గడప గడపలో గర్జన

గడప గడపలో గర్జన - Sakshi


- దిగ్విజయంగా సాగుతోన్న‘గడప గడపకూ వైఎస్సార్’

- సర్కారు ఎన్నికల హామీలు ఒక్కటీ నెరవేర్చలేదని {పజల ఆవేదన

 

  సాక్షి నెట్‌వర్క్ : ‘‘రైతు రుణమాఫీ అంటే పొంగిపోయాం.. డ్వాక్రా రుణాలు కట్టొద్దంటే సంబరపడిపోయాం.. నిరుద్యోగ భృతి ఇస్తామని, పక్కా ఇళ్లు కట్టిస్తామని చెబితే గుడ్డిగా నమ్మేశాం.. కానీ అధికారం చేపట్టిన తర్వాత ఎన్నికల హామీలు మర్చిపోతారని, ఉన్న పథకాలను కూడా ఎత్తేస్తారని తెలుసుకోలేకపోయాం. చంద్రబాబు వంచనకు బలై ఇప్పుడు బాధ పడుతున్నాం. అన్ని అర్హతలు ఉన్నా పింఛన్లు ఇవ్వకపోగా, ఉన్నవి కూడా తీసేస్తున్నారు. రేషన్ కార్డుల్లో పేర్లు తొలగిస్తున్నారు. కొత్తగా ఒక్క పక్కా గృహం మంజూరు చేయలేదు. పాఠశాలలు కరువయ్యాయి, రోడ్లు, డ్రెయిన్లు అధ్వాన్నంగా ఉన్నాయి. ఆఖరుకు గుక్కెడు నీటికి కూడా అల్లాడుతున్నాం...’’ అంటూ చంద్రబాబు పాలనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ‘గడప గడపకూ వైఎస్సార్’ కార్యక్రమంలో భాగంగా తమను పలకరించిన వైఎస్సార్‌సీపీ నాయకులకు తమ బాధలు ఏకరువు పెడుతున్నారు.



ఈనెల 8వ తేదీన వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  ‘గడప గడపకూ వైఎస్సార్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు ఇచ్చిన 600 వాగ్దానాలు, హామీలతో అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబు ఆ తర్వాత వాటిని విస్మరించడాన్ని, చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ మేరకు వారం రోజులుగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలు గడప గడపకూ వెళ్లి పలకరిస్తున్నారు. ఉదయం పది గంటలకు ప్రారంభించి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.  



 ఎక్కువ మంది ఇచ్చింది సున్నానే..

  రెండేళ్ల చంద్రబాబు పాలన ఎలా ఉంది?  ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలు చేశారు? పాలనలో పాసయ్యారా, ఫెయిల్ అయ్యారా? అని కోరుతూ వంద ప్రశ్నలతో కూడిన ప్రజా బ్యాలెట్‌ను అందజేసి దానిపై మార్కులు వేయాలని ప్రజలను కోరుతున్నారు. అధికశాతం మంది సర్కారుకు వందకు సున్నా మార్కులు వేస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top