యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా..

యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా..

-విషయాన్ని తహసీల్దార్‌కు తెలిపిన విలేకరులు

- ఇరిగేషన్‌ ఏఈకి తహసీల్దార్‌ క్లాస్‌

- చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఏఈ

- మట్టి తరలింపును అడ్డుకున్న పోలీసులు

 

మిడుతూరు : మండలంలోని మద్దిగుండం చెరువు నుంచి మట్టి అక్రమంగా తరలిపోతోంది. నందికొట్కూరు నియోజకవర్గ అధికార పార్టీ నేత అండదండలతో మండలంలోని పలు గ్రామాలకు చెందిన టీడీపీ నేతలు ఈ చర్యలు పాల్పడతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా మైనర్‌ ఇరిగేషన్‌ అధికారులు చోద్యం చూస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 

ముందస్తు అనుమతులు..

మద్దిగుండం చెరువులో 20 రోజుల కిత్రం ఓ నీటి సంఘం చైర్మన్‌కు మైనర్‌ ఇరిగేషన్‌ అధికారులు రైతుల పొలాలకు మట్టిని తవ్వుకునేందుకు అనుమతులు ఇచ్చినట్లు సమాచారం. జిల్లా కలెక్టర్‌ నీరు – ప్రగతి కార్యక్రమంలో భాగంగా చెరువుల్లో పూడికతీత పనులకు అనుమతులు మంజూరు చేయకమునుపే మైనర్‌ ఇరిగేషన్‌ అధికారులు సదరు చైర్మన్‌కు అనుమతివ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

 

ట్రాక్టర్‌కు రూ.100 వసూలు

మద్దిగుండం చెరువు సమీపంలోని గ్రామాలకు చెందిన కొందరు నాయకులు సైతం అక్రమంగా మట్టిని తవ్వుకునేందుకు ఆరు హిటాచీలను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఒక్కో ట్రా‍క్టర్‌ మట్టికి రూ.90 నుంచి రూ.100 దాకా వసూలు చేస్తున్నట్లు రైతులు, ట్రాక్టర్లు డ్రైవర్లు పేర్కొంటున్నారు.

 

విలేకరుల చొరవతో..

మట్టిని అక్రమంగా తరలిస్తున్న విషయాన్ని విలేకరులు తహసీల్దార్‌ భూలక్ష్మి, మైనర్‌ ఇరిగేషన్‌ ఏఈ లక్కప్ప  దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన తహసీల్దార్‌ వెంటనే  మైనర్‌ ఇరిగేషన్‌ ఏఈతో ఫోన్‌లో మట్టి తవ్వకం పనులపై ఆరా తీశారు. మట్టి తరలింపుతో చెరువుకట్ట బలహీనమై ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని తహసీల్దార్‌ హెచ్చరించారు. దీంతో చివరకు ఆయనస్థానిక పోలీస్‌ స్టేషన్‌కు చేరుకొని ఎస్‌ఐ సుబ్రహ్మణ్యంకు మౌఖిక ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ సిబ్బందిని పంపించి పనులను నిలిపివేయించారు.  ఇదిలా ఉండగా వారం రోజులపైబడి తవ్వకం పనులు జరుగుతున్నా అధికార పార్టీ ఒత్తిడితో స్పందించని మైనర్‌ ఇరిగేషన్‌ అధికారులు పాత్రికేయులు మట్టి తరలింపును పరిశీలించే ందుకురావడంతో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే అక్రమ తవ్వకందారులపై ఎలాంటి చర్యలు చేపట్టకుండా వదలివేయడం పట్ల రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top