గ్రౌండ్‌ఫ్లోర్‌కు రక్తం ధారలుగా రావడంతో..

గ్రౌండ్‌ఫ్లోర్‌కు రక్తం ధారలుగా రావడంతో.. - Sakshi


బంజారాహిల్స్‌: ఒకటో అంతస్తు నుంచి కిందకు రక్తం ధారలుగా రావడంతో గ్రౌండ్‌ఫ్లోర్‌లో నివాసం ఉంటున్న వారు షాక్కు గురయ్యారు. తీరా అక్కడి వెళ్లి చూస్తే రక్తపు మడుగులో ఓ వ్యక్తి కనిపించాడు. జూబ్లీహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం.. మెదక్‌ జిల్లా కోహిర్‌ మండలం కవెల్లి గ్రామానికి చెందిన కల్కొడ సంధ్యారాజ్‌(28) డ్రైవర్‌గా పని చేస్తూ రహ్మత్‌నగర్‌ చేపల మార్కెట్‌ సమీపంలో ఉంటున్నాడు. ఇదే ప్రాంతంలో ఉండే ఆవుల చంద్రశేఖర్‌ అలియాస్‌ చందు(29), రమేష్‌ అలియాస్‌ బిజ్జు (28)లతో ఎన్నో ఏళ్లుగా స్నేహం ఉంది. ఈ ముగ్గురూ కలిసి గురువారం రాత్రి స్థానికంగా వైన్‌షాప్‌ వద్ద మద్యం తాగారు. తాగిన మద్యం సరిపోలేదని మళ్లీ తాగుదామని నిర్ణయించుకున్నారు. తర్వాత చందు తన ఇంట్లోని గ్యాస్‌ సిలిండర్‌ను సమీపంలోని హోటల్‌లో తనఖా పెట్టి రూ.1000 తీసుకున్నాడు.


ఆ డబ్బుతో ఫుల్‌బాటిల్‌ కొని చందు ఇంట్లో ముగ్గురూ మద్యం తాగుతుండగా బిజ్జు, సంధ్యారాజ్‌ మధ్య గొడవ జరిగి కొట్టుకున్నారు. తాగిన మత్తులో విచక్షణ కోల్పోయిన బిజ్జు నన్నే కొడతావా? అంటూ మద్యం బాటిల్‌ పగులగొట్టి సంధ్యారాజ్‌పై దాడి చేశాడు. చెవి వెనుక భాగంలో సీసాతో గట్టిగా పొడవడంతో తీవ్రరక్తస్రావమైంది.  చేతులు, కడుపుపై కూడా గాట్లు పడ్డాయి. అనంతరం చందు, బిజ్జు అక్కడి నుంచి పరారయ్యారు.


శుక్రవారం ఉదయం 7 గంటలకు చందు కుటుంబ సభ్యులు మొదటి అంతస్తు నుంచి గ్రౌండ్‌ఫ్లోర్‌కు రక్తం ధారలు కట్టడంతో ఏం జరిగిందోనని చూసేసరికి పైన రక్తపుమడుగులో సంధ్యారాజ్‌ మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు పరారీలో ఉన్న చందు, బిజ్జులను అరెస్ట్‌ చేశారు. వీరిలో బిజ్జు కారు డ్రైవర్‌ కాగా, చందు ప్రైవేట్‌ ఉద్యోగిగా పని చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. తాగిన మత్తులో అకారణం జరిగిన గొడవ హత్యకు దారి తీసిందని పోలీసుల వెల్లడించారు.  కేసు దర్యాప్తులో ఉంది.



మృతుడు సంధ్యారాజ్‌(ఫైల్)

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top