ఇల్లు ‘కేకో’..నట్‌

ఇల్లు ‘కేకో’..నట్‌

కొబ్బరి చెట్టు కలపతో ఇంటి ఫర్నిచర్‌

సీలింగ్, ద్వారబంధాలు, కిటీకీలు సమస్తం తయారీ

వినూత్నంగా ఇంటిని నిర్మించిన ధర్మవరం రైతు

 

ధర్మవరం (శంగవరపుకోట రూరల్‌) : కోకోనట్‌.. అదేనండి.. అచ్చ తెలుగులో కొబ్బరికాయ్‌. లేత కొబ్బరి బొండాం నీళ్లు గొంతులో జారిపోతుంటే ఎంత బావుంటుంది.. మండుటెండలో కొబ్బరాకుల పందిరి కింద సేదదీరితే ఎంత హాయిగా ఉంటుంది. ఒకాయన మధ్యప్రదేశ్‌లోని ఒక ఇంటిని చూసి విస్తుపోయాడు. కొబ్బరితో తయారైన ఫర్నిచర్‌ చూసి అబ్బురపడ్డాడు. అంతే..వెనక్కొచ్చాక తోటలోని కొబ్బరి చెట్లను కోయించాడు.  కిటీకీలు, గుమ్మాలు..ఒకటేంటి ఇంటి ఫర్నిచరంతా తయారు చేయించాడు. ఇప్పుడాయన ఇంటిని చూసిన వారంతా ‘కేకో’..నట్‌ అంటున్నారు. చూడాలనుకుంటే ధర్మవరంలోని లగుడు తిరుపతి ఇంటికెళ్లండి. ముందు ఈ కథనం చదవండి.

 

మధ్యప్రదేశ్‌లోని నాంధేడ్‌ వెళ్లి..

శంగవరపుకోట మండలం ధర్మవరం గ్రామానికి చెందిన లగుడు తిరుపతి అనే ఔత్సాహిక రైతు తన పొలంలో కొత్తరకం అరటి సాగు చేసేందుకు 2015లో మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని నాంధేడ్‌ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఒక పెద్ద రైతును కలుసుకునే ప్రయత్నంలో ఆయన పొలంలోని ఫాంహౌస్‌కు వెళ్లాడు. ఫాంహౌస్‌ ఫర్నిచర్, ద్వారాలు కొబ్బరితో తయారైనవని తెలిసి నోరెళ్లబెట్టారు. ఇలా వినియోగించిన మొత్తం కలప 65 ఏళ్ల వయసు నిండిన కొబ్బరి చెట్ల చెక్కతో తయారు చేసినవని తెలిసి అబ్బురపడ్డారు.



ఎంతో నాణ్యతతో, అందంగా కొబ్బరిచెట్టు కలపతో సొంతిల్లు నిర్మించాలని, ఫర్నిచర్‌ తయారు చేయించుకోవాలని ఆ క్షణమే నిర్ణయించుకుని వెనుదిరిగారు. స్వగ్రామం వచ్చిన వెంటనే తన ఆలోచనను తెలిసిన కార్పెంటర్‌ ముందుంచారు. ఇంకేం పొలంలోని ఎక్కువ వయసున్న కొబ్బరిచెట్ల కలపను కోయించారు. ధర్మవరంలోని పాత ఇంటి ఆధునికీకరణకు శ్రీకారం చుట్టారు. మొత్తం ఇంటి కిటికీలు, సీలింగ్, మంచం, దివాన్‌సెట్, కప్‌బోర్డ్స్‌ ఇలా ఇంటి ఫర్నిచర్‌ అంతా తయారు చేయించారు.

 

వందేళ్లకు పైగా మన్నిక: లగుడు తిరుపతి, రైతు 

మా ఇంటికొచ్చిన వారంతా ఫర్నిచర్‌ను చూసి ఆశ్చర్యపోతున్నారు. జిల్లాలో కొబ్బరిచెట్టు కలపతో ఇంటి ఫర్నిచర్‌ తయారు చేయించడం తొలిసారి చూశామని అభినందిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. కొబ్బరి చెక్కతో తయారైన వస్తువులు వందేళ్లకు పైగా మన్నుతాయని మా ఊరి కార్పెంటర్‌ శ్రీను కూడా చెప్పాడు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top