సంపూర్ణ తెలంగాణ లక్ష్యంగా.. పోరాటాలు


జయశంకర్ జయంతి రోజున నిరసన

తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్




గజ్వేల్: సంపూర్ణ తెలంగాణ సాధనే లక్ష్యంగా ఈనెల 6న ఫ్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా పోరాటాలను ముమ్మరం చేస్తామని తెలంగాణ జేఏసీ చైర్మన్ ఫ్రొఫెసర్ కోదండరామ్ వెల్లడించారు. మంగళవారం గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలోని లింగరాజుపల్లి, ముట్రాజుపల్లిల్లో రైతు జేఏసీ కన్వీనర్ ఫ్రొఫెసర్ జలపతిరావు, బృందంతో కలిసి ఎండిపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా గజ్వేల్లోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా వివిధ అంశాలకు సంబంధించి విభజన ప్రక్రియ పూర్తి కాక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ ఆస్తుల పంపిణీ 60శాతం పూర్తయినా మిగితాది పెండింగ్లో ఉన్నదని తెలిపారు. 54 ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల విభజన సైతం నత్తనడకన సాగుతున్నదని వెల్లడించారు. ఆంధ్ర అధికారుల పెత్తనం కారణం, ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి నెలకొన్నదని ఆరోపించారు.



రైతులను తక్షణమే ఆదుకోవాలి

తీవ్ర వర్షాభావంతో కరువు బారిన పడ్డ రైతుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరినట్టు ఫ్రొఫెసర్  కోదండరామ్ తెలిపారు. వానల్లేక రైతులు దుర్భరమైన పరిస్థితులను అనుభవిస్తున్నారని వాపోయారు. ఇన్పుట్ సబ్సిడీ పంపిణీకి చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా జీవోనెం. 421ను సవరించి రైతు ఆత్మహత్యబాధిత కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున సాయం అందే విధంగా చూడాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా రైతుల పరిస్థితి మారలేదు. పంట రుణాలు అందక రైతులు మనోధైర్యాన్ని కోల్పోతున్నారు. ఈ దుస్థితిని నివారించేందుకు కలిసికట్టుగా కషి చేయాల్సిన అవసరముంది' అని రైతు జేఏసీ కన్వీనర్, వ్యవసాయ విశ్వవిద్యాలయ మాజీ రిజిస్ట్రార్ జలపతిరావు అన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top