ఫోర్త్‌ లయన్‌ యాప్‌ కొత్త వెర్షన్‌ విడుదల

ఫోర్త్‌ లయన్‌ యాప్‌ కొత్త వెర్షన్‌ విడుదల - Sakshi


భవానీపురం : ఫోర్త్‌ లయన్‌ యాప్‌ను ప్రజలకు మరిన్ని సేవలను అందించేందుకుగాను దానిని ఆధునీకరించి రూపొందించిన కొత్త వెర్షన్‌ను విడుదల చేశారు. ఈ మేరకు నగర పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం నుంచి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గూగుల్‌ ప్లే స్టోర్‌ ద్వారా ఈ యాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని కోరారు. కొద్ది రోజులలో ఐఓఎస్‌ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.



యాప్‌ కొత్త వెర్షన్‌లో పొందుపరిచిన సౌకర్యాలు

► హోమ్‌ పేజి డిజైన్‌ మార్చి మరింత ఆకర్షణీయంగా నగర పోలీస్‌ వెబ్‌సైట్‌ వివరాలు ఇచ్చారు

► పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌లోని పోలీస్‌ స్టేషన్‌ ఆప్షన్‌లో ఆ స్టేషన్‌ను కాంటాక్ట్‌ చేసేందుకు ఫోన్‌ నెంబర్, స్టేషన్‌ ఉండే ప్రాంతాన్ని మ్యాప్‌లో చూపించారు.

► నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని అధికారుల వివరాలు, వారి ఫోన్‌ నెంబర్లు పొందుపరిచారు. తద్వారా వారిని ఫోన్‌ ద్వారా సంప్రదించే అవకాశం కల్పించారు.

► రహదారులలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాల (లైవ్‌ ట్రాఫిక్‌లో బ్లాక్‌ స్పాట్స్‌) వివరాలను ఇచ్చారు. ఈ సమాచారంతో బ్లాక్‌ స్పాట్స్‌ వద్ద జాగ్రత్తగా ప్రయాణం చేయవచ్చు. అలాగే ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి  పోలీస్‌ స్టేషన్, హాస్పటల్‌ ఎంత దూరంలో ఉంది అనే వివరాలను పొందుపరిచారు. రాబోయే వెర్షన్‌లో దీనిని మరింత మెరుగుపరచనున్నారు.



యాప్‌లో ప్రత్యేక సర్వీసులు

► మహిళా భద్రత కోసం ప్రత్యేకంగా ‘ట్రాక్‌ మై ట్రావెల్‌’, ఎస్‌ఓఎస్‌ను పొందుపరిచారు. ఏదైనా ప్రమాదాన్ని ఊహిస్తే యాప్‌లో ఈ బటన్‌ను నొక్కడం వలన పోలీసులు అప్రమత్తమై మీరు ఉన్న ప్రాంతానికి అతి తక్కువ సమయంలో చేరుకుని రక్షిస్తారు.

► నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధానిగా రూపుదిద్దుకుంటున్న తరుణంలో విజయవాడ నగరం, చుట్టు పక్కల ప్రాంతాలలో స్థిరపడేందుకు ఉద్యోగరీత్యాగానీ, జోవనోపాధి కోసంగానీ ఎంతోమంది  వస్తున్నారు. అటువంటివారికి ఇల్లు అద్దెకు ఇచ్చేటప్పుడు, కొత్తగా పనులలో కుదుర్చుకునేటప్పుడు, డ్రైవర్లను నియమించుకునే సమయంలో వారి వివరాలను ఈ యాప్‌లోని ‘వెరిఫికేషన్‌’ ఆప్షన్‌ ద్వారా పంపితే, పోలీసులు వారి గురించి విచారించి వారి వివరాలను దరఖాస్తుదారునికి తెలియచేస్తారు. మంచివారిని పనిలోకి తీసుకోవడం, సరైనవారికి ఇల్లు అద్దెకు ఇచ్చుకోవడం ద్వారా ఇబ్బందులు లేకుండా చేసుకోవచ్చు.

► ఊరు వెళ్లాల్సివచ్చినప్పుడు ఇంటి వివరాలను వెకేషన్‌ ఇన్ఫర్మేషన్‌లో పొందుపరిస్తే, ఆ ప్రాంతంలో పోలీసు బీటును ఏర్పాటు చేస్తారు.

ప్రజలందరూ ఈ యాప్‌ను ఉపయోగించుకుని పోలీసుల సేవలను అందుకోవాలని కోరారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top