‘ముసురు’కుంది..!

ఖమ్మం వద్ద మున్నేరువాగు పరవళ్లు

  • జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు 

  • l వరద నీటితో జలాశయాలకు కళ  

  • l సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం

  • ఖమ్మం వ్యవసాయం:  ఐదు రోజుల నుంచి కురుస్తున్న వానలతో జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్ట్‌ల గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలారు. పాలేరు రిజర్వాయర్‌లోకి వరద చేరుతోంది. జిల్లాలో పెద్దదైన బయ్యారం చెరువు అలుగుపోస్తోంది. మున్నేరు, ముర్రేడు, కిన్నెరసాని తదితర వాగుల్లో నీటి ప్రవాహం పెరిగింది. 

    • సగటున 8.7మి.మీల వర్షపాతం.. 

    జిల్లాలో ఆదివారం కూడా పలుచోట్ల వర్షం కురిసింది. సగటున 8.7 మి.మీల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సత్తుపల్లి మండలం లో  3.68 సెం.మీలు, దమ్మపేట మండలంలో 3.66 సెం.మీల వర్షపాతం నమోదైంది. 9 మండలాల్లో 3సెం.మీల వరకు, 23 మండ లాల్లో 1సెం.మీ వరకు వర్షపాతం నమోదైంది. కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌ ఓ కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేయించి.. వానలు, వరదల పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర ప్రజా ప్రతినిధులతో భద్రాచలంలో సమావేశం ఏర్పాటు చేసి గోదావరి వరద కారణంగా ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతలపై సమీక్షించారు. జలాశయాల స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, తాలిపేరు, కిన్నెర సాని ప్రాజెక్టుల నీటి విడుదలపై తగిన సూచనలు చేశారు.  

    • పొంగిన వాగులు.. నిండిన జలాశయాలు 

    చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్‌ నిండింది. ఛత్తీస్‌గఢ్‌ అడవుల నుంచి వరద వచ్చి చేరుతుండడంతో గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. కిన్నెరసాని ప్రాజెక్టులోకి వరద చేరుతుండడంతో గేట్లను ఎత్తారు. జిల్లాలో పెద్దదైన బయ్యారం చెరువు అలుగు పోసింది. ఇక్కడి వరద కలవడంతో మున్నేరు ఉధృతంగా పారుతోంది. ఇల్లెందు నియోజకవర్గంలోని వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి.  

    • ఖరీఫ్‌ సంకటం..రబీకి అనుకూలం 

    ఈ వర్షాలతో ఖరీఫ్‌లోని పూత, కాత దశలో ఉన్న పత్తి చేలు దెబ్బతినే ప్రమాదముంది. ఏపుగా పెరిగిన పత్తి, మొక్కజొన్న పంటలు నేలవాలే అవకాశాలున్నాయి.అశ్వారావుపేట, సత్తుపల్లి ప్రాంతాల్లో ఇప్పటికే కొంతమేర పంటలకు నష్టం వాటిల్లింది. రబీ పంటలకు ముందుగా వర్షాలు కురవడంతో భూగర్బ జలాలు పెరిగి..సాగు బాగుంటుందని వ్యవసాయ శాఖ, రైతాంగం భావిస్తోంది. నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ కాల్వకు నీటి విడుదల లేక ఈ సారి  ఖరీఫ్‌ పంటలను వేయలేదు. ఈక్రమంలో కురిసిన వానలు..కనీసం రబీ సాగుకోసం ఆశలు సజీవం చేశాయి.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top