భవిష్యత్‌ రాజకీయ మార్పు

భవిష్యత్‌ రాజకీయ మార్పు - Sakshi


మంచిర్యాల : కాలచక్రం గిర్రున తిరిగింది.. నేటితో 2016 సంవత్సరం ముగుస్తోంది.  పోతూపోతూ ఈ సంవత్సరం మధుర జ్ఞాపకాలను ఎన్నింటినో çగుండెల్లో నింపింది. చరిత్రలో మిగిలే రోజును కళ్లెదుట ఆవిష్కరించి, భవిష్యత్‌ రాజకీయ మార్పులకు వేదికగా నిలిచింది. ఈ ఏడాది జిల్లాలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ నాలుగు జిల్లాలుగా విడిపోయింది. అన్ని జిల్లాల్లోనూ అధికార తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయంగా ఎదురులేని శక్తిగా నిలిచింది. కాంగ్రెస్‌ కొత్త జిల్లాల్లో ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేయగా, టీడీపీ కోలుకోలేని దశకు చేరుకుంది. వైఎస్‌ఆర్‌సీపీ కొత్త జిల్లాల్లో పుంజుకునే ప్రయత్నాల్లో ఉంది. పాదయాత్రతో సీపీఎంకు జవజీవాలు అందించేందుకు ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాదయాత్రతో ప్రయత్నించడం కొసమెరుపు. సింగరేణి కార్మికుల 18 ఏళ్ల వారసత్వ కల ఈ సంవత్సరమే సాకారమైంది.. రేపటి నుంచి కొత్త ఏడాది ఆరంభం అవుతున్న నేపథ్యంలో 2016లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో జరిగిన ప్రధాన రాజకీయ, సామాజిక మార్పులపై



అవలోకనం.. నెరవేరిన చిరకాల స్వప్నం

మూడు నెలల క్రితం వరకు.. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కోటపల్లి మండలంలోని రాపన్‌పల్లి గ్రామం నుంచి ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే కనీసం 6 గంటల సమయం పట్టేది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చొరవతో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. అక్టోబర్‌ 11న దసరా సంబురాలు కొత్త జిల్లాల్లో మిన్నంటాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ నుంచి ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్‌గా విడివడ్డాయి. ఇప్పుడు ఏ జిల్లా తీసుకున్నా.. మారుమూల నుంచి జిల్లా కేంద్రానికి రావాలంటే గరిష్ఠంV సమయం పట్టట్లేదు. జిల్లా కేంద్రాలు ఎంతో దగ్గరయ్యాయి. కలెక్టర్, పోలీసు అధికారులు ప్రజల్ల కలిసిపోయారు. కొత్తగా రెవెన్యూ డివిజన్లు చెంతకొచ్చాయి. మండలాలు చేరువయ్యాయి. ఏదైనా కష్టం వస్తే వెంటనే స్పందిస్తున్నారు. పరిష్కారం కోసం పరుగులు తీస్తున్నారు. ఇలా పాలన ముంగిట్లోకి వచ్చింది.



రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా వివేక్‌..     ఎమ్మెల్సీగా సతీశ్‌

అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి ఉమ్మడి జిల్లాలో ఎదురులేని పార్టీగా నిలిచింది. ఉన్న పది మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు టీఆర్‌ఎస్‌లోనే ఉండగా, కొత్తగా చేరిన మాజీ ఎంపీ వివేక్, మాజీ ఎమ్మెల్యే వినోద్‌తో తూర్పు ప్రాంతంలో మరింత బలోపేతమైంది. ఆదిలాబాద్‌ పూర్వ జిల్లా నుంచి జోగు రామన్న, ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి మంత్రులుగా వ్యవహరిస్తుండగా, మారిన పరిస్థితుల్లో జోగు రామన్న ఆదిలాబాద్‌ జిల్లాకు, ఐకే రెడ్డి నిర్మల్‌కు పరిమితమయ్యారు. మంచిర్యాల, ఆసిఫాబాద్‌లకు మంత్రులు లేరు. టీఆర్‌ఎస్‌లో చేరిన జి.వివేక్‌ తాజాగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులు కావడం విశేషం. అలాగే స్థానిక సంస్థల కోటాలో టీఆర్‌ఎస్‌ నేత పురాణం సతీశ్‌కు ఈ ఏడాది ఆరంభంలోనే ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ శోభారాణి అమెరికా పర్యటనకు వెళ్లడంతో చెన్నూరు జెడ్‌పీటీసీ మూల రాజిరెడ్డి తాత్కాలిక చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.



నామినేటెడ్‌ పోస్టులు లేవు.. మార్కెట్‌ కమిటీ     చైర్మన్‌లతోనే సరి..

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో నామినేటెడ్‌ పోస్టుల కోసం ఉమ్మడి జిల్లాలోని పదుల సంఖ్యలో నాయకులు ప్రయత్నాలు చేసినా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరుణించలేదు. కేవలం మార్కెట్‌ కమిటీలకు అధ్యక్షులుగా పార్టీ నాయకులను నియమించి తృప్తి పరిచారు. మంచిర్యాలకు సాగి వెంకటేశ్వర్‌రావు, ఆదిలాబాద్‌కు ఆరె రాజన్న, భైంసాకు రుక్మాబాయి, లక్సెట్టిపేటకు బియ్యాల తిరుపతి, జైనత్‌కు వనిత, బోథ్‌కు శారద, ఆసిఫాబాద్‌కు గంధం శ్రీనివాస్, సారంగాపూర్‌–రాజ్‌మహ్మద్, నిర్మల్‌–దేవేందర్‌రెడ్డి, కుభీర్‌–లక్ష్మిభాయి, ఖానాపూర్‌–నల్ల శ్రీనివాస్,  కాగజ్‌నగర్‌–ఎన్‌.పద్మ, జైనూర్‌–భగవంతరావు, చెన్నూరు–జుల్ఫికర్‌ అహ్మద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌లుగా నియమితులయ్యారు. రాష్ట్ర, జిల్లా స్థాయి కార్పొరేషన్లకు చైర్మన్‌లు, డైరెక్టర్ల పదవి కోసం గులాబీ నేతలు చేసిన ప్రయత్నాలు ఈ ఏడాది ఫలించలేదు.



కాంగ్రెస్‌లో వర్గపోరు.. ఉనికి కాపాడుకుంటున్న బీజేపీ.. కోలుకోని టీడీపీ

ముథోల్‌ నుంచి గెలిచిన ఏకైక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరగా, మాజీ ఎంపీ వివేక్, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే వినోద్‌ కూడా గులాబీజెండా కప్పుకున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీలో చురుకైన నాయకత్వం కొరవడింది. ఉన్న నాయకుల మధ్య కూడా అంతర్గత విభేదాలు పెరిగాయి. మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్యే అరవింద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు మధ్య వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు కోసం పోరు సాగుతోంది. ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కు, విశ్వప్రసాద్‌రావు, నిర్మల్‌లో మహేశ్వర్‌రెడ్డి, ఆదిలాబాద్‌లో సి.రామచంద్రారెడ్డి, భార్గవ్‌ దేశ్‌పాండే, సుజాత పార్టీని అభివృద్ధి చేసేందుకు తంటాలు పడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ బీజేపీ ఆదిలాబాద్‌ జిల్లాల్లో పుంజుకునే ప్రయత్నం చేయలేదు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో అన్ని జిల్లాలకు అధ్యక్షులను నియమించుకున్నప్పటికీ, ప్రజల్లోకి చొచ్చుకుపోయే కార్యక్రమాలను చేపట్టలేకపోతున్నారు. కేంద్రం పరిధిలోని ఐకార్‌ సభ్యుడిగా అయ్యన్నగారి భూమయ్య నియమితులు కాగా, ఇతర నాయకులు కేంద్ర పదవుల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లాల స్థాయిల్లో అధ్యక్షులు ఉన్నప్పటికీ పుంజుకోలేకపోయింది. తెలంగాణ వ్యతిరేక పార్టీగా ఉన్న పేరును తొలగించుకునే ప్రయత్నం జరగలేదు. వైఎస్‌ఆర్‌సీపీ నాలుగు జిల్లాలకు అధ్యక్షులను నియమించడం ఈ ఏడాది మరో కీలక అంశం. కొత్త సంవత్సరంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఆందోళనలకు ఆయా జిల్లాల అధ్యక్షులు  సిద్ధమవుతున్నారు.



సింగరేణి కార్మికుల స్వప్నం సాకారం

సింగరేణి సంస్థలో పనిచేసే కార్మికులు రెండేళ్ల సర్వీసుకు ముందు స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తే వారి వారసుల్లో ఒకరికి ఉద్యోగం లభించే వెసులుబాటు ఉండేది. 1998లో అప్పటి చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఈ విధానాన్ని తొలగించింది. అప్పటి నుంచి కార్మికులు, కార్మిక సంఘాలు వారసత్వ ఉద్యోగాల కోసం ఆందోళన సాగిస్తూనే ఉన్నాయి. చివరికి వారి కల ఫలించింది. దసరా లోపు ఏడాది సర్వీసు మిగిలి ఉన్న కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు కల్పించడంతో పాటు వచ్చే ఏడాది నుంచి రెండేళ్ల సర్వీసు మిగిలివున్న కార్మికులకు ఈ అవకాశాన్ని కల్పిస్తూ సింగరేణి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి చొరవతోనే ఇది కూడా సాధ్యం కావడంతో సింగరేణి కార్మికులకు ఈ ఏడాది మరిచిపోని మరో తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఈ ఏడాది జరగాల్సిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు మాత్రం వివిధ కారణాలతో నిలిచిపోయాయి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top