నిధులన్నీ కొడుకూ, అల్లుడికే!

నిధులన్నీ కొడుకూ, అల్లుడికే! - Sakshi


♦ కేసీఆర్‌పై రమణ, ఎర్రబెల్లి మండిపాటు

♦ రంగారెడ్డి కలెక్టరేట్ ముందు  టీడీపీ, బీజేపీ ధర్నా

 

 సాక్షి, రంగారెడ్డి/నల్లగొండ: రుణమాఫీకి మొత్తం నిధుల ను ఒకే దఫాలో చెల్లించడానికి వెనుకాడుతున్న సీఎం కేసీఆర్.. ఆంధ్రా కాంట్రాక్టర్లకు మాత్రం హడావుడిగా ఒక్కరోజులోనే రూ.5 వేల కోట్ల బిల్లులు చెల్లించడం ఏమిటని టీడీపీ ప్రశ్నించింది. స్వయంపాలనతోనే మనుగడ అన్న టీఆర్‌ఎస్ పార్టీ ఇప్పుడు ప్రాజెక్టుల కింద వేల కోట్ల రూపాయలను ఆంధ్రా కాంట్రాక్టర్లకు కట్టబెట్టడంలో అంతర్యమేంటని నిలదీసింది. రైతులకు ఒకే దఫాలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట టీడీపీ, బీజేపీ సంయుక్తంగా ధర్నా నిర్వహిం చాయి.



ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, పార్టీ శాసనసభ పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ సీఎం తన కుమారుడు, అల్లుడి శాఖలకు మాత్రమే భారీగా నిధులిస్తున్నారని, మిగతా శాఖలను నీరుగార్చే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. నీటిపారుదల కాంట్రాక్టర్లకు బిల్లులను రుణమాఫీ కింద జమ చేయాలని, లేనియెడల సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆ జీవో ప్రతులు దహనం చేస్తామన్నారు. బీజేపీ శాసనసభ పక్షనేత కె.లక్ష్మణ్ మాట్లాడుతూ  చేతకావడంలేదని కుర్చీ దిగితే.. కేంద్రంతో మాట్లాడి నిధులు ఇప్పిస్తామన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.



కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతల, వివేకానంద, గాంధీ పాల్గొన్నారు. నల్లగొండ కలెక్టరేట్ వద్ద  శుక్రవారం నిర్వహించిన రైతుదీక్షలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ  మాట్లాడుతూ టీడీపీ నేతలను చీపుర్లతో కొట్టాలన్న మంత్రి జగదీశ్‌రెడ్డి ఓ గుంటనక్క అని మండిపడ్డారు. ‘ఏ గ్రామానికెళ్లినా జగదీశ్‌రెడ్డినే చీపుర్లు, చెప్పులతో కొడతారు.’ అని అన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top