆమంచితో రాజీపడలేక మిన్నకుండిపోయారు.  



= గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నారాంబాబు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డితో సయోధ్యకు ససేమిరా అన్నారు. పార్టీ అధిష్టానం గట్టిగా  చెప్పినా ఆయన వినలేదు. అలాగని పార్టీని వీడక ఎమ్మెల్యే వ్యతిరేక వైఖరినే కొనసాగిస్తున్నారు. దీంతో ఆ నియోజకవర్గంలో ఇరువర్గాల మధ్య తరచూ గొడవలు చెలరేగుతున్నాయి. భౌతికదాడులకు దిగిన సంఘటనలూ ఉన్నాయి.  



= ఇక అద్దంకిలో ఎమ్మెల్యే జనచైతన్య యాత్రలు నిర్వహించేందుకు  కరణం బలరాం, కరణం వెంకటేష్‌లు ససేమిరా అన్నారు. ఎమ్మెల్యే యాత్ర నిర్వహిస్తే తానూ యాత్రకు సిద్ధమని అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు. దీంతో ఎటూ తేల్చుకోలేని అధిష్టానం అద్దంకి నియోజకవర్గంలో జనచైతన్యయాత్రలు నిలిపివేసింది. ఆ తరువాత అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గొట్టిపాటికి అధికారుల బదిలీల్లో కొంత ప్రాధాన్యతనిచ్చి  సర్దుబాటు చేసింది. తాజాగా ప్రభుత్వం  జన్మభూమి – మా ఊరు పేరుతో  జనంలోకి వెళ్లే కార్యక్రమానికి సిద్ధమైంది. స్థానిక శాసనసభ్యుల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టారు.  గిద్దలూరు నియోజకవర్గంలో ఆ బాధ్యతను  ఎమ్మెల్యే ముత్తుములకు అప్పగించిన అధిష్టానం అద్దంకి  విషయంలో ఆదివారం రాత్రి వరకూ స్పష్టత ఇవ్వలేదు.



 ఎమ్మెల్యే గొట్టిపాటితో  కలిసి జన్మభూమి–మా ఊరు కార్యక్రమంలో పాల్గొనేది లేదని, తాను ప్రత్యేకంగా జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహిస్తానని కరణం ఇప్పటికే అధిష్టానానికి తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో అధిష్టానం కరణంను సర్దుబాటు చేసే బాధ్యతను జిల్లా మంత్రి శిద్దా రాఘవరావు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి రావెల కిశోర్‌బాబులతో పాటు మరికొందరు నేతలకు అప్పగించినట్లు సమాచారం. దీంతో మంత్రి శిద్దా రాఘవరావు తదితరులు ఆదివారం రాత్రి వరకు కరణంతో చర్చలు జరిపారు. ఇప్పటికే తాను ఎంతో సహనంతో ఉన్నానని, దశాబ్దాలుగా పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కరణం వాదించినట్లు తెలుస్తోంది. కొందరు అధికారులను సైతం నిర్దాక్షిణ్యంగా బదిలీలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.



ఇప్పటికైనా పార్టీ అధిష్టానం వాస్తవాలు గ్రహించాలని లేకపోతే అవసరమైతే అమీతుమీకి సిద్ధమని కరణం హెచ్చరించినట్లు తెలుస్తోంది. కరణం వాదనను మంత్రితో పాటు మిగిలిన నేతలు పార్టీ అధిష్టానానికి చేరవేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అధిష్టానం ఏం చెబుతుందన్న దానిపై కరణం వైఖరి ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో కరణం సోమవారం అద్దంకిలో ప్రత్యేకంగా జన్మభూమి – మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహిస్తారా... లేకపోతే ఎమ్మెల్యే గొట్టిపాటితో కార్యక్రమంలో పాల్గొంటారా.. అన్నది వేచి చూడాల్సిందే...!

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top