కరీం‘నగరం’లో మాయగాడు..

వివరాలు వెల్లడిస్తున్న సీపీ, నిందితుడు సాయికుమార్‌ (వెనక వ్యక్తి)  బాధితులకు ఇచ్చిన అపాయింట్‌మెంట్‌ లెటర్, సర్వీస్‌బుక్‌లు - Sakshi

ఉద్యోగాలు ఇప్పిస్తానని ఘరానా మోసం
కొందరికి అపాయింట్‌మెంట్‌ లెటర్లు
ఓ యువతికి ఏకంగా తహసీల్దార్‌ ఉద్యోగం
సర్వీస్‌బుక్‌ అందజేత
పలువురికి రూ.17 లక్షల టోపీ
నిందితుడిని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

కరీంనగర్‌ క్రైం: కరీం‘నగరం’లోని ఉద్యోగాల మాయగాడిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టించి అపాయింట్‌మెంట్‌ లెటర్లు ..సర్వీస్‌ బుక్‌లు అందించి పలువురి నుంచి రూ.17 లక్షల వరకు దండుకున్న బాగోతం బయటపడింది. కరీంనగర్‌ కమిషనరేట్‌లోని హెడ్‌క్వార్టర్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ కమలాసన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు.

కరీంనగర్‌ జిల్లా మానకొండూరు మండలం వెల్ది గ్రామానికి చెందిన రామగిరి సాయికుమార్‌(22) సిరిసిల్లలో అగ్రహరం పాలిటెక్నిక్‌ కాలేజీలో డిప్లొమా కోర్స్‌ చేశాడు. చెడు అలవాట్లు, జల్సాలకు అలవాటు పడి అమాయకులను మోసం చేయాలని నిర్ణయించుకుని రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, పలువురు ఉన్నతాధికారులు బాగా పరిచయమని నమ్మించేవాడు. తన తండ్రి కూలీగా పని చేస్తుండగా పెద్ద కోటిశ్వరుడని దుబాయ్‌లో  పలు కంపెనీలు ఉన్నాయని తన భార్యతో గొడవలు జరిగి ఇక్కడి వచ్చానని  నమ్మించేవాడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని అందినకాడికి దండుకుని పారిపోవడం పనిగా పెట్టుకున్నాడు.  

ఒక్కొక్కరిని ఒక్కో రకంగా మోసం
కరీంనగర్‌లోని జ్యోతినగర్‌కు చెందిన దయ్యాల రజిత అనే డిగ్రీ చదువుతున్న యువతికి కలెక్టరేట్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వారి నుంచి రూ.4 లక్షలు వసూలు చేశాడు. ఉద్యోగంలో జాయిన్‌ చేయిస్తానని చెప్పి అమెను సిరిసిల్ల కలెక్టరేట్‌కు తీసుకెళ్లి అక్కడ సార్‌ లేరని నీకు జాబ్‌ ఒకే అయిందని నమ్మించాడు. నెల రోజుల శిక్షణ ఉందని హైదరాబాద్‌ జీఎంహెచ్‌సీలో ట్రెయినింగ్‌ ఉందని కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లి అక్కడ తిప్పి వచ్చేవాడు. నెలతర్వాత పదోన్నతి కల్పించారని నమ్మించి రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్తగా ఏర్పడ్డ తంగళ్లపల్లి తహసీల్దార్‌గా వచ్చిందని అపాయింట్‌మెంట్‌ లెటర్‌తోపాటు సర్వీస్‌బుక్‌ అందించాడు. ఈ విషయం ఎవరికి చెప్పవద్దని మళ్లీ పోటీకి వస్తారని వారిని బురిడీ కొట్టించాడు. ఉద్యోగం వచ్చిందని షిర్డీకి వెళ్లి మొక్కుకుని వద్దామని చెప్పి హైదరాబాద్‌ నుంచి విమానంలో ఔరంగాబాద్‌ వరకూ అక్కడి నుంచి షిర్డీకి వెళ్లి అక్కడ స్టార్‌ హోటల్‌లో బస చేయించాడు. తిరిగి మళ్లీ విమానంలో వచ్చారు. ఇలా లక్ష  ఖర్చు చేయించాడు. తహసీల్దార్‌కు కారు ఉండాలని కారు కొనిపించాడు.

ఉన్న ఉద్యోగం వదులుకుని..
హైదరాబాద్‌లోని నేరేట్‌మెట్‌కు చెందిన తొంటి పర్శరాములు–అంజలి దంపతులను పరిచయం చేసుకున్నారు. పర్శరాములు ప్రైవేట్‌ కంపెనీలో నెలకు రూ.30 వేల వేతనంలో పని చేస్తుండగా పర్శరాములుకు జీఎంహెచ్‌సీలో సీనియర్‌ అసిస్టెంట్‌గా అంజలికి ఇబ్రహీంపట్నం సమీపంలోని బోంగుళూర్‌ మోడల్‌ స్కూల్‌లో జానియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి వారి నుంచి రూ.3 లక్షలు తీసుకుని వారికి  అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇచ్చాడు. స్కూల్‌కు తీసుకెళ్లి అధికారులను నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆర్డర్‌ రాలేదని చెప్పడంతో పాఠశాల సమీపంలో నివాసం ఉండాలని చెప్పడంతో ఉన్న ఉద్యోగం వదలి అక్కడే ఉన్నారు. ఎంతకీ ఉద్యోగం రాకపోయే సరికి పోలీసులకు ఆశ్రయించారు.

 డ్రైవర్‌ ఉద్యోగం అంటూ..
ముత్త శ్రీౖశైలంను పరిచయం చేసుకొని కొత్తగా సృష్టించిన తహసీల్దార్‌ వద్ద ప్రభుత్వ డ్రైవర్‌గా అతడి భార్య శరణ్యకు మోడల్‌ స్కూల్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి దానికి రూ. 2.5 లక్షలు ఖర్చ అవుతాయని తెలుపగా రూ.1.30 లక్షలు ముట్టచెప్పారు. కొద్దిరోజులకు శ్రీశైలంనకు తంగళ్లపల్లి తహసీల్దార్‌కు డ్రైవర్‌గా అతడి భార్యకు కరీంనగర్‌ కలెక్టరేట్‌లో అటెండర్‌ ఉద్యోగం వచ్చిందని అపాయింట్‌మెంట్‌ లెటర్లు సర్వీస్‌ బుక్‌లు ఇచ్చాడు.

సముద్రాల మోడల్‌ స్కూల్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చిందని చిమ్మల సంతోష్‌కు అపాయింట్‌మెంట్‌ లెటర్‌ ఇవ్వడమే కాకుండా స్కూల్‌కు తీసుకెళ్లి అధికారులకు లెటర్‌ చూపించాడు. ఎలాంటి ఆర్డర్‌ రాలేదని అక్కడి వారు చెప్పడంతో మరో రెండుమూడు రోజుల్లో వస్తుందని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాడు. అతడు ఇచ్చిన రూ.1.50 వేలతో జల్సాలు చేసుకొని కొత్తగా కారును కూడా కొనుగోలు చేశాడు.  

దుబాయి పారిపోయి.. టాస్క్‌ఫోర్స్‌కు చిక్కి..
ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోవడంతో సాయికుమార్‌ను నిలదీసి టాస్క్‌ఫోర్స్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతడికోసం వెతకడంతో విషయం తెలుసుకున్న సాయికుమార్‌ ఈనెల4వ తేదీన దుబాయి పారిపోయాడు. జల్సాలకు అలవాటు పడడంతో అక్కడ కూడా ఎలాంటి పని చేయలేకపోయాడు. తిరిగి కరీంనగర్‌ రాగా పక్కా సమాచారంతో శుక్రవారం టాస్క్‌ఫోర్స్‌ ఎస్సైలు కిరణ్, సంతోష్, నాగరాజు పట్టుకున్నారు. సాయికుమార్‌పై అప్పటికే కరీంనగర్‌ టుటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో మూడు కేసులు, బెజ్జంకి పీఎస్‌లో ఒకటి, నేరేడుమెట్‌ పోలీస్‌స్టేషన్‌లో ఒక కేసు నమోదు అయింది. అరెస్టు చేసి రిమాండ్‌ పంపుతున్నట్లు సీపీ తెలిపారు.

నకిలీలను నమ్మవద్దు
ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఒక క్రమపద్ధతి ప్రకారం భర్తీ చేస్తారని డబ్బు ఇస్తే ఎలాంటి ఉద్యోగాలు రావని తెలిపారు. ఇలాంటి నకిలీలను నమ్మి మోసపోద్దన్నారు. చివరకు అటెండర్‌ జాబు రావాలన్నా కూడా ఒక పద్ధతిగా భర్తీ ఉంటుందని తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

టాస్క్‌ఫోర్స్‌కు రివార్డులు
మహామాయగాడిని చాకచక్యంగా పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ సీఐ గౌస్‌బాబా, ఎస్సైలు కిరణ్, సంతోష్, నాగరాజులను సీపీ ప్రత్యేకంగా అభినందించి నగదు రివార్డులు అందించారు. – సీపీ కమలాసన్‌రెడ్డి

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top